బంగ్లాదేశ ప్రధాని షేక్ హసీనా ప్రజలు తిరుగుబాటు చేయడంతో పారిపోయారు. దీంతో సైన్యం పాలనను చేతుల్లోకి తీసుకున్నట్లుగా ప్రకటించింది. షేక్ హసీనా సైనిక హెలికాప్టర్ లో ఇండియాకు వచ్చేందుకు ప్రయత్నించారు. కానీ రాజకీయ ఆశ్రయం ఇవ్వడానికి భారత్ నిరాకరించడంతో ఆమె యూరప్ వెళ్లే అవకాశాలు ఉన్నట్లుగా చెబుతున్నారు. 2009 నుంచి షేక్ హసీనా ప్రధానిగా ఉన్నారు.
బంగ్లాదేశ్ లో కొద్ది రోజులుగా తీవ్ర స్థాయిలో అల్లర్లు జరుగుతున్నాయి. సివిల్ సర్వీసెస్ ఉద్యోగాలలో రిజర్వేషన్లను రద్దు చేయాలన్న డిమాండ్‌తో యువత రోడ్డెక్కింది. నిరసనలు క్రమంగా విస్తృత రూపం దాల్చుతూ ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమంగా మారాయి. ఇది విద్యార్థి ఉద్యమమే అయిప్పటికీ పాలనపై తీవ్ర అసహనంలో ఉన్న ప్రజలు ఇంత కన్నా మంచి అవకాశం రాదన్నట్లుగా రోడ్లపైకి వచ్చారు.
ఢాకాలో లాంగ్ మార్చ్ ను ఉద్యమకారులు ప్రకటించారు . దీంతో ప్రభుత్వం అణిచి వేత చర్యలు చేపట్టింది. ఆగస్టు 5 నుంచి మూడు రోజులపాటు అధికారిక సెలవులను ప్రకటించారు. కర్ఫ్యూ విధించారు. ఇంటర్నెట్ ఆపేశారు. అయినా ప్రయోజనం లేకపోయింది. ఉద్యమం వెల్లువలా వచ్చి పడింది. వారి ఉద్యమం తీవ్ర రూపం దాల్చడంతో ఆర్మీ కూడా ప్లేటు మార్చేసింది. విద్యార్థులకు మద్దతు తెలిపింది. ఈ సమయంలో ఆందోళన కారులు.. షేర్ హసీనా నివాసంలోకి చొచ్చుకెళ్లిపోయారు. దీంతో ఆమె పరారు కావాల్సి వచ్చింది.
గతంలో శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం వల్ల ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. దేశాధ్యక్షుడు పరారయ్యారు. తర్వాత ఆయన దేశానికి తిరిగి వెళ్లగలిగారు. షేక్ హసీనా వెళ్లగలుగుతారా లేదా అన్నది మాత్రం.. చెప్పలేని విషయం. షేక్ హసీనా బంగ్లాదేశ్ జాతిపిత ముజిబుర్ రెహ్మాన్ కుమార్తె. బంగ్లాదేశ్‌ను అత్యధిక కాలం పరిపాలించిన ప్రధాని కూడా.