సంక్రాంతి అనేది చిత్రసీమకు చాలా కీలకమైన సీజన్. యేడాదిలో కొత్త క్యాలెండర్ సంక్రాంతితోనే మొదలవుతుంది. ప్రతీ యేటా సంక్రాంతికి పెద్ద సినిమాలు రావడం ఆనవాయితీ. అయితే.. 2022 ఆ అదృష్టానికి నోచుకోవడం లేదు. ఆర్.ఆర్.ఆర్, భీమ్లా నాయక్, రాధే శ్యామ్ లు వాయిదా పడడంతో స్టార్ల సందడి లేకుండా పోయింది. `బంగార్రాజు` వస్తున్నాడు కాబట్టి సరిపోయింది. లేదంటే… ఇంత హంగామా కూడా ఉండేది కాదు. బంగార్రాజుతో పాటుగా హీరో, రౌడీ బాయ్స్ సినిమాలు రాబోతున్నాయి. ఈ మూడు సినిమాలకు కావల్సినన్ని థియేటర్లు దొరికేశాయి. కాకపోతే.. సమస్యలు చాలా ఉన్నాయ్.
ఆంధ్రాలో 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు నడుపుకోవడం పెద్ద సమస్య. అక్కడ టికెట్ రేట్లు అంతంత మాత్రమే. బెనిఫిట్ షోలు, ఫ్యాన్స్ షోలూ లేవు. ఉన్న రేట్లకు, 50 శాతం ఆక్యుపెన్సీతో, అందులోనూ నైట్ కర్ఫ్యూ నిబంధనల మధ్య సినిమాని నడిపించడం చాలా కష్టం. బంగార్రాజు కమిట్ అయ్యాడు కాబట్టి.. ఈనెల 14న రావాల్సివస్తోంది. ఇదే పరిస్థితి వారం రోజుల ముందు గానీ కనిపిస్తే.. అప్పుడు బంగార్రాజు కూడా ఆగిపోయేవాడేమో..? ఇప్పుడు ఆపేస్తే బయ్యర్లు గోల చేస్తారు. అలాగని వాళ్లేం హ్యాపీగా లేరు. బంగార్రాజుని ఏపీలో మంచి రేట్లకు కొనేశారు. ఇప్పుడున్న రేట్లకు.. పెట్టుబడి రాబట్టుకోవడమే గగనం. 50 శాతం ఆక్యుపెన్సీతో అయితే మరింత కష్టం. రౌడీ బాయ్స్, హీరోలకూ ఇలాంటి పరిస్థితే ఉంది. కాకపోతే.. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు? మున్ముందు ఎలాంటి పరిస్థితులు ఉంటాయో ఇప్పుడే చెప్పలేరు. ఫిబ్రవరి, మార్చిలలో పరిస్థితులు ఇంకా దారుణంగా ఉండొచ్చని భయపడుతున్నారంతా. అందుకే ఎంతోకొంత ఈ సీజన్లోనే రాబట్టుకుందాం అని నిర్మాతలు ఫిక్సయిపోయారు. బంగార్రాజుకీ ఇప్పుడు వెనకడుగు వేసే టైమ్ లేదు. అనుకున్న సమయానికి సినిమాని విడుదల చేయాల్సిందే. కానీ ఈ నిర్ణయంతో ఎంత రిస్క్ తీసుకుంటున్నామన్నది సంక్రాంతి సీజన్ అయ్యేంత వరకూ తెలీదు.