సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కూడా ఒక్క సారిగా బీఆర్ఎస్ లో ఉన్న పరిస్థితులపై ఫైరయ్యారు. సొంత పార్టీలో ప్రత్యర్థులు ఇబ్బందులు పెడుతున్నారని ఆయన మండిపడ్డారు. టీడీపీలో ఉన్నప్పుడు ఒకలా… బీఆర్ఎస్లో ఉన్నప్పుడు మరోలా ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. తాను టీడీపీని వీడాలనుకోలేదని.. ఆ పార్టీని కాపాడటానికి సర్వశక్తులా ప్రయత్నించానన్నారు. ఆ పార్టీలో పెద్దలందరూ పార్టీ వీడిన తర్వాతే తాను కూడా వీడానన్నారు. టీడీపీ కోసం కేసులనూ ఎదుర్కొన్నానని వీరయ్య గుర్తు చేసుకున్నారు. బీఆర్ఎస్లో ప్రస్తుత పరిస్థితులను ప్రజలు తెలుసుకుంటారని.. సత్తుపల్లి ప్రజలు విజ్ఞులని ఆయన చెప్పుకొచ్చారు.
ఇటీవల ఖమ్మంలో చంద్రబాబు సభ పెట్టిన తరవాత రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. ఈ కారణంగా .. సొంత పార్టీపై ఎవరు అసంతృప్తి వ్యక్తం చేసినా హైలెట్ అవుతోంది.
తెలుగుదేశం తరపున గెలిచిన సండ్ర వెంకట వీరయ్య.. బీఆర్ఎస్ గూటికి చేరారు. అప్పట్నుంచి ఓ వైపు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య వర్గం కాగా మరోవైపు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్గంగా ఇక్కడ గ్రూపు రాజకీయాలు నడుస్తున్నాయి.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆంధ్రా సరిహద్దు ప్రాంతంగా సత్తుపల్లి నియోజకవర్గం ఉంటుంది. ఇక్కడ ఎక్కువగా ఆంధ్రా రాజకీయాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. 2014, 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తరఫున ఎస్సీ కార్పోరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి పోటీ చేశారు. ఈ రెండు ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి పొంగులేటి వెన్నంటే ఉంటున్న డాక్టర్ మట్టా దయానంద్ ఇప్పుడు సండ్రను ఇబ్బంది పెడుతూ రాజకీయాలు చేస్తున్నారు. ఆయన మాజీ వైసీపీ నేత.
సత్తుపల్లి నియోజకవర్గంలో సండ్ర ఒంటరిగానే ముందుకు సాగుతున్నారు. రెండు సార్లు పోటీ చేసి ఓడిన పిడమర్తి రవి కూడా పొంగులేటి క్యాంప్‌లో చేరారు. ఈ కోపం సండ్ర వీరయ్యకు పెరిగిపోయినట్లుగా కనిపిస్తోంది. తన మాజీ పార్టీ పుంజుకుంటూండటంతో.. ఎందుకైనా మంచిదని ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా రాజకీయవర్గాలు భావిస్తున్నాయి.