కొంతకాలంగా బాలీవుడ్ వరుస పరాజయాలతో ఉక్కిరి బిక్కిరి అవుతోంది. బడా హీరోల సినిమాలన్నీ.. బాక్సాఫీసు దగ్గర బోల్తా కొడుతున్నాయి. మొగుడు కొట్టినందుకు కాదు, తోడి కోడలు నవ్వినందుకు అన్నట్టు… దక్షిణాది సినిమాలన్నీ వంద, రెండొందల కోట్లు తెచ్చుకొని హోరెత్తించినందుకు బాలీవుడ్ మరింత… కృంగిపోయింది. సల్మన్, అమీర్ ఖాన్లు కూడా ఏమీ చేయలేకపోయారు. వాళ్ల సినిమాలూ డిజాస్టర్లుగా నిలిచాయి. ఇలాంటి దశలో.. షారుఖ్ బాలీవుడ్ కి ఊపిరి పోశాడు. మొన్న పఠాన్, ఇప్పుడు జవాన్ సినిమాలతో బాలీవుడ్ ప్రతిష్టని మళ్లీ నిలబెట్టాడు. రెండూ ఒకదాన్ని మించి మరోటి విజయాన్ని సాధించాయి. షారుఖ్ కెరీర్ బెస్ట్ సినిమాల్లో పఠాన్ ఉంది. దాన్ని… జవాన్ బీట్ చేసేసింది. బాలీవుడ్ స్టామినా ఈ రెండు సినిమాలూ మరోసారి సినీ ప్రపంచానికి తెలిసేలా చేశాయి.
షారుఖ్ నుంచి ఈ యేడాదే మరో సినిమా రాబోతోంది. రాజ్ కుమార్ హిరాణీ దర్శకత్వంలో రూపొందించిన డంకీ ఈ డిసెంబరు 22న విడుదల కాబోతోంది. రాజ్ కుమార్ హిరాణీ సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన ఫ్లాపులు తీయడానికి ఏమాత్రం ఒప్పుకోడు. ఒకవేళ సినిమా బాక్సాఫీసు దగ్గర రాణించకపోయినా… క్లాసిక్ గా నిలబడిపోతుంది. అదీ.. రాజ్ కుమార్ స్టైల్. `డంకీ` కమర్షియల్గానూ పే చేయబోతోందని, షారుఖ్ సినిమాల్లో ది బెస్ట్ గా నిలబడుతుందని బాలీవుడ్ గట్టిగా నమ్ముతోంది. అంటే… పఠాన్, జవాన్, డంకీ.. ఇలా వరుసగా ఒకదాన్ని మించి మరో సినిమా ఇచ్చి.. 2023ని షారుఖ్ మెమరబుల్ గా మార్చేయబోతున్నాడన్నమాట. డంకీ కూడా అందరి అంచనాల్నీ అందుకొంటే 2023ని షారుఖ్ నామ సంవత్సరంగా పిలవడంలో ఎవరికీ ఎలాంటి అభ్యంతరాలూ ఉండకపోవొచ్చు.