నాని హీరోగా నటిస్తున్న చిత్రం ‘సరిపోదా శనివారం’. వివేక్ ఆత్రేయ దర్శకుడు. ఎస్.జె.సూర్య ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు. ఈ రోజు సూర్య పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఓ టీజర్‌ని విడుదల చేసింది చిత్రబృందం.
80 సెకన్ల పాటు సాగిన టీజర్ ఇది. ఇందులోనే కథని, పాత్రల్ని క్తుప్తంగా పరిచయం చేసేశారు. శ్రీకృష్ణుడు, సత్యభామ కలిసి నరకాసుర వధ చేసిన వైనం గుర్తు చేస్తూ నాని, ప్రియాంకా మోహన్, ఎస్.సె.సూర్య పాత్రల్ని తెరపైకి తీసుకొచ్చారు. సూర్య ఇందులో ఓ క్రూరమైన పోలీస్. తన అరాచకాల్ని హీరో ఎలా ఎదిరించాడన్నది కాన్సెప్ట్. సూర్య- నాని మధ్య సాగిన పోరు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. ‘శనివారం’ అనే కాన్సెప్ట్ కూడా కొత్తగా ఉంటుందని చిత్రబృందం చెబుతోంది. ఇప్పటి వరకూ వచ్చిన ప్రమోషన్ కంటెంట్ ఈ సినిమాపై ఉన్న ఆసక్తిని మరింత రెట్టింపు చేసింది. టీజర్ చూస్తే యాక్షన్ కు పెద్ద పీట వేసినట్టు అర్థం అవుతోంది. ఆర్.ఆర్ కూడా ఎనర్జిటిక్‌గా సాగింది. డి.వి.వి.దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తున్నారు.