తెలంగాణలో తెలుగుదేశం పార్టీ తరపున గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేల్లో ఒకరు సండ్ర వెంకట వీరయ్య.. టీఆర్ఎస్లో చేరుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం నుంచి గెలుపొందిన సండ్ర వెంకటవీరయ్య అధికారికంగా టీడీపీకి రాజీనామా చేశారు. కార్యకర్తల అభిప్రాయం మేరకు పార్టీ మారుతున్నానని, టీఆర్ఎస్ పార్టీలో ఎప్పుడు చేరేది త్వరలో చెబుతానన్నారు. అవసరమైతే టీడీపీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టీఆర్ఎస్ బీ ఫారంపై పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని వెంకటవీరయ్య ప్రకటించారు. ఇప్పటికే మరో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, రేగ కాంతారావు టీఆర్ఎస్లో చేరుతున్నట్లు ప్రకటించారు.
ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచే సండ్ర టీఆర్ఎస్లో చేరబోతున్నారన్న వార్తలు వచ్చాయి. ఏపీ ప్రభుత్వం ఆయనకు.. టీటీడీ బోర్డు పదవి ఇచ్చినా.. ఆయన తీసుకోలేదు. దాంతో.. ఆ పదవిని టీడీపీ వెనక్కి తీసుకుంది. కేసీఆర్ను కూడా రెండు సార్లు కలిశారు. పార్టీలో చేరేందుకు సంసిద్ధత తెలిపారు. సీఎం నుంచి స్పష్టమైన హామీ లభించాకే సండ్ర పార్టీ మారుతున్నట్లు తెలుస్తోంది. మంత్రివర్గంలో ఆయనకు అవకాశం ఇస్తారని చెబుతున్నారు. మరో టీడీపీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరర్ రావు మాత్రం.. టీఆర్ఎస్లో చేరేందుకు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు.
నిజానికి సండ్ర వెంకట వీరయ్య.. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లోనూ .. టీడీపీని వీడదలేదు. రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో పట్టుబడిన తర్వాత.. తెలంగాణలో టీడీపీ పరిస్థితి దారుణంగా మారింది. ఆ కేసులో సండ్ర వెంకట వీరయ్య ఏ-3గా ఉన్నారు. అప్పట్లోనే ఆయన టీఆర్ఎస్లో చేరాలనే ఒత్తిడి వచ్చినా… తలొగ్గలేదు. చివరికి జైలుకు కూడా వెళ్లారు. అయినా.. ఎన్నికల ముందు కూడా ఆయనపై ఒత్తిడి వచ్చింది. ఆయినా టీడీపీలోనే ఉన్నారు. సత్తుపల్లిలో ఆయనను ఓడించడానికి అందరూ ఏకమైనా ఆయన విజయం సాధించారు. గెలిచిన వెంటనే.. టీఆర్ఎస్లో చేరాలని మానసికంగా సిద్దమైపోయారు.