Shyam Singha Roy Telugu Review
రేటింగ్: 3.5/5
నాని హిట్లు కొట్టొచ్చు. కొట్టకపోవొచ్చు. కానీ కథల విషయంలో ఎప్పుడూ తప్పు చేయడు. కొన్నిసార్లు మంచి కథల్ని సైతం.. సరిగా చెప్పకపోవడం వల్ల నాని విఫలమయ్యాడు కానీ, నిజానికి కథల విషయంలో తన జడ్జిమెంట్ బాగుంటుంది. వి, టక్ జగదీష్ లాంటి పరాజయాల తరవాత.. నాని కథల ఎంపికపై కొన్ని అనుమానాలు మొదలయ్యాయి. వాటిని నివృత్తి చేయాలంటే ఓ విజయం తప్పనిసరి. అలాంటి పరిస్థితుల్లో `శ్యామ్ సింగరాయ్` వచ్చింది. మరి ఈసారి నాని ఏం చేశాడు? శ్యామ్ సింగరాయ్ నానిపై ఉన్న నమ్మకాన్ని, నాని ఈ కథపై పెట్టుకున్న నమ్మకాన్ని ఎంత వరకూ నిలబెట్టింది?
వాసు (నాని) కి సినిమా అంటే పిచ్చి. దర్శకుడు కావాలన్నది తన కల. ఓ షార్ట్ ఫిల్మ్ తీసి, దాన్ని ఓ నిర్మాతకు చూపించి, సినిమా ఛాన్స్ పట్టేయాలని ప్రయత్నిస్తుంటాడు. ఆ ప్రయత్నంలోనే… కీర్తి (కృతి శెట్టి)ని కలుస్తాడు. తన షార్ట్ ఫిల్మ్‌లో నటించాలని అడుగుతాడు.కీర్తి కూడా ఒప్పుకుంటుంది. షార్ట్ ఫిల్మ్ తయారవుతుంది. ఆ షార్ట్ ఫిల్మ్ నిర్మాతకు నచ్చుతుంది. అలా.. `ఉనికి` అనే సినిమా బయటకు వస్తుంది. ఆ సినిమా విడుదలై, సూపర్ హిట్ అవుతుంది. దాంతో బాలీవుడ్ లో రీమేక్ చేయడానికి ఓ అగ్ర నిర్మాణ సంస్థ ముందుకొస్తుంది. వాసు కెరీర్ సెటిల్ అయిపోయిందనుకుంటున్న తరుణంలో.. ఓ ట్విస్ట్. `ఉనికి` కాపీ కథ అని తేలుతుంది. ఎప్పుడో బెంగాల్ లో శ్యామ్ సింగరాయ్ రాసుకున్న కథని ఇప్పుడు వాసు కాపీ చేశాడన్నది అభియోగం. దాంతో వాసుని పోలీసులు అరెస్ట్ చేస్తారు. అప్పటి శ్యామ్ సింగరాయ్ కీ, ఇప్పటి వాసుకీ ఉన్న సంబంధం ఏమిటి? 1969లో కొలకొత్తాలో ఏం జరిగింది? అనేది మిగిలిన కథ.
ఇదో పునర్జన్మల కథ. శ్యామ్ సింగరాయ్.. వాసుగా పుట్టడమే ఇతివృత్తం. పునర్జన్మల నేపథ్యంలో చాలా కథలొచ్చాయి. ఆ లెక్కన చూస్తే నేపథ్యం విషయంలో కొత్తగా ఏం లేనట్టే. కానీ… దానికి సినిమా, బెంగాల్, దేవదాసీ అనే పొరలు వేసుకోవడం వల్ల శ్యామ్ సింగరాయ్ కి కొత్త లుక్ వచ్చింది. వాసు షార్ట్ ఫిల్మ్ మేకింగ్ తో సినిమా మొదలవుతుంది. తను హీరోయిన్ వేట మొదలెట్టడం కీర్తి పరిచయం అవ్వడం… సినిమా ఇలా స్లో ఫేజ్‌లో సాగుతుంది. అక్కడక్కడ నాని స్టైల్ ఆఫ్ క్లాస్ కామెడీ సన్నివేశాల్ని నడిపిస్తూ ఉంటాయి. `రోసీ…` అంటూ కలవరింతలు మొదలైన దగ్గర్నుంచి కథలో పునఃర్జన్మల కాన్సెప్ట్ కథలోకి వస్తుంది. కాపీ రైట్ చట్టం ప్రకారం.. వాసు అరెస్ట్ అవ్వడంతో… రసపట్టులో పడుతుంది. శ్యామ్ సింగరాయ్ ఎవరు? తను వాసు కథలోకి ఎలా వచ్చాడు? అనేది తెలుసుకోవవడం సెకండాఫ్ కి టేకాఫ్.
ద్వితీయార్థం పూర్తిగా బెంగాల్ నేపథ్యంలో సాగుతుంది. అక్కడ మరో కథ. శ్యామ్ సింగరాయ్ (నాని) రచయిత. తన రచనలతో.. అభ్యుదయ భావాల్ని పరిచయం చేసి, ప్రజల్నిచైతన్య పరచడం శ్యామ్ సింగరాయ్ వృత్తి. ప్రవుర్తి. దేవదాసి మైత్రీ (సాయి పల్లవి)ని చూసి ఇష్టపడతాడు. తనని ఆ చెర నుంచి విముక్తురాల్ని చేయడానికి తహతహలాడతాడు. దేవదాసి వ్యవస్థపై తిరుగుబాటు చేసి, చాలామంది అమ్మాయిల్ని కాపాడతాడు. కొలకొత్తా వచ్చి.. మైత్రీతో స్థిరపడతాడు. ఆ గమనమంతా సెకండాఫ్‌లో సాగుతుంది. దేవదాసి వ్యవస్థ గురించి, సంఘ ప్రక్షాళన గురించి ఎక్కువ మాట్లాడితే, అది డాక్యుమెంటరీ ఫీలింగ్ తీసుకొస్తుంది. అలాగని సుతిమెత్తగా టచ్ చేసినా కుదరదు. ఎంత కావాలో అంతే చెబుతూ, ఎమోషనల్ గా కనెక్ట్ చేస్తూ వెళ్లాడు దర్శకుడు. నాని -సాయి పల్లవి లాంటి నటీనటులు దొరకడం, టెక్నికల్ గా స్ట్రాంగ్ టీమ్ ని ఎంచుకోవడం చాలా కలిసొచ్చింది. భావోద్వేగ భరితమైన సన్నివేశాలు, సంభాషణలు ఈ సినిమాలో చాలా కనిపిస్తాయి. ముఖ్యంగా క్లైమాక్స్ నచ్చుతుంది. రెండు కథల్నీ దర్శకుడు ఎందుకు లింక్ చేశాడు? శ్యాం సింగరాయ్ తిరిగి రావడానికి కారణమేంటి? అనే విషయాల్ని ఉద్వేగభరితంగా చూపించాడు,.
నాని తన సహజసిద్ధమైన నటనతో మరోసారి ఆకట్టుకున్నాడు. వాసుదేవ్ లాంటి పాత్రల్లో నానిని ఇది వరకు చాలా సార్లు చూశాం. శ్యామ్ సింగరాయ్ గా మాత్రం కొత్తగా కనిపించాడు. నిజానికి అది చాలా బరువైన పాత్ర. దాన్ని నాని మోయగలడా? అని ఇది వరకు కొన్ని అనుమానాలు వచ్చాయి. వాటిని పటాపంచలు చేసేశాడు నాని. నడక, మాట తీరు.. వీటితో గాంభీర్యం తీసుకొచ్చాడు. శ్యామ్ పాత్ర తన కెరీర్లో బెస్ట్ గా నిలిచిపోతుంది. సాయి పల్లవి.. వల్ల మైత్రీ పాత్రకో స్థాయి వచ్చింది. తన అభినయం మరో ప్లస్ పాయింట్. క్లైమాక్స్ లో మాత్రం మేకప్ అంతగా నప్పలేదు. కృతి శెట్టి చాలా అందంగా కనిపించింది. బేబమ్మతో పోలిస్తే… చాలా వైవిధ్యం ఉన్న పాత్ర.
సాంకేతికంగా బలంగా ఉన్న సినిమా ఇది. మిక్కీ పాటలు ఎప్పుడొచ్చాయో తెలీదు. కథలో అంతగా లీనమైపోయాయి. ఎడిటింగ్ కూడా షార్ప్ గా ఉంది. కథలో లాజిక్స్ ని సరిగానే వేసుకున్నాడు దర్శకుడు. సంభాషణలు కూడా తగిన స్థాయిలోనే ఉన్నాయి. మరీ ఓవర్ డ్రమెటిక్ గా అనిపించలేదు. సెట్ వర్క్ తప్పకుండా నచ్చుతుంది. ఆ కాలంలోకి ప్రేక్షకుల్ని తీసుకెళ్లిపోయారు. పెద్ద కాన్వాస్ ఉన్న కథ ఇది. దాన్ని రాహుల్ సంకృత్యాన్ చాలా బాగా డీల్ చేశాడు. కన్ఫ్యూజన్కి ఎక్కువ ఆస్కారం ఉన్నా సరే, తాను గందరగోళ పడకుండా, ప్రేక్షకుల్ని కన్ఫ్యూజ్ చేయకుండా చెప్పాలనుకున్న కథని క్లియర్ గా చెప్పేశాడు.
పునర్జన్మల కథలెన్ని వచ్చినా, అందులో మంచి కమర్షియల్ పాయింట్ ఉంటుందన్న విషయాన్ని శ్యామ్ సింగరాయ్ నిరూపించింది. నానిలోని నటుడ్ని మరో కోణంలో ఎలివేట్ చేసిన సినిమా ఇది. ప్రొడక్షన్ వాల్యూస్కీ, దర్శకుడి అభిరుచికీ అద్దం పట్టిన చిత్రమిది.
ఫినిషింగ్ టచ్: సింగ్ ఈజ్ కింగ్
రేటింగ్: 3.5/5