ఐటీ గ్రిడ్ కంపెనీ.. అక్రమంగా డేటా సేకరించిందని.. సైబరాబాద్ సీపీ సజ్జనార్ ప్రకటించారు. అందుకే కేసులు నమోదు చేశామని చెప్పుకొచ్చారు. అక్రమంగా డేటా సేకరించిందని ఎలా నిర్ణయించారని జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పలేకపోయారు. సేవా మిత్ర అనే యాప్ లో ఓటర్ల వివరాలు, ఆధార్ కార్డు వివరాలు, ప్రభుత్వ లబ్దిదారుల వివరాలు ఉన్నాయని.. అలాంటి సున్నితమైన సమాచారం ఉండటం వల్ల మిస్ యూజ్ అవుతుందని అందుకే… చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. సేవామిత్ర యాప్ లో సమాచారం… చోరీ ద్వారా వచ్చిందా.. ఇంకెవరైనా ఇచ్చారా అన్నది దర్యాప్తులో తెలుతుందని చెబుతున్నారు. ఈ విషయంపై ఆధార్ కార్డు అధికారులు, ఎన్నికల సంఘం అధికారులకు.. లేఖలు రాశామని వారి దగ్గర నుంచి సమాచారం వచ్చిన తర్వాత మిగతా చర్యలు తీసుకుంటామన్నారు. లోకేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు… తాము సోదాలు చేశామని.. ఐటీ గ్రిడ్ అనే కంపెనీ నుంచి సర్వర్లు, ట్యాబులు, హార్డ్ డిస్కులు స్వాధీనం చేసుకున్నామని… వాటిని ఎఫ్ఎస్ఎల్కు పంపామని చెప్పుకొచ్చారు.
ఏపీ ప్రభుత్వ అధికారిక సమాచారం… అక్రమమంగా సేవామిత్ర యాప్ దగ్గర ఉందని మీరు ఎలా నిర్దారిస్తారని జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు సజ్జన్నార్ సూటిగా సమాధానం చెప్పలేదు. అది… ఐటీ గ్రిడ్ కంపెనీ యజమాని అశోక్ వచ్చి సమాధానం చెప్పాలని అంటున్నారు. జర్నలిస్టులు అడిగిన అనేక ప్రశ్నలకు చట్టం ప్రకారం… చేస్తామని చెప్పుకొచ్చారు కానీ.. ఎక్కడా నేరం జరిగిందని కానీ.. డేటా మిస్ యూజ్ అయిందని కానీ.. సజ్జన్నార్ చెప్పలేదు. కేవలం సేవామిత్ర యాప్ ద్వారా … సమాచారం సేకరించారని మాత్రమే చెప్పుకొచ్చారు. ఓటర్ల తొలగింపుపై ఏపీలో కేసులు నమోదయ్యాయని.. సజ్జన్నార్ చెప్పుకొచ్చారు. కానీ.. ఫామ్ -7ల వ్యవహారం గురించి ఈ ఐటీ గ్రిడ్ కేసుకు సంబంధం ఏమిటో మాత్రం చెప్పలేదు.
ఏపీకి సంబంధించిన కేసు మీరు ఎలా దర్యాప్తు చేస్తారని.. జర్నలిస్టులు కొన్ని సెక్షన్లను… గుర్తు చేసి ప్రశ్నించినప్పటికీ… నేరం ఇక్కడే జరిగింది కాబట్టి… ఇక్కడే దర్యాప్తు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. అదే సమయంలో… నేరం జరిగిందో లేదో.. అంటే చోరీ జరిగిందో లేదో.. అది అధికారికంగా సేకరించారో.. మరో విధంగా అందిందో దర్యాప్తులో తేలుతుందని.. చెప్పుకొచ్చారు. సైబరాబాద్ కమిషనర్ బాగా రాజకీయ ఒత్తిడిలో ఉన్నట్లు కనిపించారు. అచ్చంగా ఉదయం కేటీఆర్ ప్రెస్మీట్లో మాట్లాడినట్లే మాట్లాడారు. ప్రెస్మీట్ మొత్తం మీద ఎక్కడా నేరం జరిగినట్లు ఆయన చెప్పలేదు. సేవామిత్ర యాప్ లో మాత్రం డాటా ఉందన్నారు. ఆ డేటా ఎలా వచ్చిందో దర్యాప్తు చేస్తామన్నారు. సేవామిత్ర యాప్.. టీడీపీ కార్యకర్తల యాప్. టీడీపీకి 60 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు. వారంతా.. తమ అనుమతితో ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, కలర్ ఫోటోలు ఇచ్చారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.