ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ తీయడంలో మలయాళం వాళ్లు ఆరితేరిపోయారు. ఒకటా, రెండా..? యేడాది పొడవునా… అక్కడ్నుంచి ఈ తరహా కథలు వస్తూనే ఉంటాయి. దృశ్యం లాంటి సినిమాలు అందుకు మేటి ఉదాహరణలు. ఏ భాషలో తీసినా.. ఆ కథలు బాగా ఆడతాయి. ఎందుకంటే.. నేర పరిశోధన అనేది ఏ భాషకైనా నచ్చే జోనర్. థ్రిల్లర్స్ ని ఇష్టపడేవాళ్లు ప్రతీ చోటా ఉంటారు. కాబట్టి…ఇంత కంటే సేఫ్ జోనర్ మరోటి ఉండదు. అందుకే మలయాళంలో ఏ క్రైమ్ స్టోరీ వస్తుందా? అని అన్ని భాషల నుంచి దర్శకులు, హీరోలు ఎదురు చూస్తుంటారు. అలా అందరి దృష్టీ.. `జోసెఫ్`పై పడింది. 2018లో విడుదలైన సినిమా ఇది. అక్కడ మంచి ఫలితాన్ని రాబట్టింది. దాంతో అన్ని భాషల్లోనూ ఈ సినిమాని రీమేక్ చేస్తున్నారు. తెలుగులో `శేఖర్`గా రూపాంతరం చెందింది. థ్రిల్లర్ జోనర్ కావడం, ఆల్రెడీ హిట్టయిన కథని తీసుకురావడం, శేఖర్ గా రాజశేఖర్ గెటప్ కొత్తగా కనిపించడం, జీవిత దర్శకురాలు కావడం, పైపెచ్చు శివానీ ఓ పాత్రలో కనిపించడం… ఇలా అనేక విశేషాలు, విశేషణలు కలిగిన ఉన్న `శేఖర్` ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
శేఖర్ అనే రిటైర్డ్ కానిస్టేబుల్ జీవితంలో జరిగిన పరిణామాల సమాహారం… ఈ సినిమా. తన మాజీ భార్యని, కూతుర్ని వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో పోగొట్టుకుంటాడు శేఖర్. అయితే.. ఇవి రెండూ రోడ్డు ప్రమాదాలు కావని, దీని వెనుక ఓ భారీ స్కెచ్ ఉందని తెలుసుకుంటాడు. తీగ పట్టుకొని, డొంకలాగే ప్రయత్నంలో ఓ మెడికల్ మాఫియా గుట్టు రట్టు అవుతుంది. అదెలాగన్నదే శేఖర్ కథ.
సింపుల్‌గా ఈ కథని ఇలా రెండు ముక్కల్లో చెప్పేయొచ్చు. ఈ రెండు ముక్కల్లోనే థ్రిల్లర్ కి కావల్సినంత ముడిసరుకు ఉంది. కాకపోతే… ఈ కథని ఇలా కాకుండా వేర్వేరు దారుల్లో చెప్పుకొంటూ, తిప్పుకుంటూ వచ్చారు. శేఖర్‌కి ఓ మరదలు ఉండడం, ఆమెను ప్రేమించడం, తను ఇంకెవరినో పెళ్లి చేసుకుని వెళ్లిపోవడం, ఆ తరవాత హత్యకు గురవ్వడం.. ఇదంతా ఓ ఎపిసోడ్. అసలు కథనీ, ఈ ఉప కథకీ ఏమాత్రం సంబంధం ఉండదు. కథానాయకుడి జీవితంలో ఓ కల్లోలం జరగాలని, తద్వారా తన జీవితాన్ని చేచేతులా నాశనం చేసుకోవాలని… ఈ ఎపిసోడ్ ఇరికించి ఉంటారు. ఓ పాటకూ, నాలుగైదు సన్నివేశాలు పూరించుకోవడానికీ, పావు గంట స్క్రీన్ టైమ్ గడిపేయడానికి ఈ ట్రాక్ ఉపయోగపడింది తప్ప.. పెద్దగా ఒనగూరిన లాభాలేం లేవు. థ్రిల్లర్ కథల్ని ఎంత స్పీడుగా చెబితే అంతే ప్లస్సు. ఇలా లేనిపోని ట్రాకులు జోడించుకుంటూ వెళ్తే ఆ వేగం తగ్గుతుంది. అది సినిమా ఫలితంపై ప్రభావాన్ని చూపిస్తుంది. మలయాళంలోనూ ఇదే ట్రాకు ఉండడంతో.. దాన్ని తెలుగులోనూ చూపించాలన్న తపన తప్ప ఇంకేం కనిపించలేదు.
శేఖర్ విడాకుల వ్యవహారం కూడా అంతే. తన భార్య కేసుని ఛేధించడానికి హీరో రంగంలో దిగితే తప్పేంటి? మాజీ భార్య కావల్సిన అవసరం ఏమొచ్చింది? మలయాళంలో ఇలాంటి సింపతీ సీన్లు, ఎమోషనూ వర్కవుట్ అవుతుందేమో? అన్ని చోట్లా కాదు. తొలి సగంలో వచ్చిపడిపోయే పాటల వల్ల కథ టెంపో బాగా దెబ్బతింది. అసలు థ్రిల్లర్ సినిమాల్లో ఒకట్రెండు పాటలు పెట్టడమే కష్టం. ఆ విషయంలో చాలా ఆలోచిస్తారు. కానీ ఈ సినిమాలో ఏకంగా నాలుగైదు పాటలున్నాయి. శివానీని రాజశేఖర్ కూతురుగా చూపిస్తే ఎమోషన్ ఇంకా తొందరగా వర్కవుట్ అవుతుందేమో అనుకొన్నారు. కానీ ఆ ప్రయత్నం కూడా బెడిసికొట్టింది. కూతురు, భార్య…మరణం, వాళ్ల అంతిమ సంస్కారం.. ఇవి రెండూ వేర్వేరు ఘటనలు. వాటిని ఒకేసారి సమాంతరంగా చూపించడం వల్ల కన్ఫ్యూజన్ మొదలైంది. అసలు తెరపై ఏం జరుగుతోంది? ప్రస్తుతం జరిగేదేమిటి, ఫ్లాష్ బ్యాక్ ఏమిటి? అనే గందరగోళం కలుగుతుంది.
చివరి 20 నిమిషాలూ కథకు మూలం. అక్కడే అసలు ట్విస్ట్ రివీల్ అవుతుంది. అవన్నీ షాకింగ్ విషయాలే. జోసెఫ్ వర్కవుట్ అయ్యింది అక్కడే. కాకపోతే.. అంతకు ముందు సాగదీత వ్యవహారం, ఎమోషన్ లేకపోవడం, స్లో పేజ్… ఇవన్నీ శేఖర్ని బాగా ఇబ్బంది పెట్టాయి. ఆర్గాన్ డొనేషన్ అనేదాన్ని మెడికల్ మాఫియా ఎలా తప్పుదోవ పట్టిస్తుందో తెలుసుకోవడం షాకింగ్ అంశమే అయినా.. అప్పటి వరకూ ఉన్న ఓపిక నశించేసరికి.. అది కూడా మైండ్‌కి ఎక్కదు. పైగా చివరి సన్నివేశాల్లో వ్యవహారం అంతా సంభాషణల్లో పేర్చి చూపించడానికే ప్రయత్నించారు. దాంతో అసలు మెడికల్ మాఫియా ఎలా వ్యవహరిస్తుందో దృశ్య రూపంలో చెబితే బాగుండేది. ఓ సామాన్యుడు.. తన కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని ఎలా ప్రతిఘటించాడన్నది జోసెఫ్‌లో చూపించారు. దాన్ని ఇక్కడ కట్ పేస్ట్ చేశారు. కానీ.. జోసెఫ్‌లో ఉన్న ఎమోషన్ని పూర్తిగా కన్వే చేయలేకపోయారు. జోసెఫ్ వచ్చి నాలుగేళ్లయ్యింది. ఈ నాలుగేళ్లలో ప్రేక్షకుల ఆలోచనలు బాగా మారిపోయాయి. వాటిని కూడా అర్థం చేసుకొని మార్పులు చేర్పులూ చేసి ఉంటే బాగుండేది.
శేఖర్ గా రాజశేఖర్ గెటప్ బాగా సూటైంది. ఓ తండ్రిగా, భర్తగా తన ఆవేదనని చాలా సెటిల్డ్ గా చూపించారు. రెగ్యులర్ ఫైట్లు, మూస డైలాగుల జోలికి వెళ్లకపోవడం అభినందించ దగిన విషయం. ఇద్దరు హీరోయిన్లూ…గ్లామర్ విషయంలో తేలిపోయారు. ఓరకంగా చెప్పాలంటే రాజశేఖర్ కంటే ముదురుగా కనిపించారు. శివానీ కనిపించింది కాసేపే. మిగిలిన పాత్రలేవీ పెద్దగా గుర్తించుకోలేము. అనూప్ పాటలు ఓకే అనిపిస్తాయి. కానీ ఈ తరహా కథలకు పాటల్ని వీలైనంత వరకూ కత్తిరించుకోవాలి. అనూప్ థీమ్ మ్యూజిక్ బాగుంది. సాంకేతికంగా పెద్ద హంగులేం లేవు. మాతృకలోని సన్నివేశాల్ని, షాట్ డివిజన్ తో సహా.. ఫాలో అయిపోయారు జీవిత. కథనంలోనూ పెద్దగా మార్పులూ చేర్పులూ కనిపించలేదు.
చివరి 20 నిమిషాల ఎమోషన్ కోసమో, ట్విస్టు కోసమో థిటయర్కి వెళ్లి…రెండు గంటల పాటు శేఖర్ని భరించడం కష్టం. ఈ తరహా కథలు ఓటీటీలకు బాగా సూట్ అవుతాయి. అక్కడైతే.. ఈ స్లో ఫేజ్ పెద్ద సమస్య కూడా కాదు.