షర్మిల పాదయాత్రను కూడా ఇక భరించలేమని టీఆర్ఎస్ నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది. వరంగల్ జిల్లాలో ఆమె పాదయాత్రపై టీఆర్ఎస్ శ్రేణులు దాడులకు పాల్పడ్డాయి. ఆమె బస్సుకు నిప్పు పెట్టారు. వాహనాలపై రాళ్లేశారు. దీంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి హైదరాబాద్కు తరలించారు. ఉద్రిక్త పరిస్థితుల్లో పాదయాత్ర చేయకూడదని ఆమెకు చెప్పేశారు. దీంతో ప్రజా ప్రస్థానం పాద యాత్రను అడ్డుకోవడానికే ఉద్రిక్తలు సృష్టించి అరెస్ట్ చేశారని షర్మిల ఆరోపించారు. పాదయాత్రలో శాంతి భద్రతల సమస్యను సృష్టించి యాత్రను అడ్డుకునేందుకే బస్సును తగలబెట్టారని మండిపడ్డారు.
నిజానికి షర్మిల పాదయాత్రలో పెద్దగా ఎవరూ పాల్గొనడం లేదు. వ్యక్తిగత సెక్యూరిటీతో పాటు ఎప్పుడూ వెంట ఉండే.. ఓ నూట యాభై మంది మాత్రమే ఉంటున్నారు. అయినప్పటికీ ఆమె పాదయాత్రను టీఆర్ఎస్ టార్గెట్ చేశారు. నర్సం పేట ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు చేశారని కారణంగా చూపించి ఆమె పాదయాత్రపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడులు చేశారు. పోలీసులు టీఆర్ఎస్ కార్యకర్తల్ని నిలువరించలేదు. షర్మిలను మాత్రం అరెస్ట్ చేశారు.
అయితే తాను ఇలాంటి దాడులకు భయపడబోనని..మళ్లీ పాదయాత్ర చేస్తానని అంటున్నారు. అయితే బండి సంజయ్ లాగా ఆమె కూడా కోర్టుకు వెళ్లి పాదయాత్రకు పర్మిషన్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా మూడున్నర వేల కిలోమీటర్లు ఆమె పాదయాత్ర పూర్తయింది. వరంగల్ జిల్లాలో నడిస్తే.. గ్రేటర్ హైదరాబాద్ మాత్రమే మిగులుతుంది. ఇప్పుడు షర్మిల.. పాదయాత్ర ఆపేస్తారో .. కోర్టుకెళ్తారో చూడాల్సి ఉంది.