వెంకటేష్ – శ్రియ కాంబినేషన్లో రెండు చిత్రాలు వచ్చాయి. అప్పుడెప్పుడో 2005లో రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ‘సుభాష్ చంద్రబోస్’ మొదటి చిత్రం. తరవాత పదేళ్లకు ‘గోపాల గోపాల’లో మళ్లీ జంటగా నటించారు. మధ్యలో వెంకటేష్ ‘తులసి’లో శ్రియ ప్రత్యేక గీతంలో సందడి చేశారు. అది పక్కన పెడితే.. ముచ్చటగా వీరిద్దరూ మూడోసారి జంటగా నటించనున్నారని టాక్.
వెంకటేష్, నాగచైతన్య హీరోలుగా నటిస్తున్న సినిమా ‘వెంకీ మామ’. ఇందులో నాగచైతన్యకు జోడిగా రకుల్ ఎంపికైంది. వెంకీకి జోడీగా హిందీ నటి హ్యూమా ఖురేషితో పాటు పలువురి పేర్లు వినిపించాయి. అయితే.. ఆఖరికి శ్రియ దగ్గర కథానాయిక అన్వేషణ ఆపేశారట. బాబీ అలియాస్ కె.ఎస్. రవీంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి నెలాఖరు నుంచి సెట్స్ మీదకు వెళ్లనుంది.
వెంకీ-శ్రియ కాంబినేషన్లో ఈపాటికి మూడో చిత్రం వచ్చేది. తేజ దర్శకత్వంలో ఈ ఇద్దరూ జంటగా ప్రారంభమైన చిత్రం మధ్యలో ఆగడంతో రాలేదు. బాబీ చిత్రంతో ఆ కాంబినేషన్ మళ్లీ కుదిరింది. తేజ చిత్రం కోసం శ్రియకు ఇచ్చిన అడ్వాన్స్ వుండటంతో, దాన్ని ఈ చిత్రానికి మళ్లించారట.