“ఎవరి ఆస్తి చోరీ జరిగితే వాళ్లు ఫిర్యాదు చేస్తేనే కేసు..”.. దొంగతనం కేసుల్లో ఇది ప్రాథమిక లక్షణం. మా పక్కింట్లో దొంగతనం జరిగిందని.. వెళ్లి ఎవరైనా పోలీసులకు కంప్లైంట్ చేస్తే.. వాళ్లను పోలీసులు ఎగాదిగా చూసి…పిచ్చోడ్ని చూసినట్లు చూసి పంపించేస్తారు. అది సహజం. కానీ.. తెలంగాణలో నమోదు ఐన ” ప్రభుత్వ సమాచారం చోరీ కేసు”లో ఏం జరిగింది..?. ఏపీ ప్రభుత్వ సమాచారం.. ఎవరోప్రైవేటు కంపెనీ వాళ్లు దొంగిలించారని.. ఇంకెవరో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు పెట్టారు. ఐటీ కంపెనిపై దాడి చేశారు. ఇందులో ఎక్కడా చోరీకి గురయిందని చెబుతున్న వారు లేరు.. దొంగతనం చేశారన్న ఆధారాల్లేవు.. ఫిర్యాదు చేసిన వాళ్లు కనీసం పక్కింటి వాళ్లు కూడా కాదు..! మరి పోలీసులు ఎందుకు ఓవర్‌గా రియాక్టయ్యారు..!?
అసలు ఫిర్యాదు ఏమిటి..?
ఏపీ ప్రభుత్వ సమాచారం చోరీకి గురయింది. అది ఐటీ గ్రిడ్ కంపెనీనే చోరీ చేసింది..!
ప్రాథమికంగా పోలీసులు ఏం చేయాలి..?
ఇక్క ఆస్తి ఎవరిది ఏపీ ప్రభుత్వానిది..! ఇలాంటి ఫిర్యాదు వస్తే.. ముందుగా పోలీసులు ఏం చేస్తారు..? అసలు ఆస్తి… అంటే.. ఇక్కడ “ప్రభుత్వ సమాచారం” చోరీకి గురయిందా లేదా.. అనేది ఆరా తీస్తారు. ముందుగా.. సదరు ఆస్తి దారునికి సమాచారం ఇస్తారు. చోరీకి అయితే దానికి సంబంధించిన సమాచారం తెలుసుకుంటారు. కానీ తెలంగాణ పోలీసులు ఆస్తి దారునికి సంబంధం లేకుండానే… కేసు నమోదు చేశారు. ఐటీ గ్రిడ్ కంపెనీపై దాడి చేశారు. వారి ఆస్తులన్నీ పట్టుకుపోయారు. వారి ఉద్యోగుల్ని అక్రమంగా అదుపులోకి తీసుకున్నారు. అంటే.. అసలు ఎవరిదైతే ఆస్తి పోయిందని చెబుతున్నారో వాళ్లు ఫిర్యాదు చేయకుండా.. వాళ్ల తరపున చేసినట్లు.. ఎవరో ఫిర్యాదు చేస్తే.. వారు అనుమానం వ్యక్తం చేసిన వారిపై దాదాపుగా శిక్ష విధించేశారన్నమాట. ఇది ఏ విధంగానూ సహజ న్యాయసూత్రాలకు అతకదు. ఈ విషయంలో పోలీసులు తొలి తప్పటడుగు వేశారు.
డేటా చోరీ కాలేదని ఏపీ ప్రభుత్వం కోర్టు చెబుతుంది..! ఆ విషయం పోలీసులకు తెలియదా..?
వ్యవహారం పూర్తిగా ఆంధ్రప్రదేశ్‌ది. అక్కడి ప్రభుత్వానికి సంబంధించినది. అక్కడి ప్రజలకు సంబంధించినది. తెలంగాణకు ఒక్క శాతం సంబంధం లేదు. కేవలం.. ఫిజికల్‌గా.. అసలు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేని వ్యక్తి చేసిన ఫిర్యాదు మేరకు… పోలీసులు హడావుడి చేశారు. ఈ కేసులో ఏపీ ప్రభుత్వం చెప్పేదే కీలకం. అసలు మా ఆస్తి ఏమీ పోలేదని… ప్రభుత్వ సమాచారం లీక్ కాలేదని.. అది అధికారికంగా ప్రభుత్వ సేవలకు అందించేందుకు మాత్రమే వినిగించే యాక్సెస్ ఇచ్చామని ప్రభుత్వం కోర్టుకు చెబుతుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. మరి అప్పుడు్ పోలీసులు ఏం చెబుతారు..? ఏపీ ఆస్తి చోరీకి గురయిందని కేసు వచ్చినప్పుడు.. ఏపీని సంప్రదించకుండా.. ఎందుకు కంపెనీలపై దాడి చేశారని.. ఉద్యోగుల్ని నిర్బంధం లోకి తీసుకున్నారని కోర్టు ప్రశ్నిస్తే.. పోలీసులు ఏం సమాధానం చెబుతారు..? . విశేషం ఏమిటంటే.. పోలీసులు కూడా.. డేటా చోరీ జరిగిందని కానీ.. మరొకటని కానీ చెప్పలేదు. కేవలం సేవామిత్ర యాప్‌లో సున్నితమైన సమచారం ఉందనే చెబుతున్నారు.
చీవాట్లు పడినా లక్ష్యం సాధించడానికేనా..?
ఈ కేసు విషయంలో తెలంగాణ పోలీసులకు మరక కచ్చితంగా పడుతుంది. ఆ విషయం.. సైబర్ నేరాలు మాత్రమే కాదు… ఇతర నేరాలపై అవగాహన ఉన్న వారికి కూడా తెలుస్తుంది. కానీ.. ఆ మరక కంటే.. అతి ముఖ్యమైన లాభం ఏదో.. తమను ఈ చర్యల దిశగా పురికొల్పిన వారికి చేయాలన తపన పోలీసుల్ని కనిపించింది. ఎందుకంటే.. ఎన్ని మరకలు పడినా.. అక్కడ పోలీసులు ప్రభుత్వ అధీనంలోనే ఉంటారు. ఆ మేరకు .. వారి ప్రమోషన్లకు.. అర్హతలు కావొచ్చు. అందుకే కోర్టుల చీవాట్లను కూడా తినడానికి సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా… వ్యవహరిస్తూ… అన్యాయం చేయడానికి సిద్ధపడిపోతున్నారు. శనివారం అర్థరాత్రే తమ కార్యాచరణ ప్రారంభించడానికి కూడా కారణం.. ఆది, సోమవారాలు సెలవులు. ఈ రెండు రోజుల్లోనేనే… ఈ దిశగా ఆ పోలీసుల్ని పురికొల్పిన వారి లక్ష్యాన్ని సాధించి పెట్టాలని అనుకున్నారు. ఇప్పటికే సాధించి ఉంటారు.. కానీ చట్టాన్ని.. న్యాయాన్ని పట్టించుకోకుండా.. పోలీసులు వ్యవహరించడం వల్ల నష్టపోయిన వారికి… ఈ దేశం చట్టాలు ఎలా రక్షణ కల్పిస్తాయి..? వారికి నష్టాన్ని ఎవరు భర్తీ చేస్తారు..?