భారతీయ జనతా పార్టీ నేతలు ప్రధాని నరేంద్రమోడీ గుణాగుణాల్ని కీర్తించడానికి క్రియేటివిటీని చూపించడానికి పోటీ పడుతూంటారు. ఆయనను మించిన మహా నేత లేరని చెబుతూ ఉంటారు. ఇప్పటి వరకూ అలాంటి ఓ గొప్ప .. స్థానాన్ని మోడీ బీజేపీలో దక్కించుకున్నారు . కానీ ఇప్పుడు పరిస్థితి మారుతున్నట్లుగా కనిపిస్తోంది. కొంత మంది నేతలు ఆయన అసలైన లక్షణాల గురించి బయటకు చెప్పేందుకు ఏ మాత్రం వెనుకాడటం లేదు. బీజేపీ కీలక నేత… సత్యపాల్ మాలిక్.. బీజేపీ పెద్ద అహంకారి అని తేల్చేశారు. ఆయన అహంకారం గురించి ఇప్పుడు దేశ రాజకీయాల్లో చర్చ పెట్టారు.
సత్యపాల్ మాలిక్ ప్రస్తుతం మేఘాలయ గవర్నర్‌గా ఉన్నారు. ఆయన చాలా కాలంగా మోడీపై పరోక్ష విమర్శలు చేస్తున్నారు. రైతు ఉద్యమానికి మద్దతుగా మాట్లాడుతూ మోడీ సర్కార్ తీరుపై మండి పడుతున్నారు. మధ్యలో ఓ సారి తాను జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఉన్నప్పుడు చోటు చేసుకున్న అవినీతి గురించి చెప్పారు. ఇన్ని చేస్తున్నా ఆయనను గవర్నర్ పదవి నుంచి తప్పించడం కానీ.. చర్యలు తీసుకోవడం కానీ బీజేపీ నేతలు చేయలేకపోయారు. దీంతో సత్యపాల్ మాలిక్ మరింతగా చెలరేగిపోతున్నారు.
మేఘాలయ గవర్నర్‌గా ఉన్నప్పటికీ సత్యపాల్ మాలిక్ యూపీలో ఓ బలమైన సామాజికవర్గానికి చెందినవారు. ఆయనపై చర్యలు తీసుకుంటే ఆ సామాజికవర్గం ఆగ్రహిస్తుందని.. అది యూపీ ఎన్నికల్లో చేటు చేస్తుందని ఆలోచిస్తున్నట్లుగా కనిపిస్తోంది. దీన్ని మాలిక్ మరింతగా అడ్వాంటేజ్‌గా తీసుకున్నారు. ఇప్పుడు మాలిక్ చేసిన ఆరోపణల కేంద్రంపై విపక్ష పార్టీల నేతలు.. మోడీ అహంకారంపై చర్చ పెట్టాయి. చివరికి తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా ప్రధాని మోడీ అహంకారంపై తన అభిప్రాయాన్ని కూడా చెప్పారు. దీంతో బీజేపీ నేతలకు ఎలా కవర్ చేసుకోవాలో తెలియని పరిస్థితి ఏర్పడింది.