వరదతో చీప్ పాలిటిక్స్ చేస్తోన్న జగన్ అండ్ కో వైఎస్ షర్మిలను చూసి నేర్చుకోవాలన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ కష్టకాలంలో రాజకీయ విమర్శలు చేయడం వలన జరిగే లాభం కన్నా నష్టమే ఎక్కువగా ఉంటుంది అనే అంచనాతో షర్మిల వరదల విషయంలో విమర్శలు చేయడం లేదని, పైగా సర్కార్ సహాయక చర్యలపై బాధితులు సంతృప్తిగా ఉన్న వేళ రాజకీయానికి ప్రాధాన్యత ఇస్తే ఇబ్బంది అవుతుంది అనే వ్యూహంతో షర్మిల సైలెంట్ గా ఉన్నారు అనే టాక్ నడుస్తోంది.
జగన్ తో పోలిస్తే షర్మిల రాజకీయ అనుభవం తక్కువ. అయినా, ఇలాంటి సమయంలో ఎలా వ్యవహరించాలో షర్మిల చూపిస్తుంటే…జగన్ మాత్రం ఎలా వ్యవహరించకూడదో అలాగే వ్యవహరిస్తున్నారు అన్న అభిప్రాయం వినిపిస్తోంది. వరద రాజకీయంతో పార్టీకి మైలేజ్ తీసుకురావాలనుకున్న జగన్ ప్రయత్నాలు వికటించడమే కాకుండా వేలెత్తి చూపేలా ఉన్నాయి.
వరదలతో బురద రాజకీయం చేయాలని భావించిన వైసీపీకి బాధితుల నుంచి ఊహించని విధంగా ప్రతిఘటన ఎదురైంది. కష్టకాలంలో రాకుండా ఆలస్యంగా వచ్చి ప్రభుత్వంపై బురద జల్లుతారా అంటూ జగన్ అండ్ కో ను నిలదీశారు. ఈ విధమైన సీన్ చూశాక కూడా వరద రాజకీయం చేయడం భూమ్ రాంగ్ అవుతుందని అనుకున్నారో ఏమో షర్మిల తో సహా కాంగ్రెస్ నేతలు వరద సహాయక చర్యలపై విమర్శలు చేయడం లేదు..కానీ వైసీపీ నేతలు మాత్రం అదే పనిగా విమర్శల దాడి ఎక్కు పెట్టడంతో…షర్మిలను చూసి నేర్చుకోండి అంటూ హితవు పలుకుతున్నా రు.