బహుశా రాహుల్‌గాంధీకి స్వంత పార్టీ నుంచి కూడా ఇంత గొప్ప కాంప్లిమెంట్ వచ్చి ఉంటుందా అనేది సందేహమే. అయితే ఈసారి ఆయనకు వచ్చిన కాంప్లిమెంట్ మాత్రమే కాదు అది ఇచ్చిన పార్టీ కూడా చాలా బలమైనదే. పైగా అది రాహుల్‌తో రోజువారీగా తగవులు పడే భాజాపా పార్టీకి మిత్ర పక్షం కూడాను.
మహారాష్ట్ర వేదికగా రాజకీయాలను శాసించే శివసేన… ప్రస్తుతం భాజాపాకు బలమైన మిత్రపక్షం, ఎన్డిఎలో ప్రధాన భాగస్వామి. అలాంటి పార్టీ కొన్ని రోజులుగా మోడీని విమర్శించడంలో నోటికి ట్వీటుకి బాగా కలిపిస్తున్న రాహు్ల్ గాంధీని ఒక్కసారిగా ఆకాశానికెత్తింది. రాహుల్ గాంధీకి దేశాన్ని పాలించే అన్ని అర్హతలూ ఉన్నాయని తేల్చి చెప్పింది. ఈ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు దేశానికి అవసరమైన నాయకత్వం అందించగలడని, ప్రస్తుతానికి మోడీ హవా మందగించిందని అభిప్రాయపడింది.
శివసేన నాయకుడు సంజయ్‌రౌత్ శుక్రవారం మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. మహారాష్ట్రతో సహా భాజాపాకు గత కొంతకాలంగా దేశంలోని బలమైన మిత్రపక్షాల్లో ఒకటిగా కొనసాగుతున్న శివసేన… భాజాపా పార్టీకి, మోడీకి వ్యతిరేకంగా విమర్శలు గుప్పించడం మరీ కొత్తేమీ కాదు. ముఖ్యంగా నోట్ల రద్దు వంటి విషయాల్లో విపక్షాలతో పోటీపడి మరీ శివసేన భాజాపా, మోడీలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే శుక్రవారమే తొలిసారిగా ఈ విమర్శల పర్వం కొత్త రూట్ తీసుకుంది. కేవలం భాజాపాను విమర్శించడంతో ఊరుకోకుండా రాహుల్ గాంధీని ప్రశంసించడం ద్వారా తమ రెండు పార్టీల భవిష్యత్తు మిత్ర బంధాన్ని పూర్తిగా ప్రశ్నార్ధకం చేసింది శివసేన పార్టీ.