భారత రాజ్యాంగ నిర్మాతలు వ్యవస్థల్ని చాలా బలంగా నిర్మించారు. కానీ ఒక్క చిన్న లోపం మాత్రం ఉంది.. అదేమిటంటే ఆ వ్యవస్థల్ని నడిపించేవారి మీదనే ఆ వ్యవస్థల బలోపేతం.. పవర్ ఆధారపడి ఉంటాయి. పొరపాటున ఆ వ్యవస్థలో ఓ బలహీన వ్యక్తి.. ఆ వ్యవస్థను బలహీనం చేయలనుకునే అధికార వ్యక్తుల చేతుల్లో బందీగా మారితే.. జరిగే నష్టాన్ని ఊహించడం కష్టం. భారత రాజ్యాంగం మనకు ప్రసాదించిన అనేక వ్యవస్థలు అత్యంత కట్టుదిట్టమైనవే. కానీ అవి ఇప్పుడు ప్రజల్ని ఎందుకు నిరాశపరుస్తున్నాయి ?. అలాంటి వాటిలో ఒకటి సివిల్ సర్వీస్ వ్యవస్థ. ఇప్పుడీ వ్యవస్థలో పవర్ ఫుల్ అనేదే కనిపించడం లేదు. రాష్ట్రం.. కేంద్రం ఎక్కడ చూసినా ఒకటే రకమైన విధి నిర్వహణ కనిపిస్తోంది. దీనికి బాధ్యులెవరు ? , రాజ్యాంగం ప్రసాదించిన వ్యవస్థల్ని కుళ్లిపోయేలా చేస్తోంది ఎవరు ?
ప్రజాపాలకులకు సరైన దారిలో నడిపించాల్సింది అధికారులే !
భారత దేశ ప్రజాస్వామ్యం రెండు పార్శ్వాలుగా ఉంటుంది. ప్రజలు ఎన్నుకున్న పాలకులు పరిపాలన చేస్తారు. వీరిదే అంతిమ నిర్ణయం. కానీ రెండో పార్శ్వం అధికారులు. వీరు ప్రజాపాలకులతో సమానంగా బాధ్యత కలిగి ఉంటారు. ప్రజలు ఎన్నుకున్నంత మాత్రాన అడ్డగోలు పరిపాలన చేయడానికి లేదని.. చట్టం, న్యాయం, రాజ్యాంగం ప్రకారమే పరిపాలన చేయాలని వీరు ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి గుర్తు చేస్తూ ఉండాలి. ప్రజలు ఎన్నుకున్న పాలకులు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే అది తప్పు అని చెప్పి నిస్సంకోచంగా తిరస్కరించగల అధికారం అధికారులకు ఉంటుంది. ఎందుకుంటే. స్వయంగా ముఖ్యమంత్రి కూడా ఎలాంటి తుది ఆదేశాలు జారీ చేయలేరు. ఆయన ఆదేశాలు సరైనవే అయితే ఆయన తరపున అధికారులు ఉత్తర్వులు ఇస్తారు. మంత్రులు ఇస్తారు. అంటే.. అంతిమంగా అధికారులు జారీచేసే ఉత్తర్వులే చెల్లుబాటు అవుతాయి. భారత రాజ్యాంగ నిర్మాతలు ఇంతగా చెక్స్ అండ్ బ్యాలెన్స్ పద్దతిని ప్రవేశ పెట్టిన తర్వాత కూడా ఎందుకు ప్రస్తుత ఘోరమైన పరిపాలనా పరిస్థితులు ఎదురవుతున్నాయి…?
వ్యవస్థల్ని పవర్ ఫుల్‌గా నడిపిన వారెందరో ?
సివిల్ సర్వీస్ అధికారులు ఏం చేయగలరో… గట్టిగా ఉంటే.. వ్యవస్థల్ని ఎలా పకడ్బందీగా నడిపించగలరో చరిత్రలో చాలా మంది నిరూపించారు. ఎస్ఆర్ శంకరన్ ఇప్పటి తరానికి పెద్దగా తెలియదు. సామాన్యులకు కాదు.. అసలు సివిల్ సర్వీస్ అధికారులు ఆయన స్ఫూర్తిని సరిగ్గా అర్థం చేసుకుని ఉంటే వ్యవస్థ ఎంతో కొంత బలంగా ఉండది. ఎస్ఆర్ శంకరన్ అత్యంత నిరాడంబరమైన మనిషి మాత్రమే కాదు.. సమాజాన్ని సమూలంగా మార్చేందుకు అద్భుతంగా కృషి చేసిన అధికారి. ఆయన తన పోస్టింగుల కోసం ఎప్పుడూ రాజీపడలేదు. తనకు వచ్చిన పోస్టింగులలోనే ప్రత్యేకత చూపించారు. ప్రజలకు ఏమి చేయలగరో చూపించారు. అందుకే ఇప్పుడాయన ఎంతో మందికి ఆదర్శప్రాయుడు అయ్యారు. ఇక టీఎన్ శేషన్ సంగతి చెప్పాల్సిన పని లేదు. సివిల్ సర్వీస్ అధికారిగా ఆయన ఎక్కడ పని చేసినా వ్యవస్థ ఎంత పవర్ ఫుల్లో తెలియచేశారు. ఎన్నికల సంఘం కమిషనర్ గా ఆయన .. ఈసీకీ ఎంత పవర్ ఉందో చూపించిన వైనం… ఇప్పటికీ కథలు కథలుగా చెప్పుకుంటారు. ప్రజల భాగస్వామ్యంతో చరిత్రలో నిలిచిపోయే పనులు చేసిన అధికారులు … వ్యవస్థల్ని ఎప్పటికప్పుడు బలోపేతం చేస్తూ ముందుకెళ్లారు.
ఐపీఎస్‌లు దారి తప్పిదే ప్రజలకు రక్షణ ఎవరు ?
శాంతిభద్రతల విషయంలో ఆల్ ఇండియా సివిల్ సర్వీస్ అంటే ఎంత పవర్ ఫుల్లో చెప్పాల్సిన పని లేదు. ఐఏఎస్ వచ్చినా సరే ఐపీఎస్ తీసుకునేవారు కూడా ఉంటారు. ఈ వ్యవస్థ దేశ ప్రజల అంతర్గత భద్రతకు కవచం లాంటిది. ఇలాంటి వ్యవస్థలో ఎంతో మంది తనదైన ముద్ర వేశారు. దేశ సరిహద్దుల బయట నుంచి దేశానికి జరిగే నష్టం కన్నా.. దేశంలో లోపల అలజడులు రేపుతూ.. ప్రజా జీవనానికి భంగం కలిగిస్తూ.. శాంతిభద్రతల సమస్యలు సృష్టించేవారికి కొదవ ఉండదు. అలాంటి వారి పీచమణిచి.. దేశాన్ని ప్రశాంతంగా ఉంచడంలో ఈ అధికారుల పాత్రే కీలకం. అజిత్ దోవల్, కిరణ్ బేడీ, సంజూక్త పరాశర్ , ఉమేష్ చంద్ర వంటి వారు ఐపీఎస్ పోస్టింగ్ వస్తే ఏమి చేయగలరో చేసి చూపించారు. కానీ దేశంలో ఇప్పుడేం జరుగుతోంది ?. అప్పట్లో ఉన్నట్లుగా ఇప్పుడు వ్యవస్థలుప్రజలకు భరోసా ఇస్తున్నాయా అంటే… అడ్డంగా తల ఊపాల్సిన పరిస్థితి. ఆ రాష్ట్రం. ఈ రాష్ట్రం అనే తేడా లేదు.. ఏ వ్యవస్థ అయినా.. రాజకీయం చేతిలో బందీ అయిపోయింది. చివరికి ఎన్నికల సంఘం నిర్వహణ కూడా అస్తవ్యవస్థంగా మారింది. ఎన్నికల కమిషనర్లను కేంద్రం నియమిస్తుందని.. వారికి కావాల్సిన వారిని నియమించుకునే పరిస్థితి వచ్చింది. అందుకే వారూ స్వతంత్రంగా పని చేసే పరిస్థితి లేకుండా పోయింది.
Read Also: హిందూపురం వైసీపీని ఖాళీ చేసిన బాలకృష్ణ
నేతల కోసం సివిల్ సర్వీస్ స్ఫూర్తిని త్యాగం చేయడం మహాపరాథం !
రాజకీయ నేతలు శాశ్వతం కాదు. ప్రతి ఐదేళ్లకు ఓ సారి ప్రజా తీర్పునకు వెళ్లాలి. కానీ అధికారులు శాశ్వతం. ఒక్క సారి సర్వీసులోకి వస్తే రిటైరయ్యే వరకూ ఉంటారు. వారికి ఎంత రక్షణ ఉంటుందంటే.. ప్రభుత్వాలు తప్పుడు కేసులు పెట్టగలవు కానీ.. సస్పెండ్ చేయగలవు కానీ ఉద్యోగం నుంచి తొలగించలేవు. కానీ ఆ అధికారాల్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో గత ఐదేళ్ల కాలంలో జరిగిన వ్యవహారాలు చూస్తే… సివిల్ సర్వీస్ వ్యవస్థ విలువలు ఇంత ఘోరంగా ఉంటాయా అని ఎవరికైనా అనిపిస్తే తప్పేం ఉండదు. స్వయంగా స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఆదేశాల్ని సీఎస్ ఉల్లంఘించారు. కోర్టు తీర్పులను అమలు చేయలేదు. కొన్ని వందల సార్లు కోర్టు తీర్పు ఉల్లంఘన కారణంగా శిక్షలకు గురయ్యారు. శాంతి భద్రతల విషయంలో రాజీ పడిపోయారు. ప్రతిపక్ష నేత మీద వరుసగా రాళ్ల దాడులు జరిగితే దాన్ని నిరసన వ్యక్తీకరణగా చెప్పుకునే దౌర్భాగ్యమైన వ్యవస్థ పతనానికి కారణం అయ్యారు. మంచి పోస్టింగ్ కోసమో.. లేకపోతే అక్రమ సంపాదన కోసమో వారు చేసిన తప్పుల వల్ల వ్యవస్థ నాశనం అయిపోయింది. వారు చేసిన అడ్డగోలు పనులు కళ్ల ముందు ఉన్నప్పుడు మరో ప్రభుత్వం వచ్చినప్పుడు వారికి ఎలా పని చెప్పగలరు ?. తమ పాత రాజకీయ బాసుల కోసం తమ కెరీర్ ను సైతం త్యాగం చేయడానికి సిద్ధమన్నట్లుగా విధేయత ప్రదర్శించి చట్టాన్ని, రాజ్యాంగాన్ని అమలు చేసి.. క్రిమినల్ కన్స్పైరసీకి పాల్పడినట్లుగా స్పష్టమైన ఆధారాలుంటే ఏ ప్రభుత్వమైనా ఏం చేయగలరు ?. మళ్లీ వారికి పనులు చేసి తమ ప్రభుత్వంపై కుట్రలు చేయమని అవకాశం ఇస్తుందా ?
ఏపీలో జరిగిన పరిణామాలు ఓ మేలుకొలుపు !
ఏపీలో కనీసం 144 మంది ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు. కానీ వీరిలో గత ప్రభుత్వం ఓ పాతిక మంది మాత్రమే పని చేశారు. మిగతా వారంతా డమ్మీలుగా ఉన్నారు. ఈ పాతిక మంది.. వివిధ రకాల ఆరోపణలు, కేసుల్లో అధికారులను ఎంపిక చేసుకుని.. వారిపై చర్యలు తీసుకోకుండా ఉండాలంటే.. తమ ఆదేశాలను పాటించాల్సిందేనని రాజకీయ బాసుల ఈగోలు తీర్చే పని పెట్టుకున్నారు. ఇవాళ అవన్నీ బయట పడ్డాయి. ఐఏఎస్ అఫీసర్ల సంగతి చెప్పాల్సిన పని లేదు. సీనియార్టీ లేకపోయినా సీఎస్ అయిన జవహర్ రెడ్డి అనే పెద్ద మనిషి .. తన తరతరాలు సెటిల్ అయిపోయేలా భూదందాలు చేసుకున్నారు. ఆ విషయాలు అందరికీ తెలిసిపోయాయి. ఇలా లెక్కనట్లుగా సాగిన వ్యవహారాలతో.. సివిల్ సర్వీస్ వ్యవస్థ పూర్తిగా బలహీనంగా మారింది. వీరి బలహీనతల్ని ఆసరాగా చేసుకుని రాజకీయ నేతలు.. వ్యవస్థలతో మరింతగా ఆడుకోవడం ప్రారంభించారు.
మొదటి నుంచి వ్యవస్థను బలోపేతం చేసే చర్యలు చేపట్టాలి !
ఓ వ్యవస్థకు చెదలు పట్టడం ప్రారంభించిన తర్వాత.. దాన్ని బాగు చేయడం అంత తేలిక కాదు. ఎందుకంటే ఆ చెదలు పట్టేది వ్యవస్థల్లో ఉన్న వ్యక్తుల ద్వారానే. వారిలో మార్పు వస్తేనే.. మళ్లీ వ్యవస్థల బలోపేతం ప్రారంభమవుతుంది. కానీ ఆరోగ్యం చెడగొట్టుకున్నంత ఈజీగా బాగు చేసుకోవడం సాధ్యం కాదు. ఇప్పటికిప్పుడు జరుగుతున్న నష్టాన్ని ఆలిండియా సివిల్ సర్వీస్ వ్యవస్థలో ఉన్న కింది నుంచి పైదాకా ఉన్న వారు గుర్తించి దిద్దుబాటు చర్యుల ప్రారంభించినా… మళ్లీ వ్యవస్థ పవర్ ఫుల్ కావడానికి వ్యవస్థ బలోపేతం కావడానికి చాలా సమయం పడుతుంది. ఇప్పటికైనా ఆ పని చేయకపోతే… దేశానికి చేసే నష్టానికి అంతే ఉండదు. ముందుగా సివిల్ సర్వీస్‌కు ఎంపిక చేసే విధానంలోనే మార్పులు వచ్చేలా స్పష్టమైన కార్యాచరణతో ముందుకు వెళ్ళి.. దేనికీ లొంగని సిన్సియర్ మనస్థత్వం ఉన్న వారిని ఎంపిక చేసేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి. అదే మొదటి అడుగు అవుతుంది. లేకపోతే.. భారత సివిల్ సర్వీస్ వ్యవస్థ ఇతర ఉద్యోగుల్లా సాదాసీదాగా మారిపోతుంది. అది దేశానికి ఎంత మాత్రం మంచిది కాదు.