ఈమధ్యే ‘మనమే’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు శర్వానంద్. ఇప్పుడు తన చేతిలో 3 ప్రాజెక్టులు ఉన్నాయి. బైక్ రైడర్ నేపథ్యంలో ఓ సినిమా షూటింగ్ జరుగుతోంది. అభిలాష్ రెడ్డి దర్శకుడు. మాళవికా నాయర్ కథానాయిక. ఈ చిత్రానికి ‘రేస్ రాజా’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఓ సినిమా సంపత్ నందితో చేయాలి. మరో సినిమాకు ‘సామజవరగమన’ ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది.
‘సామజవరగమన’ తో మంచి పేరు తెచ్చుకొన్నారు రామ్ అబ్బరాజు. ప్రేమించుకొన్న అబ్బాయి – అమ్మాయి వరుసకు అన్నాచెళ్లెళ్లు అవ్వడం అనే ట్విస్టుతో సరదాగా సాగిపోయే ఎంటర్టైన్ సినిమా అది. బాక్సాఫీసు దగ్గర మంచి విజయాన్ని అందుకొంది. శర్వానంద్ కోసం కూడా అలాంటి లైటర్ వేన్ కథనే రాసుకొన్నాడని తెలుస్తోంది. అయితే ఈసారి దర్శకుడు విడాకులు అనే కాన్సెప్ట్ పై ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. విడాకులు, కోర్ట్ రూమ్ డ్రామా.. వీటి నేపథ్యంలో ఈ కథ నడుస్తుందని, ఫ్యామిలీ డ్రామా రక్తికడుతుందన్న నమ్మకంతో మేకర్స్ ఈ సినిమా తీస్తున్నారు. విడాకులు అనే పాయింట్ పాతదే. కానీ ఇప్పుడు దానికి ఓ కొత్త కాన్సెప్ట్ జోడించి ఈ కథ రాసుకొన్నాడట దర్శకుడు. ఆ పాయింట్ ఈ కథకు వన్నె తీసుకొస్తుందని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. సంయుక్త మీనన్, సాక్షి వైద్య కథానాయికలుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శర వేగంగా సాగుతోంది.