ఈ సంక్రాంతి నిజంగా సినీ అభిమానులకు, సినీ నిర్మాతల కు పంట పండించింది. ఓటిటి తదితర కారణాల వల్ల భవిష్యత్తు లో థియేటర్ల కు జనాలు రారేమోనని గత ఏడాది వచ్చిన సందేహాలను ఈ సంక్రాంతి పూర్తి స్థాయి లో పటాపంచలు చేసింది. వివరాల్లోకి వెళ్తే..
2020 సంవత్సరం లో కోవిడ్ మహమ్మారి ప్రపంచ గతిని మార్చేసింది. ప్రేక్షకులు ఓటీటీల కు అలవాటు పడడం, ప్రపంచ స్థాయి సినిమాలు చూడడం, హై క్వాలిటీ వెబ్ సిరీస్ చూడడం వంటి కారణాల వల్ల థియేటర్లకు వెళ్లి సినిమాలు చూసే అలవాటు ను ప్రేక్షకులు తగ్గించుకున్నారు అన్న అభిప్రాయం 2020-22 మధ్య సర్వత్రా వినిపించింది. 2020 నుండి 2022 సంవత్సరం మధ్యలో వచ్చిన సినిమా ల ఫలితాలను చూసిన వారు సైతం- RRR, KGF 2 వంటి హై బడ్జెట్ సినిమాలను, కాంతార వంటి అత్యంత వైవిధ్యమైన కథలను మాత్రమే ప్రేక్షకులు థియేటర్లలో చూస్తున్నారని, సాదా సీదా కథలతో తెరకెక్కిన సినిమాల ను ఇంట్లోనే కూర్చుని ఓటీటీ లో చూస్తున్నారని సినీ విమర్శకులు సైతం అభిప్రాయపడ్డారు. భవిష్యత్తు లో అటువంటి కొన్ని అసాధారణ సినిమాలను మాత్రమే ప్రేక్షకులు థియేటర్లలో చూస్తారని, మిగతా సినిమాలకు థియేటర్ల దాకా జనాలు కదలి రారని కొంతమంది నిర్మాతలు సైతం అభిప్రాయపడ్డారు.
అయితే అటువంటి అభిప్రాయాలను, రోటీన్ కధలను చూడడానికి ప్రేక్షకులు థియేటర్ల వైపు రారేమో అన్న అనుమానాలను 2023 సంక్రాంతి పటాపంచలు చేసింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ సారథ్యంలో ఈ సంక్రాంతి కి విడుదలైన వీర సింహా రెడ్డి మరియు వాల్తేరు వీరయ్య సినిమాలు కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాయి. నిర్మాతలు అధికారికంగా ప్రకటించిన లెక్కల ప్రకారం వీర సింహారెడ్డి సినిమా 4 రోజులలో 104 కోట్ల గ్రాస్ సాధిస్తే, వాల్తేరు వీరయ్య అంతకు మించిన రీతిలో, 3 రోజుల లోనే 108 కోట్ల గ్రాస్ వసూలు చేసి సంచలనం సృష్టించింది. అమెరికాలో సైతం బాలకృష్ణ 1 మిలియన్ డాలర్ల వసూళ్లను సాధిస్తే, చిరంజీవి సినిమా 2 మిలియన్ డాలర్ల కళ్ళు చెదిరే వసూళ్లకు అత్యంత చేరువ లో ఉంది. ఏ హీరో సినిమా ఎక్కువ కలెక్షన్లు కొల్లగొట్టింది, ఎవరి సినిమా ముందుగా బ్రేక్ ఈవెన్ అయింది లాంటి గొడవలను ప్రస్తుతానికి పక్కన పెడదాం. కానీ, ఈ ఇద్దరు హీరోల గత సినిమాల కంటే ఈ వసూళ్లు చాలా ఎక్కువ అన్న విషయాన్ని మాత్రం ఇద్దరు హీరోల అభిమానులు గుర్తిస్తున్నారు. బాలకృష్ణ కెరీర్ లోనే అతి పెద్ద హిట్ ల లో ఒకటిగా నిలిచిన అఖండ సినిమా కలెక్షన్ లని వీర సింహారెడ్డి సునాయాసంగా దాటివేస్తే, చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత వచ్చిన సినిమాలు అన్నింటిలోకి అతి పెద్ద హిట్ గా వాల్తేరు వీరయ్య నిలవనుందని ట్రేడ్ వర్గాల సమాచారం.
ఈ ఎపిసోడ్ లో అత్యంత ప్రధానమైన విషయం ఏమిటంటే ఈ రెండు సినిమాలు కూడా అత్యంత సాధారణమైన రొటీన్ కథలతో తెరకెక్కినవే. ఓటిటీ లో కనిపిస్తున్న ఇతర దేశాల కథల కంటే ఉన్నతమైన కథలు ఉంటేనో లేక థియేటర్ లో చూస్తే మాత్రమే ఆస్వాదించగల గొప్ప టెక్నికల్ ఎఫెక్ట్స్ ఉంటేనో మాత్రమే ప్రేక్షకులు థియేటర్ల కు వస్తారని గత ఏడాది జరిగిన ప్రచారమంతా ఉట్టిదేనని, స్టార్ హీరోల చరిష్మా, ఆ హీరో ల పట్ల ప్రేక్షకులు, ఆయా హీరోల అభిమానులు తమ గుండెల్లో దాచుకున్న అభిమానం ఏ మాత్రం చెక్కు చెదరలేదని ఈ సంక్రాంతి వందల కోట్ల వసూళ్ల సాక్షిగా నిరూపించింది. థియేటర్లో పేపర్లు చించి వేయడం, హాల్లో పాటలప్పుడు డాన్స్ లు చేయడం, హీరోల కి లార్జర్ దెన్ లైఫ్ సైజ్ కటౌట్లు కట్టడం, తెల్లారుజామున షోలకి ఫ్యాన్స్ క్యూలు కట్టడం వంటి ప్రీ-కోవిడ్ సంప్రదాయాలు మళ్లీ కనిపించడం లాంటి పరిణామాలు – ప్రేక్షకులు థియేటర్ల లో సినిమాలు చూడడానికి ఇప్పటికీ అదే రకమైన ఉత్సాహం చూపిస్తున్నారని నిరూపించాయి.
తెలుగు సినీ పరిశ్రమ లోనే కాకుండా తమిళ పరిశ్రమలో సైతం ఇదే తరహా పరిణామాలు కనీపించాయి. కథాపరంగా గొప్పగా లేకపోయినప్పటికీ, అజిత్ , విజయ్ ల సినిమాల కి ప్రేక్షకులు క్యూ కట్టారు. మొత్తానికి సినీ పరిశ్రమకి థియేటర్ రెవెన్యూ విషయంలో పూర్వవైభవం వచ్చేలా ఈ సంక్రాంతి చేసిందని సినీ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. మరి ఆయా సినీ పరిశ్రమ లు ఈ ఉత్సాహాన్ని, విజయాలను భవిష్యత్తులోనూ కొనసాగిస్తాయా అన్నది వేచి చూడాలి.
– జురాన్ ( @CriticZuran)