త్వరలోనే జి.హెచ్.ఎం.సి. ఎన్నికలు జరుగబోతున్నాయి. బహుశః అందుకే నేటి నుంచి షర్మిల హైదరాబాద్ లో పరామర్శ యాత్ర ఆరంభిస్తున్నట్లున్నారు. నేటి నుండి మూడు రోజులపాటు ఆమె నగరంలో పరామర్శ యాత్ర చేస్తారని సమాచారం. పేరుకి అది పరామర్శ యాత్రే అయినా వైకాపా నేతలు, కార్యకర్తలు అందరూ భారీ సంఖ్యలో ఆమెను అనుసరిస్తారు కనుక దానిని రాజకీయ యాత్రగానే చూడవలసి ఉంటుంది.
జి.హెచ్.ఎం.సి. ఎన్నికలలో వైకాపా పోటీ చేయబోతోందా లేదా అనే విషయాన్ని ఆ పార్టీ ఇంతవరకు ప్రకటించకపోయినా సరిగ్గా ఎన్నికల ముందే నగరంలో ఆమె ఈ యాత్ర చేపడుతున్నారు కనుక ఈ ఎన్నికలలో వైకాపా కూడా పోటీ చేస్తుందని భావించవచ్చును. ఒకవేళ వైకాపా పోటీ చేసినట్లయితే, మళ్ళీ ఆంధ్రా ఓటర్లను చీల్చి తెరాసకు లబ్ది చేకూర్చడానికే కావచ్చును. లేదా ఎన్నికల తరువాత అవసరమయితే జి.హెచ్.ఎం.సి. బోర్డుని దక్కించుకొనేందుకు తెరాసకు మద్దతు ఇచ్చేందుకు కావచ్చును. ఈ మూడు రోజుల పరామర్శ యాత్రలో షర్మిల హైదరాబాద్ లో 13 కుటుంబాలను పరామర్శించబోతున్నట్లు సమాచారం.