ఎన్నికల నిర్వహణకు సహకరించని వారిపై ఎస్ఈసీ రమేష్ కుమార్ నిర్దాక్షిణ్యంగా వేటు వేస్తున్నారు. నిన్న జేడీ సాయి ప్రసాద్‌ను నేరుగా ఉద్యోగం నుంచే తొలగించిన ఆయన ఈ రోజు.. ఐఏఎస్ అధికారి వాణీ మోహన్‌ను పంపేశారు. ఆమెను ప్రభుత్వానికి సరెండర్ చేశారు. ఆమె సేవలు అవసరం లేదని.. సీఎస్‌కు లేఖ రాయడమే కాదు.. వెంటనే రిలీవ్ చేశారు. ఎన్నికల కమిషనర్ సెక్రటరీగా వాణీ మోహన్.. పూర్తిగా ఎస్ఈసీ చెప్పినట్లుగా చేయాల్సి ఉంటుంది. అయితే.. తాను చెప్పిన ఆదేశాలను పాటించడం లేదని.. నిర్ణయాలను అమలు చేయడం లేదన్న కారణంగా వాణీ మోహన్‌ను రిలీవ్ చేసినట్లుగా తెలుస్తోంది.
సాధారణ ఉద్యోగులపైనే కాదు.. ఐఏఎస్ అధికారులపైనా.. ఎస్ఈసీకి సహకరించవద్దని తీవ్రమైన ఒత్తిడి ఉందని.. ఉద్యోగవర్గాలు చెబుతున్నాయి. కక్ష సాధింపు చర్యలు ఉంటాయని వారు భయపడుతున్నారు. ఎన్నికల కమిషన్ సెక్రటరీగా వాణీమోహన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎస్ఈసీని తొలగించడం.. ఆయన న్యాయపోరాటం చేసి మళ్లీ పదవి సంపాదించడం వంటి ఘటనలు జరిగాయి. రమేష్ కుమార్ పదవి చేపట్టిన తర్వాత ఎన్నికల సన్నద్ధతపై ఏర్పాటు చేసిన ఓ సమావేశానికి రావాలని ఓ సారి మెసెజ్ పంపారు. ఆ విషయం వివాదాస్పదమయింది. ఆ తర్వాత వాణీమోహన్ విషయంలో చీఫ్ సెక్రటరీగా ఉన్న నీలం సహాని ఓ వివాదాస్పద జీవో జారీ చేశారు. ఐఏఎస్ అధికారిని కావాలని వేధించాలన్నట్లుగా… ఆమె సామర్థ్యాన్ని శంకించేలా.. ఓ వివాదం విషయంలో చట్టాలను తెలుసుకుని రావాలని జీవో జారీ చేశారు.
ఎస్ఈసీలో ఉన్నప్పటికీ.., ప్రభుత్వానికి సహకరించకపోతే అలాంటి పరిస్థితులే ఉంటాయన్న హెచ్చరికలు ఆ జీవోతో ఇచ్చినట్లయింది. అప్పట్నుంచి ఎన్నికల కమిషన్ సెక్రటరీగా పని చేసేందుకు వాణీమోహన్ పెద్దగా ఆసక్తి చూపించడం లేదని.. తనను రిలీవ్ చేయాలని కోరుకుంటున్నట్లుగా తెలుస్తోంది. చివరికి రమేష్ కుమార్ ఇచ్చే ఆదేశాలను కూడా ఎగ్జిక్యూట్ చేయడానికి సందేహిస్తూండటంతో ఆయన రిలీవ్ చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. సోమవారమే ఎన్నికల నిర్వహణకు ఆటంకం కలిగేలా… ఎన్నికల కమిషన్ జాయింట్ డైరక్టర్ సాయిప్రసాద్.. తాను సెలవు పెట్టడమే కాకుండా.. ఎన్నికల కమిషన్‌లో ఉండే ఇతర ఉద్యోగులు అందరూ సెలవు పెట్టేలా ప్రోత్సహించారన్న అభియోగంతో.. ఆయనను ఉద్యోగం నుంచి తొలగిస్తూ.. ఉత్తర్వులు జారీ చేశారు.