ఒక్క సినిమా చేశాడో లేదో.. రామ్ చరణ్‌తో కలసి పని చేసే అవకాశం దక్కించుకొన్నాడు సంపత్ నంది. రచ్చ, బెంగాల్ టైగర్లతో కమర్షియల్ దర్శకుడు అనిపించుకొన్నాడు. ఇప్పుడు సంపత్ నంది నుంచి మరో సినిమా వస్తోంది.. అదే.. `గౌతమ్ నంద`. గోపీచంద్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం శుక్రవారం విడుదల అవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు సంపత్ నందితో తెలుగు 360.కామ్ చేసిన చిట్ చాట్ ఇది!
* హాలో అండీ..
– హాయ్..
* రిలీజ్‌కి ముందు టెన్షన్ పడుతున్నారా?
– కొంచెం ఉంది. ఇది వరకటి సినిమాలకు ఇలా భయపడలేదు. ఎందుకంటే అవన్నీ పక్కా కమర్షియల్ సినిమాలే. `ఏదోలా ఆడేస్తాయి` అన్న నమ్మకం నాది. బలమైన కథ, కథనాలతో తెరకెక్కించిన చిత్రమిది. ఈ సినిమా నాకు చాలా ముఖ్యం. అందుకే.. కాస్త టెన్షన్ ఉంది.
* అంటే మీ ఇదివరకటి సినిమాల్లో పెద్దగా కథ లేదని ఒప్పుకొంటున్నారా?
– కథకంటే కమర్షియల్ ఎలిమెంట్స్‌కి ప్రాధాన్యం ఇచ్చాం. రచ్చ, బెంగాల్ టైగర్లలో బలమైన ఫ్లాష్ బ్యాక్‌లు ఉంటాయి. దాంతో పాటు కథ ఇంకాస్త స్ట్రాంగ్‌గా ఉంటే బాగుండేది అనుకొనేవాడ్ని. అది.. గౌతమ్ నందలో దొరికింది.
* హీరో పేరు ఘట్టమనేని గౌతమ్ నంద అట కదా..
– అవునండీ. కథ ప్రకారం కథానాయకుడు బాగా డబ్బున్నవాడు. సొసైటీలో స్టేటస్ ఉన్న వాడు. ఘట్టమనేని అనే ఇంటిపేరు ఉన్నవాళ్లంతా వెల్ సెటిల్డ్. అందుకే… ఆ పేరు పెట్టాం.
* గోపీచంద్‌ని చాలా స్టైలీష్ గా చూపించారు..
– స్టైల్. లుక్ కోసం చాలా కష్టపడ్డాం. మీలాంటి వాళ్లంతా లుక్ బాగుంది అంటుంటే చాలా సంతోషంగా అనిపిస్తోంది. కథ అనుకొన్న వెంటనే.. లుక్ ఎలా ఉండాలి అనే విషయంలో తర్జన భర్జనలు పడ్డాం. నాకు నేనుగా కొన్ని స్కెచ్చులు డిజైన్ చేశాను. వాటిలో ఒకటి గోపీచంద్ కి బాగా నచ్చింది. అదే ఫైనల్ చేశాం.
* బడ్జెట్ పెరిగిపోయిందంటున్నారు?
– లేదండీ. కథకు తగ్గట్టుగానే ఖర్చు పెట్టాం. ముందు ఎంత అనుకొన్నామో అంతే అయ్యింది. ఇలాంటి సినిమాలకు మినిమం బడ్జెట్లు సరిపోవు. అయితే ఒకటి అటు గోపీచంద్ కెరీర్లోనూ, ఇటు నా కెరీర్లోనూ అత్యధిక బడ్జెట్ చిత్రమిదే.
* మీ ప్రతి కథలోనూ ఇద్దరు హీరోయిన్లు ఉండాల్సిందేనా?
– అదేం రూల్ కాదు. కానీ కమర్షియల్ కథల్లో ఇద్దరు హీరోయిన్లను చూస్తే బాగుంటుంది కదా? (నవ్వుతూ). బెంగాల్ టైటర్లో కథానాయికలిద్దరివీ కీలకమైన పాత్రలే. ఇందులోనూ అంతే. కథకు అవసరంలేని పాత్ర ఒక్కటీ కనిపించదు.
* దర్శకుడిగా మీ బలం ఏంటి?
– అది ప్రేక్షకులు చెప్పాలి. నా వరకూ… ఓ కథని జనరంజకంగా చెప్పగలను అనే నమ్మకం ఉంది. కథలో డెప్త్ పెరిగిన కొద్దీ.. రీచ్ ఎక్కువగా ఉంటుంది. జనతా గ్యారేజ్, శ్రీమంతుడు.. ఇవన్నీ కమర్షియల్ కథలే. కానీ.. అందులో డెప్త్ ఉంటుంది. అందుకే ఆ స్థాయిలో విజయాల్ని అందుకొన్నాయి. గౌతమ్ నంద కూడా కథాబలంతో సాగే చిత్రమే.
* తదుపరి సినిమా ఎవరితో?
– ఓ కథ రాస్తున్నా. అది రాసిన తరవాతే… హీరో ఎవరన్నది తెలుస్తుంది.
* నిర్మాతగా గాలిపటం తీశారు. అలాంటి ప్రయత్నాలు కొనసాగిస్తారా?
– తప్పకుండా. ప్రస్తుతం పేపర్ బోయ్ అనే సినిమా రూపొదిస్తున్నా. కథ నేనే అందించా. జయ శంకర్ దర్శకుడు. కొత్త కాన్సెప్టులతో నా బ్యానర్లో సినిమాలు వస్తూనే ఉంటాయి.