ఆగస్టులో బాక్సాఫీసుకు అర కొర విజయాలే దక్కాయి. ‘సరిపోదా శనివారం’ కాస్త తెరిపిన ఇచ్చినా, వర్షాల ప్రభావంతో రావల్సిన వసూళ్లు దక్కడం లేదు. ఈలోగా సెప్టెంబరు మొదలైపోయింది. ఈనెల తొలి వారంలోనూ కొత్త సినిమాల తాకిడి కనిపిస్తోంది. ఓ పెద్ద సినిమాతో రెండు చిన్న సినిమాలు పోటీ పడడం ఈవారం ప్రత్యేకత.
తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించిన ‘GOAT’ ఈనెల 5న విడుదల కానుంది. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించారు. ఇది వరకు విజయ్ డబ్బింగ్ సినిమాలకు తెలుగులో అంతగా గిరాకీ ఉండేది కాదు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. విజయ్ సినిమాలు తెలుగులోనూ మంచి వసూళ్లు దక్కించుకొంటున్నాయి. ఈ చిత్రాన్ని తెలుగులో మైత్రీ మూవీస్ సంస్థ విడుదల చేస్తోంది. కాబట్టి మంచి రిలీజ్ దక్కబోతోంది. హైదరాబాద్ లో తెల్లవారుఝామున 4 గంటల నుంచే విజయ్ హంగామా మొదలు కానుంది. విజయ్ రాజకీయ అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తరవాత విజయ్ పూర్తిగా పార్టీకే సమయం కేటాయించబోతున్నారు. ఎన్నికల తరవాత విజయ్ సినిమాలు చేస్తారా, లేదా? అనేది ప్రశ్నార్థకం. కాబట్టి ఇదే చివరి సినిమా అనే ఫీలింగ్ అభిమానులకు ఉంది. కాబట్టి తమిళనాట ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టే అవకాశం ఉంది.
తెలుగు నుంచి ’35: చిన్న కథ కాదు’, ‘జనక అయితే గనక’ రెండు చిత్రాలూ విడుదలకు రెడీ అయ్యాయి. 6న ’35’ వస్తోంది. మరుసటి రోజు ‘జనక అయితే గనక’ విడుదల కానుంది. రెండూ చిన్న సినిమాలే అయినా కాన్సెప్ట్ బలంగా ఉంది. ’35’ వెనుక.. రానా ఉన్నాడు. ‘జనక అయితే గనక’ దిల్ రాజు బ్యానర్ నుంచి వస్తున్న సినిమా. సుహాస్ సినిమాలంటే ప్రేక్షకుల్లో ఓరకమైన ఆసక్తి ఉంది. దానికి తోడు వినాయక చవితి సెలవలు ఈ చిత్రానికి కలిసి వచ్చే అవకాశం ఉంది. ఈమధ్య చిన్న సినిమాలే బాక్సాఫీసుకు ఓదార్పు విజయాల్ని అందిస్తున్నాయి. ఆ సెంటిమెంట్ వర్కవుట్ అయితే ఈ రెండు సినిమాలూ మ్యాజిక్ చేయొచ్చు.