రోజుకో నాలుగైదు సభలో జగన్మోహన్ రెడ్డి పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఆయన చేస్తున్న ఎన్నికల ప్రచారం… టీడీపీ పాలన అవినీతిమయమనీ, కోట్లకు కోట్లు దోచేశారనీ, ఇసుక నుంచి గుడి భూములు దాకా ఆక్రమించేశారనీ… ఇదే ధోరణిలో ఉంటోంది. చంద్రబాబుపై వ్యక్తిగత విమర్శలకే ఆయన ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను నమ్మొద్దనీ.. తన ప్రభుత్వం రాగానే అంతకంటే ఎక్కువే చేస్తానంటూ మాట్లాడుతున్నారు. జగన్ ప్రచారమంతా దాదాపు ఇలాంటి అంశాల చుట్టూనే సాగుతోంది. ప్రచారం చివరి దశకు చేరుకున్న సమయంలో వైకాపా గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ, జగన్ సోదరి షర్మిల కూడా ప్రచార సభల్లో ప్రసంగాలు చేస్తున్నారు. మరి, వీరి ప్రచార లక్ష్యమేంటీ అంటే…. వైయస్సార్ హయాంను గుర్తు చేసే ప్రయత్నం అని చెప్పొచ్చు.
గుంటూరు సభలో షర్మిల మాట్లాడుతూ… 11వ తేదీన ఓటు వేసే ముందు ఒక్కసారి రాజన్న గురించి తల్చుకొండి, ఆయన కుమారుడు జగన్నకి ఒక్క అవకాశం ఇవ్వండి పిలుపునిచ్చారు. ఫ్యాను గుర్తుపై మీరు వేసే ప్రతీ ఓటు రాజన్నకే అని అందరూ భావించాలన్నారు. రాజన్న రాజ్యంలో అన్ని వర్గాల ప్రజలూ సంతోషంగా ఉండేవారనీ, కుల మతాలకు అతీతంగా ముఖ్యమంత్రి హోదాలో ఆయన ప్రజలందరికీ చాలా మేలు చేశారని చెప్పారు. చంద్రబాబు పాలనలో ఒక్క వర్గమైనా సంతోషంగా ఉందా అని ప్రశ్నించారు. శ్రీకాకుళం జిల్లా పొందూరులో జరిగిన ప్రచార సభలో విజయమ్మ పాల్గొన్నారు. ఆమె కూడా… ఒక్కసారి రాజశేఖరరెడ్డి పాలనను గుర్తుచేసుకోవాలని ప్రసంగించారు. ఆయన పాలనలో అనేక సంక్షేమ పథకాలు అమలు జరిగేవన్నారు. వైయస్ హయాంలో రైతులకు గిట్టుబాటు ధర ఉండేదనీ, 108, 104 లాంటి సేవలు పేదలకు అందుబాటులో ఉండేవన్నారు. జగన్ ముఖ్యమంత్రి అయితే మళ్లీ ఆరోజులు వస్తాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
షర్మిల, విజయమ్మ… ఈ ఇద్దరి ప్రచారంలో కామన్ పాయింట్ ఏంటంటే వైయస్సార్ హయాంని ప్రజలకు గుర్తుచేయడం. జగన్ అధికారంలోకి వస్తే మళ్లీ ఆరోజులే వస్తాయన్న సెంటిమెంట్ ని ప్రజల్లో కలిగించడం. వైయస్ హయాంలో ఏపీలో పేదలకు చాలా మేలు జరిగిందన్నది వాస్తవం. అయితే, కేవలం వారసత్వం ప్రాతిపదికన జగన్ పాలన కూడా అలానే ఉంటుందని ఎలా చెప్పగలరు? వైయస్ వ్యవహార శైలి వేరు, జగన్ రాజకీయం వేరు. వైయస్ ముఖ్యమంత్రి అయ్యేనాటికి జాతీయ స్థాయిలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. కాబట్టి, ఉమ్మడి రాష్ట్రానికి ఇబ్బడిముబ్బడిగా నిధులు వచ్చిన పరిస్థితి. కానీ, ఇప్పుడున్న విభజిత ఆంధ్రాకి కేంద్రం నుంచి ప్రయోజనాలు సాధించాలంటే.. జాతీయ స్థాయిలో పోరాటం చేయగలిగే స్థాయి జగన్ లో కనిపించాలి. వైయస్ లెగసీ కొంతవరకూ జగన్ కి కలిసి రావొచ్చు. కానీ, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఇప్పుడు జగన్ ఏం చేయగలరు అనే విజన్ ని షర్మిలగానీ, విజయమ్మగానీ ప్రజల్లోకి తీసుకెళ్తే ఆలోచనాత్మకంగా ఉండేది. కేవలం వైయస్ సెంటిమెంట్ కోసమే ప్రచారం చేయడమంటే… అది ఎంతవరకూ వర్కౌట్ అవుతుందో చూడాలి.