యువ దర్శకుల్లో సుధీర్ వర్మది టిపికల్ స్టయిల్. అతడిపై హాలీవుడ్ గ్యాంగ్‌స్టర్ సినిమాల ప్రభావం చాలా అంటే చాలా ఎక్కువ. టేకింగ్, మేకింగ్‌లలో అది స్పష్టంగా కనిపిస్తుంది. అతడి కామెడీ స్టయిలూ టిపికలే. అలాంటి సుధీర్ వర్మ దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా కమల్ హాసన్ ‘నాయకుడు’ తరహా డార్క్ టోన్ గ్యాంగ్‌స్టర్ టైప్ సిన్మా అనేసరికి ప్రేక్షకుల్లో అంచనాలు ఏర్పడ్డాయి. సదరు అంచనాలు ఆవిరైపోవడమే కాదు… ఒకానొక దశలో ఈ సినిమా వుంటుందా? లేదా? అనే అనుమానాలు ఏర్పడ్డాయి. ఎట్టకేలకు సుధీర్ వర్మ కథకు, సినిమాకు మోక్షం లభించింది. ఈ రోజు (గురువారం) విశాఖలో షూటింగ్ మొదలైంది. ఇందులో హీరోయిన్ కల్యాణీ ప్రియదర్శన్ పుట్టినరోజు కూడా ఈ రోజే కావడంతో యూనిట్ సభ్యులు షూటింగులో బర్త్ డే సెలెబ్రేట్ చేశారు.
ఒకప్పుడు హీరోగా ప్రయోగాలు, కొత్త తరహా సినిమాలు చేసిన శర్వానంద్‌కి ‘రన్ రాజా రన్’తో హిట్ వచ్చేసరికి ప్రతి సినిమాలోనూ కామెడీ కంపల్సరీ అన్నట్టు ఫీలయ్యాడు. సుధీర్ వర్మ సినిమా విషయంలోనూ అదే జరిగిందని టాక్. సీరియస్ మోడ్‌లో సినిమా వెళ్తుందనీ, కొంచెం కామెడీ యాడ్ చేయమనీ కోరినట్టూ… కథలో మార్పులు చెప్పినట్టూ… గుసగుసలు వినిపించాయి. చివరకు, ఏం జరిగిందో మరి? సినిమా విడుదలైన తరవాత తెలుస్తుంది. హను రాఘవపూడి దర్శకత్వంలో చేస్తున్న ‘పడి పడి లేచె మనసు’తో పాటు ఈ సినిమా షూటింగునూ శర్వానంద్ త్వరగా పూర్తి చేస్తాడని ఊహించవచ్చు.