తెలంగాణ తెలుగుదేశం ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య… ఆయన త్వరలోనే అధికార పార్టీ తెరాసలో చేరతారనేది దాదాపు ఖరారైన విషయంగానే చెప్పొచ్చు. సొంత పార్టీ తెలుగుదేశానికి నెమ్మదిగా దూరమౌతూ ఉన్నారు. తాజాగా, ఏపీ ప్రభుత్వం ఇచ్చిన తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యత్వాన్ని కూడా ఆయన తీసుకోలేదు. అంటే, టీడీపీకి దూరమయ్యేందుకు ఆయన మార్గం సుగమం చేసుకున్నారని అనుకోవచ్చు. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి… అధికార పార్టీ తెరాసపై, ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలపై ప్రశంసలు కురిపించారు సండ్ర.
శాసన సభలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పై చర్చ సందర్భంగా సండ్ర మాట్లాడారు. కేసీఆర్ సర్కారు అమలు చేస్తున్న రైతుబంధు పథకం, పంటలను ఆదుకునే విధంగా విద్యుత్ విధానంలో అమలు చేస్తున్న సంస్కరణలు అద్భుతంగా ఉన్నాయంటూ పొగడ్తలతో ముంచెత్తారు. ప్రభుత్వం ఇప్పుడు అమలు చేస్తున్న పథకాలు భవిష్యత్తులో కూడా కొనసాగించాలని కోరారు. గతంలో నిరుపేదలకు నాణ్యమైన విద్య అందించాలని ఎన్టీఆర్ ప్రయత్నించారనీ, అదే స్ఫూర్తితో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టి… ఎస్సీ, ఎస్టీ, బీసీలతోపాటు మైనారిటీలకు నాణ్యమైన విద్య అందిస్తున్నారని మెచ్చుకున్నారు. ఎన్టీఆర్ మండల వ్యవస్థను నెలకొల్పితే, ఈరోజున కేసీఆర్ కొత్త జిల్లాలు, పంచాయతీలు తీసుకొచ్చి ప్రజలకు మెరుగైన పరిపాలన అందించేందుకు చేస్తున్న ప్రయత్నం బాగుందంటూ మెచ్చుకున్నారు.
పార్టీలో చేరక ముందే, కండువా మార్చుకోకముందే మాట తీరును పూర్తిగా మార్చేశారు సండ్ర. తెరాసలో చేరే వరకైనా ఆయన ఓపిక పట్టలేకపోతున్నారన్నట్టుగా ఉంది! వాస్తవానికి, ఎన్నికలు జరిగి ఇంకా రెండు నెలలు మాత్రమే అయింది. ప్రస్తుతం జరుగుతున్న ఈ తొలి బడ్జెట్ సమావేశంలోనైనా… గెలిచిన పార్టీ తరఫున మాట్లాడితే కొంతైనా అర్థవంతంగా ఉండేది. కనీసం ఈ సమావేశాలు పూర్తయ్యే వరకైనా… టీడీపీ ఎమ్మెల్యేగా ఆయన వ్యవహరిస్తే, ఆయన్ని అదే పార్టీ తరఫున గెలిపించిన స్థానిక ప్రజలు కూడా హర్షించే పరిస్థితి ఉంటుంది. అధికార పార్టీ అండ కోసం పరుగులు తీయడం అనేది నేటి రాజకీయాల్లో ఒక రొటీన్ వ్యవహారంగా మారిపోయింది. అయితే, పార్టీ మారే వరకైనా టిక్కెట్టు ఇచ్చి గెలిపించిన పార్టీని గుర్తుంచుకోకపోతే… దీన్ని ఏ తరహా రాజకీయం అంటారో మరి! సభలో సండ్ర అలా మాట్లాడుతుంటే… ఆయన తెరాస ఎమ్మెల్యే ఏమో అన్నట్టుగా ఉంది..!