హిందీ డబ్బింగ్ మార్కెట్ రూపంలో… టాలీవుడ్ కోట్లు కుమ్మరించుకుంటోంది. మినిమం హీరోల సినిమాలకు రెండు, మూడు కోట్లు వచ్చిపడిపోతున్నాయి. ఓ రేంజ్ ఉన్న హీరోలకైతే చెప్పాల్సిన పనిలేదు. సినిమా సినిమాకీ, వాళ్ల హిందీ మార్కెట్ పెరుగుతూనే ఉంది. తాజాగా నాని తన హిందీ డబ్బింగ్ మార్కెట్ ని అనూహ్యంగా పెంచుకున్నాడు. శ్యాం సింగరాయ్ తో. డిసెంబరు 24న ఈ సినిమా విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లోనూ ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఆ రెండు చోట్ల ఈ సినిమాకి మంచి బిజినెస్ జరిగింది. ఇప్పుడు హిందీ డబ్బింగ్ రూపంలోనూ మంచి రేటొచ్చింది. ఈసినిమాని B4U ఛానల్ రూ.10 కోట్లకు కొనేసింది. ఇది నిజంగా మంచి బేరమే. కాస్త ఫైట్లు,యాక్షనూ, ఛేజింగులూ ఉంటే చాలు… హిందీ డబ్బింగ్ కి ద్వారాలు తెరచుకున్నట్టే. ఇటీవల `శ్యాం సింగరాయ్` టీజర్ విడుదలైంది. అందులో యాక్షన్ మోతాదు బాగానే కనిపించింది. టీజర్ కూడా ప్రామిసింగ్ గా ఉండడంతో.. హిందీ డబ్బింగ్ కి రెక్కలొచ్చాయి. రాహుల్ సంకృత్యయిన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సాయి పల్లవి, కృతి శెట్టి కథానాయికలుగా నటించారు.