అబ్బో అక్కడ చాలా కోలాహలంగా ఉంది. పెద్ద భవంతిలో మూడురోజుల పాటు బాబు గారడీ ప్రదర్శనలు ఇస్తున్నాడు. పేరు క్లాస్ గా ఉండాలని దానికి `గారడీ సమ్మిట్’ అని పేరుపెట్టాడు. కార్పొరేట్ స్టైల్ లో ప్రచారం చేయడంతో దేశవిదేశాల నుంచి ఎంతో మంది పనిగట్టుకుని ఈ గారడీ విద్య చూడటానికి వచ్చారు. ఇందులో ఎవరి స్వార్థం వారిది. `గారడీ సమ్మెట్ లో భాగస్వాములుకండి..’ అంటూ బాబు ఇచ్చిన పిలుపు బాగానే వర్కవుట్ అయింది.
తనకు తెలిసిన విద్యను మార్కెట్ చేసుకోవడంలో బాబు బాగా దిట్ట. ఆమధ్య పూరిపాక వేసి దాన్ని ఏడంతస్థుల భవనంలా ప్రజలకు చూపించాడు. అంతే.. చూసినవారి మైండ్ బ్లాంకైంది. మరోసారి ఊర్లో జనాలను ఆరుబయటకు రమ్మనమని పిలిచాడు. ఏదో బ్రహ్మాండమైన గారడీ ఫ్రీగా చూడొచ్చుకదా అని అంతా గుమిగూడారు. తనచేతిలో గారడీ స్టిక్ ని నేలమీద ఉంచి మట్టిపై పెద్దపెద్ద భవంతుల బొమ్మలు గీశాడు. `ఇతగాడు ఏంచేయబోతున్నాడా’ అని అంతా కళ్లార్పకుండా చూస్తున్నారు. అంతలో ఓ పొలికేక పెడుతూ…
`అమ్మలారా, అయ్యలారా, ఇది పొట్టకూటికోసం చేసే గారడీ కాదు. మా మామ నేర్పిన గారడీ అంతకంటే కాదు. నా చిన్నప్పుడు ఓ మర్రిచెట్టు తొఱ్ఱలో దెయ్యం నేర్పింది. హాంఫట్.. భూమ్ ఫట్.. భూమిమీద ఈ గీతలు చూశారా…?’ అడిగాడు బాబు.
`ఇందులో ఏముందీ నా బొంద, భవంతుల షేపు లో గీతలు గీశావ్. అంతేగా. మాకు నిజమైన భవంతులు కావాలి’ అంటూ ఓ కొంటె కుర్రాడు మంకుపట్టుబట్టాడు.
`ముందు గీతల్లో బాగోగులు చూసుకోవాలి. తర్వాత వాటిని నిజం చేస్తాను. ఇప్పుడు చూడు… గిరిగిరి గిర్రాచ్ , గచ్చా…. అరిఅరి అర్రాఛ్, అచ్ఛా..హాంఫట్…భూంఫట్…ఆల్ ఫట్… ఇక చూడండి ఆకాశం వైపు … ‘ బిగ్గరగా అరిచాడు గారడీ బాబు.
ఇలా బాబు అనగానే అంతా తమ తలలు పైకెత్తి ఆకాశం వైపు చూసి ఆశ్చర్యపోయారు. నేలమీద గీసిన గీతలు…అవే భవంతులు, అచ్చు అలాంటివే ఆకాశంలో తేలియాడుతూ కనిపించసాగాయి. మేఘాల్లా ఆ భవంతులు సాగిపోతున్నాయి. అందరికీ భలే సంతోషమేసింది. అదేపనిగా చప్పట్లు కొట్టారు. ఆ భవంతి నాదంటే, ఈ భవంతి నాదంటూ కొట్టుకోవడం మొదలెట్టారు. అది కనికట్టు విద్యేనని తెలిసినా, నిజంగానే ఆకాశంలో భవనాలు ఉన్నాయనే అంతా భ్రాంతిలో పడిపోయారు. పూర్తిగా గారడీలో చిక్కుకున్నారు.
అప్పటి నుంచి గారడీ బాబు చాలా పాపులరైపోయాడు. దేశవిదేశాల్లో తన విద్యను ప్రదర్శించేవాడు. ఎంతటి ఘనుడైనా సరే, బాబు గారడీ మాటలు, చేతలకు క్షణాల్లో పడిపోవాల్సిందే. కనికట్టు విద్యా ప్రదర్శనలో వరల్డ్ నెంబర్ వన్ కావాలన్నది బాబు ఆశయం. అందుకుతగ్గట్టుగానే రేయిబవళ్లు కృషిచేస్తున్నాడు. ఈమధ్య రాత్రిపూట నిద్రపోకుండా ఇంటెర్నెట్ ద్వారా విదేశాల వాళ్లకు `30 రోజుల్లో గారడీ విద్య’ నేర్పుతున్నాడు. అలా అని అన్నీ నేర్పేయడు. అతని క్రింద చాలా మంది శిష్యులే ఉన్నప్పటికీ, క్షణాల్లో నగరాన్ని కనికట్టుగా చూపించడం, అంతలో మాయం చేయడం మాత్రం ఇంతవరకు ఎవ్వరికీ నేర్పించనే లేదు.
బాబుకు మొదటి నుంచీ ఇన్ని గారడీ విద్యలు అబ్బలేదు. ఏవో చిన్నచిన్న టక్కుటమార విన్యాసాలతో బురిడీ కొట్టించేవాడు. నాలుగురోడ్ల కూడలిలో ఓ పక్కగా గోనెసంచీ పరిచి గారడీ ప్రారంభించేవాడు. తనతోపాటు పాముల బుట్టొకటి తెచ్చేవాడు. అందులో కాలకూట విషంగక్కే పాము ఉందని భయపెట్టేవాడు. ఎవడైనా కొంటె పిల్లాడు ధైర్యంచేసి బుట్టతెరిస్తే అందులో పాము ఉండేదికాదు. అతని దగ్గర మరో బుట్ట ఉండేది. అందులో తాడుచుట్ట ఉండేది. తాడు దానంతట అదే పైకి లేచి వెళుతుందని అందర్నీ నమ్మించేవాడు. తాను మరికాసేపట్లో ఆ తాడు పట్టుకుని స్వర్గలోకం వెళ్ళిపోతున్నాననీ, మీ పాపాలు కడిగేయమని దేవుడికి చెబుతాననీ, తలా పదో పరకో ఇవ్వమనేవాడు. విద్యార్థులను, చిన్న పిల్లలను కూడా వదిలిపెట్టేవాడుకాదు. కేవలం మాటలే. ఆ విద్యను అతను ఏనాడూ ప్రదర్శించలేదు. కొన్ని రకాల రాళ్లు, ఇటుకుల తనతోపాటుగా తెచ్చేవాడు. ఒక రాయో, ఇటుకో మీ ఇంట్లో ఉంచుకుంటే సర్వసిద్ధులు లభిస్తాయని నమ్మించి ఇటుక, రాళ్లను పదిరూపాయలకు అమ్మేవాడు. ఇలా కొన్నాళ్లకు బాగానే డబ్బు గడించాడు గారడీ బాబు. ఎంతైతే అంత గుంజుకోవడమే వాడి పని.
`ఈ గారడీ వాడి పొట్టకూటికోసం ఓ ఏభై ఇవ్వండి తల్లులారా, తండ్రులారా. ఓ నలభై ఇవ్వండి. లేదంటే ఓ పాతిక ఇచ్చుకోండి. అదీ కాదంటే ఓ పదో పరకో, అవి కూడా లేకపోతే ఓ పావలా, కానీ అయినా ఇచ్చుకోండి… గారడీ విద్యలో భాగస్వాములుకండి. ఆనందించండి’ అంటూ బట్టీపట్టిన పాఠంలా చెప్పుకెళ్లేవాడు. ఆరోజులే వేరు. రోజుకో పదోపరకో దక్కితే అతనింట్లో పరమాన్నమే. విందుభోజనమే. ఆ తర్వాత తన మాటల గారడీతో చాలా ఎత్తుకు ఎదిగాడు. ఇప్పుడు ఉన్నట్టుండి ఆకాశంలో నగరాలు నిర్మించేస్తున్నాడు. ఇప్పుడతను గ్లోబల్ గారడీవాడయ్యాడు. అందుకే స్టైల్ మార్చాడు. సూటు,బూటు. నల్లరంగు టోపీ. చేతిలో మ్యాజిక్ స్టిక్ లేందే బయటకు రావడంలేదు. గారడీ సమ్మిట్ పెడుతూ లక్షల కోట్లు అడిగేస్తున్నాడు. ఇప్పుడతని కంటికి పదోపరకో ఆనడంలేదు.
`చూడండి బాబులూ, మీ జీవితాలు మార్చేస్తా. ఒక్కసారి హాంఫట్ అన్నానంటే చాలు, జాతకం తిరగబడాల్సిందే. మొన్నీమధ్య చైనా వెళ్లానా…అక్కడో గరీబ్ ని కోటీశ్వరుణ్ణి చేశాను. మీ దగ్గరున్న వేలకోట్లు ఇవ్వండి. ఏడాదిలో లక్షల కోట్లు పట్టుకెళ్లండి. ఇదిగో ఈ గీతలమధ్య పరిశ్రమలు పెట్టుకోండి, అదిగో ఆ మూలల్లో రియలెస్టేట్ బిజినెస్ చేసుకోండి. ఆ నలుచదరాల్లో రిటైల్ బిజినెస్సులు పెట్టుకోండి. ఆ త్రికోణ స్థలాల్లో ఐటీ కారిడార్లు కట్టేసుకోండి. త్వరపడండి బాబూలూ… త్వరపడండి. ఆలసించిన ఆశాభంగం. ఇచ్చుకోండి వేల కోట్లు. లక్షల కోట్లు. హాంఫట్.. భూమ్ ఫట్…సర్వం ఫట్’ అంటూ తనచేతిలోని మ్యూజిక్ స్టిక్ ని గిరగిరా తిప్పేస్తుంటే సమ్మెట్ కు వచ్చిన మహామహా పండితులు, పండిత పుత్రులు మూర్ఛబోయారు.
మూడు రోజుల గారడీ సమ్మెట్ మాయాజాలం వీడేసరికి ఖాళీ స్థలంలో ఆ దుమ్ములో, ఆ మట్టిలో పడి అంతా దొర్లుతున్నారు. నెమ్మదిగా ఒకరొకరిగా లేచి చూసుకున్నారు. కనుచూపు మేరలో ఆకాశహర్మ్యాలు లేవు. రింగ్ రోడ్లు లేవు. ప్లైఓవర్స్ అంతకంటే లేవు. ఉన్నదల్లా ఒంటికి పట్టిన మట్టి. దాన్ని దులుపుకుంటూ మాయలోడి కోసం చూశారు. ఏడీ…కనిపించడేం !!
(ఇది సరదాగా నవ్వుకోవడానికే. ఎవర్నీ హర్ట్ చేయడానికి కానేకాదు. కనుక, కారాలూ, మిరియాలు నూరవద్దని మనవి)
– కణ్వస