ప్రముఖ నటుడు, ఆల్ ఇండియా సమతావ మక్కల్ కచ్చి అధ్యక్షుడు శరత్ కుమార్ ఎమ్మెల్సీ కవితతో భేటీ అయ్యారు. బీఆర్ఎస్లో చేరిక లేకపోతే కలిసి పని చేయడంపైనే చర్చ జరిగినట్లుగా ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లే్దు. రాజకీయాలపై ఎంతో ఆసక్తిగా ఉండే శరత్ కుమార్ సొంత పార్టీ పెట్టుకున్నా కలసి రావడంలేదు ఒక్క సారి మాత్రం అన్నాడీఎంకే పార్టీతో పొత్తు పెట్టుకుని తన పార్టీకి రెండు ఎమ్మెల్యే స్థానాలను దక్కించుకోగలిగారు. అందులో తాను ఒకరు. ఆ తర్వాత మళ్లీ ఎమ్మెల్యేగా కూడా విజయం సాధించలేకపోయారు. ఇటీవలి కాలంలో రాజకీయంగా అంత యాక్టివ్ గా లేరు.
కానీ భారత రాష్ట్ర సమితి ద్వారా ఆయన మరోసారి యాక్టివ్ అయ్యే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం జరుగుతోంది. ఆ ఆసక్తితోనే కవితతో శరత్ కుమార్ సమావేశం అయ్యారని చెబుతున్నారు. ఐతే తమిళనాడులో సమతువా మక్కల్ కచ్చి పార్టీతో బీఆర్ఎస్ చేతులు కలుపుతుందా? లేదంటే శరత్ కుమార్ ఆయన పార్టీని బీఆర్ఎస్లో విలీనం చేస్తారా? అనేది తెలియాల్సి ఉంది. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా మార్చిన తర్వాత.. ముందుగా తెలంగాణ చుట్టు పక్కల ఉన్న రాష్ట్రాలతో పాటు ఇతర దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీని విస్తరించాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. ఇందులో భాగంగా తమిళనాడులోనూ బీఆర్ఎస్ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సమాలోచనలు చేస్తున్నారు.
తమతో కలిసి వచ్చే నేతలతో కలిసి తమిళనాడులోనూ సత్తా చాటాలని ప్లాన్ చేస్తున్నారు. తమిళనాడులో తెలుగువారి ప్రభావం కూడా అధికంగా ఉంటుంది. శరత్ కుమార్ నాడార్ సామాజికవర్గానికి చెందినవారు. తమిళనాడులో ఆ ఓటర్లు నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు. అటు తెలుగు ఓటర్లు.. ఇటు నాడార్ వర్గం కలిస్తే బీఆర్ఎస్కు మంచి ఫలితాలు రావొచ్చని అంచనా వేస్తున్నట్లుగా తెలుస్తోంది. తమిళనాడు నాయకత్వ సమస్య కూడా బీఆర్ఎస్ కు పరిష్కారం అవుతుదని.. కర్ణాటకలో ప్రకాష్ రాజ్ ఎలాగూ ఉన్నారు కాబట్టి ఇక.. ఆయా రాష్ట్రాల్లో పారటీ కమిటీలు ఏర్పాటయినట్లే చెప్పుకోవచ్చంటున్నారు.