అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న శశికళ ఈ నెలాఖరులో జైలు నుంచి విడుదల కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఆమె కోర్టు విధించిన ఫైన్ కట్టేశారు. జైలు నుంచి విడుదలైన తర్వాత ఆమె రాజకీయాలపై దృష్టి పెట్టే అవకాశం ఉంది. జైలు శిక్ష అనుభవించిన కారణంగా శశికళ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదు. అయితే రాజకీయం చేయడానికి మాత్రం ఎలాంటి ఆంక్షలు లేవు. పవర్ ఫుల్ ఉమెన్‌గా ఆమె అన్నాడీఎంకేను చేజిక్కించుకున్నా.. ఆశ్చర్యం లేదన్న వాదన వినిపిస్తోంది. అన్నాడీఎంకేను జయలలిత ఉన్నప్పుడు కూడా శశికళ.. తెరవెనుక అన్నీ తానై నడిపించారు.
ఇప్పుడు శశికళ తమిళనాడులో అడుగు పెట్టిన వెంటనే పార్టీ శ్రేణులన్నీ ఆమెకు జై కొట్టే ఛాన్సుంది. పన్నీర్ సెల్వం, పళనిస్వామి ఆమె పక్షం వహిస్తారా.. లేక శశికళ వేరు కుంపటి పెట్టుకుంటారా అన్నది ఆసక్తికరంగా మారింది. పన్నీర్ ను దించేసి తాను సీఎం కావాలనుకున్నప్పుడు… పరిస్థితులు అనుకూలించకపోవడంతో… రిసార్టుల్లో ఎమ్మెల్యేలను పెట్టి మరీ.. పళనీని సీఎం చేయడంలో శశికళ వర్గం ఎంతో కష్టపడింది. అయితే తర్వాత పళని పదవి కాపాడుకోవడానికి బీజేపీతో చేతులు కలిపి.. శశికళ వర్గాన్ని తొక్కేశారు.
అయితే.. అసలు శశికళ జైలు నుంచి విడుదల కావడం వెనుక బీజేపీ ఉందని.. శశికళతో బీజేపీ పొత్తు పెట్టుకునేందుకు ఆసక్తి చూపించే వీలుందని చెబుతున్నారు. బీజేపీ, శశికళ పొత్తు కుదిరితే.. మిగతా పార్టీలకు ఇబ్బందేనని చెబుతున్నారు. రాజకీయాల్లో బీజేపీ వ్యూహాలను అంచనా వేయడం కష్టం. బీజేపీ ప్రతిపాదనలకు మొదట్లో అంగీకరించని కారణంగానే ఆమె జైలుకు వెళ్లాల్సి వచ్చిందనేది తమిళనాడులో ఉన్న ప్రచారం. బీజేపీ సహకారం లేకపోతే.. ఆమె విడుదల సాధ్యం కాదని కూడా నమ్ముతున్నారు. ఇప్పటికీ కొన్ని కేసులు ఆమెపై పెండింగ్‌లో ఉన్నాయి.