సీఎం జగన్ తన మానస పుత్రికగా ప్రకటించుకున్న వ్యవస్థ గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులపై దారుణమైన వివక్ష చూపిస్తున్నారు. ఇప్పటికే వారికి విధి నిర్వహణలో లేనిపోని నిబంధనలు పెట్టి నానా తిప్పలు పెడుతున్నారు. ప్రొబేషన్ పేరుతో దాదాపుగా పది నెలలుగా టార్చర్ పెడుతున్నారు. ఇప్పుడు ప్రొబేషన్ కొంత మందికి ప్రకటించినా వారికి కొత్త జీతాలు రావన్న తాజా సమాచారాన్ని వ్యూహాత్మకంగా లీక్ చేశారు. వారి జీతాలు పెంచడానికి బడ్జెట్ కేటాయింపులు లేవని చెబుతున్నారు. దీంతో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల గుండెల్లో రాయి పడినట్లు అవుతోంది.
రెండున్నరేళ్ల నుంచి పదిహేను వేల రూపాయలకే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు పని చేస్తున్నారు. పర్మినెంట్ అవుతుందని ఎదురు చూస్తున్నారు. కానీ రెండేళ్ల సర్వీస్ పూర్తయిన తర్వాత కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. అనేక రకాల ఆందోళనల తరవాత పరీక్షలని. .. మరొకటని లెక్కలేసి..కనీసం అరవై వేల మందిని పక్కన పెట్టి మిగతా వారికి ప్రొబేషన్ ఖరారు చేశారు. వారికయినా ఇప్పుడు ప్రొబేషన్ ఖరారయిన ప్రకారం జీతాలిస్తారా అంటే… కష్టమేననే సంకేతాలు పంపుతున్నారు.
ప్రభుత్వ ఉద్యోగులుగా ఖరారు చేసి జీతాలివ్వాలంటే కొన్ని లాంఛనాలు ఉంటాయని.. హెడ్ అకౌంట్లో కేటాయింపులు ఉండాలని కానీ అవి లేవని ట్రెజరీ వర్గాలు బయటకు లీక్ చేశాయి. నెలాఖరుకు వచ్చిన తర్వాత ఇలా చెప్పడం ఏమిటన్నది గ్రామ , వార్డు సచివాలయ ఉద్యోగులకు అర్థం కాని విషయం. ప్రొబేషన్ ఖరారు విషయంలో చిత్తశుద్ది లేని శివపూజ తరహాలో ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. సమస్యలున్నాయి కాబట్టి ఈ నెల మామూలు జీతమే తీసుకోండని.. వచ్చే నెల లేదా తరవాత ఏరియర్స్ ఇస్తామని ప్రభుత్వం బుజ్జగించే అవకాశం కనిపిస్తోంది. అయితే… ఉద్యోగులు మాత్రం నమ్మలేకపోతున్నారు.