హైదరాబాద్ లో ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రధానకార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఒకటవ, రెండవ అంతస్తులని తెలంగాణా తెదేపా కోసం కేటాయించారు. తెలంగాణా రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తదితరులు నిన్న దానిలో తమ కార్యక్రమాలు ప్రారంభించారు. ఆ సందర్భంగా వారు యధాప్రకారం తెరాస ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఇదివరకు తెరాసలో చేరిన జూబిలీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అనుచరుడు ప్రదీప్ చౌదరి మళ్ళీ నిన్న తెదేపాలో చేరడం విశేషం.
రాష్ట్ర విభజన జరిగిన తరువాత కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఎప్పుడూ కోలాహలంగానే ఉండేది. ఓటుకి నోటు కేసు తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడకి తరలివచ్చేయడం, తెలంగాణా రాజకీయాలకి, ఆ రాష్ట్ర తెదేపాకి దూరం అవడం, తెదేపా ఎమ్మెల్యేలు తెరాసలోకి ఫిరాయింపు వంటి అనేక కారణాల చేత ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో మునుపటి ఆ హడావుడి చాలా తగ్గింది. ఆ తరువాత తెదేపా ఏపి విభాగం కోసం గుంటూరులో తాత్కాలికంగా ప్రధాన కార్యాలయం కూడా ఏర్పాటు చేసుకొన్నారు. ఈ కారణాల చేత తమ అధినేత చంద్రబాబు నాయుడు తెలంగాణా రాజకీయాలపై, పార్టీపై కూడా ఆసక్తికోల్పోయారనే భావన తెలంగాణా తెదేపా నేతలలో అంతర్లీనంగా ఉంది. అది సహజం కూడా.
నేటికీ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో తరచూ పార్టీ ఇరు రాష్ట్రాల నేతలతో సమావేశాలు, కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నారు. తెలంగాణా తెదేపాని మళ్ళీ పటిష్టం చేసుకొని పూర్వ వైభవం సాధించాలనే పట్టుదల లోకేష్, రేవంత్ రెడ్డిల మాటలలో కనిపిస్తుంటుంది. బహుశః అందుకే తెలంగాణా తెదేపాకి ప్రత్యేకంగా రెండు అంతస్తులు కేటాయించి ఉండవచ్చు. తద్వారా తెలంగాణా తెదేపాకి పార్టీ అధిష్టానం చాలా ప్రాధాన్యం ఇస్తోందని, తెలంగాణాలో పార్టీకి ఉజ్వల భవిష్యత్ ఆశిస్తోందనే బలమైన సంకేతాలు ఇచ్చినట్లయింది. కానీ తెలంగాణాలో తెదేపా మళ్ళీ పూర్వ వైభవం సాధించాలంటే, ఈ చిన్న ఏర్పాటు లేదా ప్రయత్నం సరిపోదు.
పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్వయంగా తెలంగాణా తెదేపా నేతలకి దిశానిర్దేశం చేయడం చాలా అవసరం. అలాగే వారి ఆత్మస్థయిర్యం పెంచేందుకు అవసరమైన చర్యలని చేపట్టడం కూడా చాలా అవసరం. అన్నిటికంటే ముందుగా తెలంగాణాలో తెదేపా వాస్తవ పరిస్థితిని సమీక్షించుకొని, పార్టీలో లోపాలని, బలహీనతలని సవరించుకొని మళ్ళీ పార్టీని బలోపేతం చేసుకోవడానికి అందరూ సమిష్టిగా, చాలా చిత్తశుద్ధితో ప్రయత్నించాలి. కారణాలు ఏవైతేనేమి, ఇప్పుడు తెలంగాణాలో ప్రతిపక్షాలకి చాలా అనుకూలమైన పరిస్థితులు మళ్ళీ కనిపిస్తున్నాయి. కనుక ఈ అవకాశాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోగలిగితే తెదేపా కూడా మళ్ళీ కోలుకోగలుగుతుంది.