అలనాటి అగ్రతార జమున కన్నుమూశారు. ఆమె వయసు 86. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. హైదరాబాద్లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.
1936లో కర్నాటక రాష్ట్రంలోని హంపీలో జమున పుట్టారు. అయితే కుటుంబసభ్యులు ఆంధ్రప్రదేశ్’కి తరలిరావడంతో ఆమె బాల్యం గుంటూరు జిల్లా దుగ్గిరాలలో గడిచింది. సినీనటుడు జగ్గయ్యదీ అదే గ్రామం కావడంతో జమున కుటుంబానికి ఆయనతో కొంత పరిచయం ఉంది.
జమున స్కూలులో చదివేకాలం నుంచే నాటకాలవైపు ఆకర్షితురాలయ్యారు. దాంతో ఆమెకు నాటకాల్లో పాల్గొనాలనే కోరిక పుట్టింది. అప్పుడు తెనాలీ సమీపంలోని మండూరు గ్రామంలో ఖిల్జీరాజ్యపతనం అనే నాటిక ప్రదర్శనకోసం జగ్గయ్య ప్రత్యేకంగా జమునను ఎంపికచేసి తీసుకెళ్లారు. ఆ నాటికలో మరో ప్రముఖనటుడు గుమ్మడి కూడా నటించారు. ఆ నాటకంతోబాటు ఇతర చాలా నాటకాల్లో కూడా ఆమె నటించింది. ఆ నాటకాలలో ఆమె ప్రతిభ నలుమూలలకు పాకడం వల్లే సినిమా అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి.
ఆమె మొదటిచిత్రం ‘పుట్టినిల్లు’. తర్వాత అక్కినేని, ఎన్టీఆర్, జగ్గయ్యలతోబాటు ఇతర ప్రముఖ నటులతో కలిసి నాయికగా అనేక విజయవంతమైన చిత్రాల్లో నటించారు.ఆమె పోషించిన సత్యభామ పాత్రే ఆమెకు మరింతగా పేరుప్రఖ్యాతలు వచ్చేలా చేసింది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ చిత్రాల్లో ఆమె నటించారు. దాదాపు 200 దాక తెలుగు చిత్రాలలో ఆమె నటించారు.