ఓటీటీ వల్ల ఓ సౌలభ్యం ఉంది. థియేటర్లో వర్కవుట్ కావేమో? అనుకునే కాంబినేషన్లనీ, కథల్నీ, జోనర్లనీ ట్రై చేయొచ్చు. ప్రయోగాలకు ఓటీటీకి మించిన ఆప్షన్ ఉండదు. అటు నిర్మాతకూ, ఇటు ప్రేక్షకుడికీ… ఓటీటీ ఉభయ కుశలోపరి. కొన్ని కథలు ఓటీటీలో ఈజీగా పాస్ అయిపోతాయి. ఇంకొన్ని ఓటీటీకే పర్ఫెక్ట్. `సేనాపతి` ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది. కేవలం ఓటీటీ కోసమే రూపొందిన సినిమా ఇది. కాబట్టి.. కమర్షియల్ వాల్యూస్ గురించి పట్టించుకోకుండా దర్శకుడు ఏం అనుకున్నదో అది తీయగలిగాడు. మరింతకీ ఈ సేనాపతి ఎవరు? తన వెనుక ఉన్న కథేమిటి? `ఆహా`లో ప్రదర్శితమవుతున్న సేనాపతి బలాలేమిటి? బలహీనతలేమిటి?
కృష్ణ (నరేష్ అగస్త్య) చిన్నప్పుడే చేయని నేరానికి జైలుకెళ్తాడు. అక్కడ ఓ వార్డెన్ (చిన్నికృష్ణ) ఇచ్చిన స్ఫూర్తితో.. పోలీస్ అవ్వాలనుకుంటాడు. అనుకున్నట్టే ఎస్.ఐ ఉద్యోగం సంపాదిస్తాడు. నిజాయతీగా బతకడం, తనకున్నదాంట్లో నలుగురికీ సాయం చేయడం ఇది మాత్రమే తనకు తెలుసు. లంచాలు తీసుకోడు. ఓ గుండాని పట్టుకునే ప్రయత్నంలో తన సర్వీస్ రివాల్వర్ పోతుంది. అది వెదికి ఇస్తే.. తప్ప తన ఉద్యోగం నిలబడదు. పైగా.. ఐపీఎస్ కి ప్రిపేర్ అవుతుంటాడు. ఐపీఎస్ అవ్వాలన్న తన ఆశయం నెరవేరదు. అందుకే ఆ రివాల్వర్ పట్టుకునేందుకు రంగంలోకి దిగుతాడు. అయితే ఆ రివాల్వర్ ఒకరి చేతులు మారి… మరొకరి చేతుల్లోకి వెళ్తుంటుంది. చివరికి ఓ కామన్ మాన్ (రాజేంద్రప్రసాద్)కి చిక్కుతుంది. ఆ రివాల్వర్‌లో ఉన్నవి ఎనిమిది బుల్లెట్లు. వాటితో… ఆ కామన్ మాన్ ఏం చేశాడు? కృష్ణ చేతికి రివాల్వర్ చిక్కిందా, లేదా? అనేది మిగిలిన కథ.
8 తొట్టక్కల్ అనే ఓ తమిళ సినిమాకి ఇది రీమేక్. నిజానికి చాలా మంచి ఆలోచన ఇది. ఓ పోలీస్ సర్వీస్ రివాల్వర్ పోతే.. ఏం జరిగిందన్నది కథ. ఇలాంటి రివాల్వర్లు ఎలా చేతులు మారతాయో.. చాలా ఆసక్తిగా చూపించారు. `8 తొట్టక్కల్` కథని తీసుకున్నా, దర్శకుడు తనవైన మార్పులు, చేర్పులూ చేసుకుంటూ వెళ్లాడు. తనకు కావల్సినంత క్రియేటీవ్ ఫ్రీడమ్ దొరికిందనే అనుకోవాలి. కృష్ణ చైల్డ్ వుడ్ ఎపిసోడ్ తో ఈ కథ మొదలవుతుంది. తను ఎస్.ఐ అవ్వడం, వెంటనే సర్వీస్ రివాల్వర్ పోవడంతో అసలు కథలోకి తీసుకెళ్లిపోయాడు దర్శకుడు.
అయితే.. మధ్యలో `నన్ను బూతు తిట్టాడు సార్` అంటూ ఓ టైపిస్ట్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చే సీన్ ఒకటుంది. అదెందుకు? అనిపిస్తుంది. బహుశా… హీరో, హీరోయిన్ల మధ్య పరిచయం కోసమా? అనుకుంటే.. వారిద్దరి ట్రాక్ కూడా అంత పకడ్బందీగా లేదు. ఈ కేస్ సాల్వ్ అవ్వడానికి జర్నలిస్టు పాత్ర చేసిందేం లేదు.
అది మినహాయిస్తే… అసలు రివాల్వర్ ఒకరి చేతుల్లోంచి మరొకరి చేతుల్లోకి మారే విధానం ఆసక్తి రేకెత్తిస్తుంది. ఆ రివాల్వర్ ఎవరెవరి చేతుల్లోకి వెళ్లిందో… వాళ్లంతా కథలో కీలకం అవుతారు. కృష్ణమూర్తి (రాజేంద్ర ప్రసాద్) ఈ కథలో సేనాధిపతి. అయితే.. ఈ కథ.. కృష్ణ కోణంలో మొదలవుతుంది. కృష్ణ ఫ్లాష్ బ్యాక్ తో మొదలైనప్పుడు ఈ కథ.. కృష్ణదేమో అనిపిస్తుంది. కానీ… కృష్ణమూర్తి వచ్చాక.. ప్రేక్షకులంతా కృష్ణమూర్తి కోణంలో ఈ కథని ఆలోచించడం మొదలెడతారు. ఇంట్రవెల్ బ్యాంగ్ .. రాసుకున్న పద్ధతీ… తెరకెక్కించిన తీరు ఆకట్టుకుంటాయి.
అసలు కృష్ణమూర్తికి ఆ సర్వీస్ రివాల్వర్ అవసరం ఎందుకొచ్చింది? అనేది కథలో చాలా కీలకమైన విషయం. తనని తన కుటుంబం ముందు నిరూపించుకోవడానికి.. కృష్ణమూర్తి బ్యాంకు దోపిడీ చేయడానికి పాల్పడ్డాడా? అనేది కన్వెన్సింగ్ గా లేదు. ఆ ప్రోసెస్ లో చాలామంది చావులకు కృష్ణమూర్తి కారణం అవుతాడు. చంపక తప్పని పరిస్థితులే సృష్టించినా – కృష్ణమూర్తి క్యారెక్టర్ ని నెగిటీవ్ గా చూపించిన సందర్భాలే అవన్నీ. సీఐని కృష్ణమూర్తి చంపడంలో ఓ అర్థం ఉంది. తన జీవితం నాశనం అవ్వడానికి కారణం తనే కాబట్టి. మరి మిగిలినవాళ్లు ఏం చేశారు? అనే ప్రశ్న వేసుకుంటే, కృష్ణమూర్తి పాత్ర నైతికంగా నిలబడదు. ఈ సినిమా అంతా సీరియస్ ఎమోషన్‌తో సాగేదే. లవ్ ట్రాక్‌కు, కామెడీకీ పెద్ద స్కోప్ లేదు. మనిషిలోని డార్క్ ఎమోషన్స్ ని చూపించడానికి వాడుకున్నాడు. హర్షవర్థన్ పాత్రని ట్రీట్ చేసిన విధానం బాగుంది.
నరేష్ అగస్త్య చాలా కూల్‌గా నటించాడు. తన ఎక్స్ప్రెషన్స్ లో పెద్దగా మార్పు కనిపించదు. ఒకే ఎమోషన్ తన మొహంపై ప్లే అవుతూ వెళ్తుంది. బహుశా.. ఈ పాత్రకు అదే కరెక్టేమో.? రాజేంద్ర ప్రసాద్ లోని మరో కోణం కృష్ణమూర్తి పాత్ర. కేఫ్ లో బ్లాక్ కాఫీ తాగుతూ.. కృష్ణమూర్తి ఎమోషన్ అయ్యే సీన్ చూస్తే.. ఒక్క రాజేంద్ర ప్రసాద్ మాత్రమే ఇలా నటించగలడా? అనిపిస్తుంది. రాకేందు మోళి.. `రా`గా కనిపించాడు. అస్సలు మేకప్ లేని పాత్రలే అన్నీ. హర్షవర్థన్ కి ఎక్కువ మార్కులు పడతాయి. టెక్నికల్ గా సినిమా చాలా బాగుంది. చాలా వరకూ రియల్ లొకేషన్లలో ఈ సినిమా తీశారు. కెమెరా పరుగులు పెట్టింది. కొన్ని సీన్లు.. ఎమోషన్‌గా కనెక్ట్ అయ్యేలా రాసుకున్నాడు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరింత ప్లస్ అయ్యింది.
దాదాపు రెండున్నర గంటల సినిమా ఇది. రాజేంద్ర ప్రసాద్ నటన కోసం, కొన్ని థ్రిల్లింగ్ మూమెంట్స్ కోసం.. ఓసారి చూడొచ్చు.