‘ఢిల్లీ బెల్లీ’ తో మోడరన్ ఫిల్మ్ మేకర్స్ లో తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్న డైరెక్టర్ అభినయ్ డియో. ఆషికీ, సడక్, క్రిమినల్, రాజ్, జిస్మ్, మర్డర్ లాంటి బ్లాక్ బస్టర్స్ అందించిన సంస్థ ముకేష్ భట్ విశేష్ ఫిల్మ్స్. అయితే సడక్ 2 డిజాస్టర్ తర్వాత ఈ సంస్థ నుంచి మళ్ళీ సినిమా రాలేదు. అటు అభినయ్ డియో దూస్రా తర్వాత మరో సినిమా చేయలేదు. చాలా కాలం తర్వాత వీరి నుంచి ఇప్పుడు ‘సావి’ చిత్రం వచ్చింది. ఫ్రెంచ్ ఫిల్మ్ ‘పోర్ ఎల్లే’కి రిమేక్ ఇది. ఇదొక యాక్షన్ థ్రిల్లర్. ఇదే కథతో హాలీవుడ్ లో ‘నెక్స్ట్ త్రీ డేస్’ పేరుతో సినిమా వచ్చింది. మళ్ళీ అదే కథని అనిల్ కపూర్, దివ్య ఖోస్లా, హర్షవర్ధన్ రాణే కీలక పాత్రలలో ‘సావి’గా తీశారు. తాజాగా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతోంది. మరి ఇంతగా రిమేక్ చేయదగ్గ కంటెంట్ సావిలో ఏముంది? ఫ్రెంచ్ కథకు ఇండియన్ వెర్షన్ సతీసావిత్రి నేపధ్యంలో చేసిన మార్పులు ఆకట్టుకునేలా ఉన్నాయా?
నకుల్ సచ్దేవ్(హర్షవర్ధన్ రాణే) భార్య సావి సచ్దేవ్ (దివ్య ఖోస్లా). వీరికి ఆదిత్య అనే చిన్ని బాబు. భారత మూలాలు వున్న ఈ కుటుంబం ఇంగ్లాండ్ లో స్థిరపడుతుంది. నకుల్ ఒక కన్ స్ట్రక్షన్ కంపెనీలో ఇంజనీర్ గా పనిచేస్తుంటాడు. అనుకోకుండా ఒక రోజు తన బాస్ ని చంపాడనే కేసులో పోలీసులో నకుల్ ని అరెస్ట్ చేస్తారు. అక్కడ ఆధారాలన్నీ నకుల్ కి వ్యతిరేకంగా వుంటాయి. దీంతో కోర్టు అతనికి జీవితకాలం శిక్ష విధిస్తుంది. తనని బయటికి తీసుకురావడానికి అన్ని దారులు మూసుకుపోతాయి. దీంతో జైలుని తప్పించడమే మార్గమనే నిర్ణయానికి వస్తుంది సావి. ఈ క్రమంలో జోయ్‌దీప్ పాల్ (అనిల్ కపూర్) ని కలుస్తుంది. అసలు జోయ్‌దీప్ పాల్ ఎవరు? నకుల్ ని జైలు నుంచి తప్పించడానికి సావికి ఎలా సాయపడ్డాడు? వీరి మిషన్ సక్సెస్ అయ్యిందా లేదా? అసలు నకుల్ హత్య చేశాడా లేదా? అనేది మిగతా కథ.
శత్రుదుర్భేద్యమైన ఓ జైలు నుంచి తప్పించుకోవడానికి చేసే ప్రయత్నాల నేపధ్యంలో వచ్చే కథలు భలే థ్రిల్లింగ్ గా వుంటాయి. ఎలాంటి అవకాశం లేని చోట ఓ అవకాశాన్ని సృష్టించుకొని పాత్రలు చూపే తెలివితేటలు, తెగువ చూడటానికి ఆసక్తికరమే. పాపులర్ వెబ్ సిరిస్ ‘ప్రిజన్ బ్రేక్’ ఇలాంటి జోనర్ కథలకు చాలా కొత్తదారులు చూపించింది. సావి కూడా ప్రిజన్ బ్రేక్ తరహా కంటెంట్. అయితే చిన్న మార్పు వుంది. ప్రిజన్ బ్రేక్ లో ఖైదీలు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తే.. ఇందులో బయటవున్న వ్యక్తి ఖైదీని తప్పించడానికి ప్లాన్ చేస్తుంది. ఈ ప్లాన్ మరీ అంత థ్రిల్లింగ్ గా అనిపించపోయినా ప్రేక్షకుడి ఆసక్తిని నిలుపుకునేలానే వుంటుంది.
Also Read : ‘రాయన్’ రివ్యూ: ఎవరూ రాయని కథ కాదు!
నకుల్ ఫ్యామిలీని పరిచయం చేస్తూ రెండో సీన్ లోనే కథలోకి వెళ్ళిపోయాడు దర్శకుడు. ఫ్రెంచ్ వెర్షన్ లో భార్య జైలుకి వెళ్తుంది. ఇండియన్ వెర్షన్ కి వచ్చేసరికి భర్తని ఖైధీగా మార్పు చేశారు. హిందూ పురాణం సతీ సావిత్రి కథని గుర్తు చేస్తూ అమాయకుడైన తన భర్తని ఎలాగైనా తిరిగి తెచ్చుకోవాలనే తీరులో సావి పాత్రని తీర్చిదిద్దారు. జోయ్‌దీప్ పాల్ గా అనిల్ కపూర్ ఎంట్రీ తర్వాత కథ ప్రిజన్ బ్రేక్ ట్రీట్మెంట్ లోకి వెళుతుంది. మొదట్లో సావి ప్రయత్నాలు అంత థ్రిల్లింగా లేకపోయినా, తర్వాత ఫ్యామిలీ ఎమోషన్స్ ని కోర్ కథలో మిళితం ప్రేక్షకుడుని ఎంపతైజ్ చేయగలిగారు.
జైలు నుంచి తప్పించడానికి, బయటికి వచ్చిన తర్వాత పోలీసులకు చిక్కకుండా ఉండటానికి చేసుకునే ఏర్పాట్లు ఆసక్తిగానే చూపించారు. హాస్పిటల్ చుట్టూ నడిచే ప్రీక్లైమాక్స్ సీన్ కాస్త సినిమాటిక్ గా వుంటుంది. ఎయిర్ పోర్ట్ నేపధ్యంలో పోలీసుల ఛేజింగ్ గ్రిప్పింగ్ గా తీశారు. నకుల్ ఫ్యామిలీ పోలీసులు చిక్కకూడదనుకునే ఫీలింగ్ ప్రేక్షకుడిలో కూడా కలిగించడంలో దర్శకుడు చెప్పుకోదగ్గ పనితీరు కనబరిచాడు.
అనిల్ కపూర్ క్యారెక్టర్ ఇందులో సర్ప్రైజ్ ప్యాకేజ్. ఆయన ప్రజెన్స్ కథకి బాగా కలిసొచ్చింది. అవసరమైన ప్రతిసారి ఆదుకునే హీరోలాంటి పాత్ర. ఆయన ఇమేజ్ తో ఆ క్యారెక్టర్ ని సులువుగా చేశారు. సావి పాత్రలో దివ్య ఖోస్లా నటన డీసెంట్ గా వుంటుంది. అమాయకురాలుగా కనిపించిన సావి తన ఫ్యామిలీ కోసం ఎంతకైనా తెగించే తీరుని చిత్రీకరించిన విధానం బావుంది. హర్షవర్ధన్ రాణే ది లిమిటెడ్ పాత్రే. మిగతా నటీనటులు కథకు అనుగుణంగా కనిపించారు. సినిమా అంతా లండన్ లో లావిష్ గా తీశారు. పాటలకి ప్రాధన్యత లేదు. నేపధ్య సంగీతం మాత్రం డీసెంట్ గా వుంది. ప్రిజన్ బ్రేక్ కాన్సెప్ట్ స్ఫూర్తితో తీసిన ఈ సినిమా అంతగొప్పగా కుదరలేదు కానీ కాలక్షేపానికి మాత్రం ఢోకా ఉండదు. ఈ వీకెండ్ లో తప్పకుండా ఓసారి లుక్ వేయొచ్చు.