గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల్ని రెండేళ్ల తర్వాత పర్మినెంట్ చేస్తామని ఏపీ సర్కార్ ప్రకటించి వారిని ఉద్యోగాల్లోకి తీసుకుంది. ఇప్పటి వరకూ వారికి ఎలాంటి ప్రత్యేక భత్యాలు లేకుండా కేవలం రూ. పదిహేను ఇచ్చి పనులు చేయించుకుంటోంది.ఇప్పటికి రెండేళ్లు పూర్తయి రెండు నెలలు గడిచిపోయాయి. పర్మినెంట్ చేయడానికి మాత్రం ప్రభుత్వానికి చేతులు రావడంలేదు. గ్రామ, వార్డు సచివాలయాల్లో 540 అందించేలా ఏర్పాట్లు చేశారు. దానికి తగ్గట్లుగా వారిపై పని ఒత్తిడి పెరిగింది. ఇటీవల పరీక్షలు రాయమంటే పరీక్షలు కూడా పూర్తి చేశారు. కనీసం ఉత్తీర్ణులైన వారికీ పర్మినెంట్ ఉత్తర్వులు రాలేదు.
సచివాలయ ఉద్యోగులను పర్మినెంట్ చేసి పూర్తిస్థాయి జీతాలు చెల్లించాలంటే ప్రతి నెల మరో రూ. మూడు నుంచి నాలుగు వందల కోట్లు అదనపు భారం పడుతుంది. ఇప్పుడు స్థితిలోనే ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి ప్రభుత్వం కిందా మీదా పడుతోంది. పీఆర్సీ, డీఏలు పెండింగ్లో ఉంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అసలు వారిని పర్మినెంట్ చేస్తారా లేదా అన్న సందేహం ప్రారంభమయింది.
ఇటీవల సచివాలయ ఉద్యోగులపై ఒత్తిడి పెంచుతున్నారు. బయోమెట్రిక్ హాజరు లేకపోతే నిర్దాక్షిణ్యంగా జీతం కట్ చేస్తున్నారు. ఫీల్డ్ ఉద్యోగాలు చేసే వారికీ ఈతిప్పలు తప్పడం లేదు. దీంతో వారు కూడా తమ సమస్యలపై ఉద్యమ బాట పట్టాలనే ఆలోచన చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే ప్రభుత్వం మరో వర్గం విశ్వాసం కోల్పోతుంది. ఆర్భాటంగా ఉద్యోగాలిచ్చి.. పర్మినెంట్ చేయకపోతే.. ప్రభుత్వం విఫలమైనట్లే అవుతుంది.