రన్ రాజా రన్‌తో శర్వానంద్ కెరీర్ గ్రాఫ్ పూర్తిగా మరిపోయింది. హిట్లొచ్చాయి, సూపర్ హిట్లూ కొట్టాడు. బాక్సాఫీసు దగ్గర వసూళ్ల గలగలలు చూశాడు. పెద్ద హీరోలతో పోటీ పడి విజయాలు అందుకొన్నాడు. మధ్యలో ‘రాధ’ నిరాశ పరిచినా ‘మహానుభావుడు’తో తొందరగానే మేల్కొన్నాడు. ఈ దసరాకి విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు దగ్గర `హిట్` టాక్ తెచ్చేసుకొంది. ఈ సందర్భంగా శర్వానంద్‌తో తెలుగు 360 చేసిన చిట్ చాట్ ఇది.
హాయ్ శర్వా..
హాయ్…
సంక్రాంతి శతమానం భవతి, ఈ దసరాకి మహానుభావుడు.. పండగ సీజన్ బాగా వర్కవుట్ అయినట్టుంది..?
అటు శతమానం భవతి అయినా, ఇటు మహానుభావుడు అయినా ఫ్యామిలీ మొత్తం కలిసి చూసే సినిమాలే. పండక్కి జనాలు ఇలాంటి సినిమాల్నే కదా కోరుకొనేది.
ఎన్టీఆర్, మహేష్‌ల సినిమాలో పోటీ పడడం రిస్క్ అనిపించలేదా?
మేం ముందు నుంచీ ఈ సినిమాపై చాలా నమ్మకంతో ఉన్నాం. పైగా వాటితో పోలిస్తే చాలా డిఫరెంట్ జోనర్. పండక్కి ఎన్ని సినిమాలొచ్చినా జనం చూస్తారు. గత సంక్రాంతికి అది రుజువైంది కూడా. రోజుకో సినిమా చూసినా.. మా సినిమా చూడ్డానికీ ప్రేక్షకులు ఉంటారు. ఆ లెక్కతోనే ఈ సినిమాని విడుదల చేశాం. వాళ్లతో పోటీ అనుకొని కాదు.
తెరపై మీరు పోషించిన పాత్రకీ, నిజ జీవితంలో మీకూ ఏదైనా పోలిక ఉందా?
కొంచెం కూడా లేదండీ. నిజ జీవితంలో అలాంటి వ్యక్తిని మాత్రం చూశాం. అఫ్ కోర్స్… మీ అందరికీ ఇలాంటి అతి శుభ్రత వ్యక్తులూ పరిచయం అయ్యుంటారు.
ఈ సినిమాని భలే భలే మగాడివోయ్‌తో పోలుస్తున్నారు?
రెండూ వేర్వేరు కథలండీ. ఇలాంటి కాన్సెప్ట్ ఇప్పటి వరకూ రాలేదు. కథల్ని నడిపించిన విధానంలో కాస్తో కూస్తో ఆ లక్షణాలు కనిపించి ఉండొచ్చు. రెండు సినిమాలూ మారుతివే కదా?
యూవీ క్రియేషన్స్‌తో వరుసగా మూడో విజయం..
అలాంటి నిర్మాతలు దొరకడం నా అదృష్టం. భవిష్యత్తులోనూ యువీతో సినిమాలు చేయడానికి రెడీగా ఉన్నాను.
రన్ రాజా రన్ విషయంలో ట్రైల్ షూట్ చేశారని, మీరు ఆ పాత్రకు సరిపోకపోతే.. మరొకర్ని పెట్టుకోవాలని చూశారని గుసగుసలు వినిపించాయి..
నిజమే. మిర్చి లాంటి సూపర్ హిట్ తరవాత యువీ క్రియేషన్స్ నుంచి వచ్చిన సినిమా అది. నా స్నేహితుల విషయంలో నేను రిస్క్ తీసుకోదలచుకోలేదు. ముందు ట్రైల్ షూట్ చేద్దాం.. నచ్చకపోతే మరొకర్ని తీసుకోండి అని నేనే చెప్పా.
మహానుభావుడు ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ప్రభాస్ మిమ్మల్ని కాబోయే సూపర్ స్టార్ అన్నారు..
ది బెస్ట్ కాంప్లిమెంట్ అది. కాకపోతే.. ప్రభాస్అన్న మాటల్ని విని వదిలేయాలి.. తలకెక్కించుకోకూడదు. నా మంచి కోరే స్నేహితుడిగా నాలుగు మంచి మాటలు మాట్లాడాడు. సంతోషం.
ఈ సినిమాని ప్రభాస్ చూశారా?
లేదు. తను సాహో షూటింగ్లో బిజీగా ఉన్నాడు. కాకపోతే ఈ సినిమాఎలా వస్తోందన్నది తనకు తెలుస్తూనే ఉంది.
మారుతితో పనిచేయడం ఎలా అనిపించింది?
తనకు సెన్సాఫ్ హ్యూమర్ చాలా ఎక్కువ. సెట్లోనే చాలా సన్నివేశాల్ని ఇంప్రవైజేషన్ చేసేవారు. సగం డైలాగులు సెట్లోనే పుట్టాయి.
అర్జున్ రెడ్డి సినిమా ముందు మీ దగ్గరకే వచ్చిందని చెప్పుకొంటున్నారు నిజమేనా?
అవును. ఆ కథ నాకు బాగా నచ్చింది. కాకపోతే ఈ సినిమాని తానే నిర్మిస్తానన్నాడు సందీప్. నేను మాత్రం మంచి ప్రొడ్యూసర్ని వెదుక్కోమన్నా. అశ్వనీదత్, లగడపాటి శ్రీధర్ దగ్గరకు పంపించా. కానీ.. వర్కవుట్ అవ్వలేదు.
సందీప్ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తానంటే మీకు అభ్యంతరం ఏంటి?
నిర్మాతే దర్శకుడు అయితే కొన్ని ఇబ్బందులు ఉంటాయి. గతంలో నాకు కొన్ని చేదు అనుభవాలు ఎదురయ్యాయి. దర్శకుడికి నిర్మాతగా ఒత్తిడి ఎందుకన్నది నా వాదన.
మరి ఓ మంచి హిట్‌ని వదులుకొన్నారుగా..
అవును. కాకపోతే… ఈ సినిమాని నేను చేయడం కంటే విజయ్ చేయడమే బెటర్. తాను అద్భుతంగా నటించాడు. తన కోసమే ఆ పాత్ర పుట్టిందా అనిపించింది. ఈమధ్య కాలంలో నేను చూసిన బెస్ట్ పెర్‌ఫార్మ్సెన్స్ తనది.
సందీప్ రెడ్డితో సినిమా చేస్తారా?
తప్పకుండా. మా ఇద్దరికీ చేయాలనే ఉంది. ఎప్పుడు సెట్ అవుతుందో చూడాలి.