రాజధాని గ్రామాలలో రైతుల నుండి ప్రభుత్వం బలవంతంగా భూసేకరణ చేయడాన్ని నిరసిస్తూ వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ఈరోజు విజయవాడలో వైకాపా ధర్నా చేసింది. ఏపికి ప్రత్యేక హోదా సాధించేందుకు పోరాడుతున్న నటుడు శివాజీ దానిపై స్పందిస్తూ, ఆంద్రప్రదేశ్ రాష్ట్రం చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డిల ఆదిపత్య పోరులో నలిగిపోతోంది. వైకాపా చేస్తున్నవి పెయిడ్ ఆందోళనలే! జగన్ కి వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసమే ఇటువంటి హడావుడి చేస్తుంటారు. ప్రత్యేక హోదా గురించి ఆయన ఇక్కడ చాలా గట్టిగానే మాట్లాడుతారు. కానీ ప్రధాని నరేంద్ర మోడీ ఎదుట నిలబడి అలాగా గట్టిగా నిలదీసి అడిగితే ఏమయినా ప్రయోజనం ఉంటుంది. దీని గురించి వైకాపా ఎంపీలు పార్లమెంటులో గట్టిగా ఎందుకు మాట్లాడటం లేదు?” అని ప్రశ్నించారు శివాజీ.
జగన్మోహన్ రెడ్డి చేసే ఆందోళనలు, ధర్నాలు, దీక్షల వెనుక ఆయన ఆంతర్యం, ఉద్దేశ్యాలేవయినప్పటికీ ప్రభుత్వం త్రప్పు దారిలో నడుస్తున్నప్పుడు దానిని పునరాలోచించుకొనేలా చేయడానికి అవి ఉపకరిస్తాయి. రైతుల అభీష్టానికి వ్యతిరేకంగా ఏడాదికి మూడు పంటలు పండే అత్యంత సారవంతమయిన పంట భూములను భూసేకరణ చట్టం ప్రయోగించి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలనుకొంటున్నప్పుడు జగన్ నిరసన తెలియజేయడం తప్పు కాదు. కానీ నిజాయితీగా కాకుండా ఏదో మొక్కుబడిగా చేయడం వలననే ఇటువంటి విమర్శలు వినిపిస్తుంటాయి.
మూడు రోజుల క్రిందట పవన్ కళ్యాణ్ కూడా అదే పని చేసారు. ఆయన కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పని తప్పని దానిని తాను వ్యతిరేకిస్తున్నానని చాలా ఖరాఖండీగా చెప్పారు. తరువాత మళ్ళీ ఈ విషయం గురించి మాట్లాడలేదు. దీని గురించి ముఖ్యమంత్రితో మాట్లాడుతానని అన్నారు. కానీ ఇంతవరకు మాట్లాడినట్లు లేదు. మాట్లాడుతారో లేదో కూడా తెలియదు. మొన్న పవన్ కళ్యాణ్ వచ్చి భరోసా ఇచ్చి వెళ్లి పోయారు. ఈరోజు జగన్ వచ్చి ధర్నా చేసి వెళ్ళిపోయారు. బహుశః రేపో మాపో కాంగ్రెస్ పార్టీ కూడా వచ్చి హడావుడి చేసి వెళ్లిపోవచ్చును. కానీ రైతుల సమస్య మాత్రం అలాగే ఉంది. ఈలోగా రాష్ట్ర ప్రభుత్వం వారి భూములు బలవంతంగా స్వాధీనం చేసుకొన్నా ఆశ్చర్యం లేదు.