ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల వ్యూహాత్మక రాజకీయాలు చేస్తున్నారు. భవిష్యత్ ను అంచనా వేసి రాజకీయంగా అడుగులు వేస్తున్నారు. గతంలో ఎదురైనా అనుభవాల దృష్ట్యా మరోసారి అలాంటి ఛాన్స్ ఇవ్వకుండా కాంగ్రెస్ లో మరింత పట్టు సాధించేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు.
ఇప్పటికే కొంతమంది సీనియర్లు షర్మిల వైఖరిపై పెదవి విరుస్తోన్న నేపథ్యంలో తనకంటూ ప్రత్యేకంగా పార్టీలో ఓ వర్గం ఏర్పాటు చేసుకునే ఆలోచనలో ఉన్నారు. ఈమేరకు రాష్ట్ర, జిల్లా కమిటీలో తనకు అనుకూలంగా ఉండే నేతలకు షర్మిల ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్నారు.
మంగళవారం అన్ని రాష్ట్రాల పీసీసీ చీఫ్ లతో ఏఐసీసీ కీలక సమావేశం ఏర్పాటు చేయడంతో.. ఈ సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్ళిన షర్మిల…పార్టీ రాష్ట్ర కమిటీల్లో తాను సూచించిన వ్యక్తులకు చోటు కల్పించాలంటూ ఏఐసీసీ నేతలకు పెద్ద జాబితే సమర్పించారు.
ఈ జాబితాలో పూర్తిగా తనకు మద్దతుదారులుగా ఉన్న నేతల పేర్లే షర్మిల పొందుపర్చారని, కొంతమంది సీనియర్ నేతల పేర్లను ఆమె పరిగణనలోకి తీసుకోలేదని తెలుస్తోంది. భవిష్యత్ రాజకీయాలను విశ్లేషించి షర్మిల ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు.
ఎప్పటికైనా పిల్లకాలువలు సముద్రంలో కలువక తప్పదని వైసీపీని ఉద్దేశించి షర్మిల గతంలో వ్యాఖ్యానించారు. ఇక, ఇప్పటికే జగన్ అడుగులు ఇండియా కూటమి వైపు వేస్తున్నారన్న ప్రచారం నేపథ్యంలో..పార్టీలో తనకు ప్రత్యేక వర్గం ఉండేలా రాష్ట్ర, జిల్లా కమిటీలో తన మద్దతుదారులకు షర్మిల ప్రియార్టి ఇచ్చినట్లుగా తెలుస్తోంది.