రాష్ట్రపతి ఎన్నికలు సమీపిస్తున్నాయి. మరో నెలరోజుల్లో ఎన్నిక ఉండే అవకాశాలు ఉండటంతో ఢిల్లీ కేంద్రంగా మరోసారి రాజకీయాలు ఊపందుకుంటున్నాయనే చెప్పాలి. రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై కేంద్రంలో భాజపా సర్కారు ఇంకా కుస్తీలు పడుతూనే ఉన్నట్టుంది! రాష్ట్రపతి ఎన్నికను కూడా రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా మలచుకునేందుకు ప్రయత్నిస్తోంది. గడచిన కొద్దిరోజులుగా జార్ఖండ్ కు చెందిన ద్రౌపది ముర్ము పేరు ప్రముఖంగా వినిపించింది. ఆమె కాబోయే రాష్ట్రపతి అంటూ జాతీయ మీడియాలో భారీ ఎత్తున ప్రచారం సాగింది. ఆదివాసీ మహిళ కావడంతో ఇతర పార్టీలు కూడా ద్రౌపది అభ్యర్థిత్వాన్ని కాదనలేని పరిస్థితి వస్తుందనీ, ఆ విధంగా తాను ప్రతిపాదించిన అభ్యర్థినే రాష్ట్రపతిగా అన్ని పార్టీలూ ఆమోదింపజేసే పరిస్థితిని క్రియేట్ చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రయత్నిస్తున్నట్టు కథనాలు వచ్చాయి. అయితే, తాజాగా ఇప్పుడు రాష్ట్రపతి అభ్యర్థిగా మరో కొత్తపేరు తెరమీదికి వచ్చింది.
కేరళ గవర్నర్ సదాశివం పేరును రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉందని హస్తిన వర్గాల్లో వినిపిస్తోంది. ప్రధాన పార్టీలైన భాజపా, కాంగ్రెస్ లతోపాటు ఇతర పార్టీలన్నింటితోనూ ఆయనకు సత్సంబంధాలు ఉన్నాయని అంటున్నారు. ఈయన గతంలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. రాజకీయ వర్గాల్లో కూడా మంచి పేరున్న సదాశివం, ప్రస్తుతం కేరళ గవర్నర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సో.. ఆయన పేరు ఖరారు చేసే అవకాశం ఉందని తాజాగా వినిపిస్తోంది. ద్రౌపది ముర్ము పేరు ప్రస్తుతానికి పక్కకు వెళ్లినట్టే చెప్పుకోవాలి. కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు పేరు కూడా వినిపించినా… ఆ వార్తల్ని ఆయనే స్వయంగా ఖండించిన సంగతి తెలిసిందే.
అయితే, ఉన్నట్టుండి సదాశివం పేరు తెర మీదకి తీసుకుని రావడం వెనక భాజపా వ్యూహం వేరే ఉందని అంటున్నారు. గవర్నర్ సదాశివం తమిళనాడుకు చెందినవారు. ఓ వ్యవసాయ కుటుంబ నేపథ్యం ఆయనది. తమిళనాడులో పాగా వేసేందుకు భాజపా తీవ్ర ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పరిణామాల వెనక భాజపా హస్తం ఉందనే ప్రచారం జోరుగానే సాగుతోంది. ఈ నేపథ్యంలో వివాద రహితుడైన తమిళ ప్రముఖుడిని రాష్ట్రపతిని చేయడం ద్వారా… ఆ రాష్ట్ర ప్రజల్లో భాజపా పట్ల పాజిటివ్ ఫీల్ కలిగే అవకాశం ఉందన్నది ఢిల్లీ పెద్దల వ్యూహంగా తెలుస్తోంది. తమిళనాడు రాష్ట్ర భాజపా నేతలు కూడా ఆయన పేరునే ప్రచారంలోకి తెస్తున్నారట. ఇంతకీ, సదాశివం అభ్యర్థిత్వం ఎంతవరకూ నిజమో అనేది ఇంకా తెలియాల్సి ఉంది.