12న రెండు,
13న రెండు,
పద్నాలుగున ఒకటి,
మధ్యలో కొన్ని అరవ డబ్బింగ్ సినిమాలు!
– ఇదీ సంక్రాంతి లెక్క.
ఈ సంక్రాంతి పండక్కి 5 సినిమాలు వస్తున్నాయి. గుంటూరు కారం, హనుమాన్ 12న, సైంధవ్, ఈగల్ 13న, 14న నా సామి రంగ విడుదలకు రెడీ అయ్యాయి. ఏదో ఓ సినిమా పక్కకు తప్పుకుంటే మంచిదని, అలా తప్పుకొన్న సినిమాకి సోలో రీలీజ్ ఛాన్స్ ఇస్తామని దిల్ రాజు ప్రకటించారు. అయితే.. ఒక్కరు కూడా ఈ ఆఫర్ తీసుకోలేదు. హనుమాన్ వాయిదా పడే ఛాన్సుంది అనుకొన్నారంతా. కానీ వాళ్లు మరీ మొండిగా ఉన్నారు. నా సామిరంగ విడుదల అవ్వదేమో అని అనుమానించారు. ఎందుకంటే ఈ సినిమా షూటింగ్ ఇంకా జరుగుతూనే ఉంది. ఈనెల 5 వరకూ షూటింగ్ ఉంది. దాంతో ఈసినిమా సంక్రాంతి బరి నుంచి తప్పుకొనే అవకాశం ఉందనుకొన్నారు. అయితే వాళ్లూ వెనక్కి వెళ్లేది లేదని స్పష్టం చేశారు. గుంటూరు కారం, సైంధవ్ ఈ సంక్రాంతి కోసమే ఎప్పటి నుంచో కాచుకొని కూర్చున్నాయి. మొత్తానికి ఐదు సినిమాలూ రావడానికి రెడీ అయ్యాయి.
రోజుకో సినిమా వస్తే తప్పు లేదు. కానీ రెండేసి సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి. అక్కడే లెక్కల్లో తేడా వచ్చేస్తోంది. 12న అందరి ఛాయిస్.. గుంటూరు కారమే. ఆఖరికి ‘హనుమాన్’ దర్శకుడు కూడా ”నేను ముందుగా చూసేది మహేష్ సినిమానే” అని డిక్లేర్ చేశాడు. మరి ‘గుంటూరు కారం’ చూశాక ‘హనుమాన్’ చూడ్డానికి ప్రేక్షకుల దగ్గర ఓపిక, డబ్బు, సమయం ఉంటాయా? అనేది డౌటు. 13న వసూళ్లని సైంధవ్, ఈగల్ పంచుకోవాల్సి ఉంటుంది. అప్పటికి.. గుంటూరు కారం, హనుమాన్ బాక్సాఫీసు దగ్గర ఉంటాయి. అంటే.. ఇక్కడ థియేటర్లనీ పంచుకోవాల్సిందే. ఈసారి సైంధవ్‌కి ఎక్కువ థియేటర్లు దక్కేలా తెర వెనుక సురేష్ బాబు వ్యూహాల్ని సిద్ధం చేశారని తెలుస్తోంది. ఇది వెంకీ నటించిన 75వ సినిమా. కాబట్టి.. కాస్త ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ మరుసటి రోజు నాగార్జున వస్తాడు. ఆయన చేతుల్లోనూ కొన్ని థియేటర్లు ఉన్నాయి. పరిస్థితి చూస్తుంటే సగం థియేటర్లు గుంటూరు కారం, మిగిలిన సగం థియేటర్లతో 4 సినిమాలూ ఎడ్జస్ట్ అవ్వాల్సి వస్తుందేమో అనిపిస్తోంది.
నిజానికి 11న ఖాళీగా ఉంది. ఆ రోజు గురువారం. సినిమా విడుదల చేసుకొనేందుకు మంచి ఛాన్స్. కానీ… ఈ 5 సినిమాల్లో ఒక్కటి కూడా ఆ దిశగా ఆలోచించడం లేదు. 10న ఓ సినిమా విడుదల చేసుకొన్నా తప్పేం లేదు. హనుమాన్‌కి ఆ ఛాన్స్ ఉంది. కానీ… వాళ్లు మాత్రం 12నే వస్తామంటున్నారు. సైంధవ్, ఈగల్లో ఏ ఒక్కటి 10నో, 11నో వచ్చినా సమస్య కాస్త సద్దుమణుగుతుంది. కానీ పండగ రోజే రావాలన్నది అందరి మొండితనం. అందుకే ఎవ్వరూ వెనక్కి తగ్గడం లేదు.