మహా సముద్రంపై అప్పట్లో చాలా అంచనాలు ఏర్పడ్డాయి. ఆర్.ఎక్స్ 100 తరవాత అజయ్ భూపతి చేసిన సినిమా అది. శర్వానంద్ హీరో. విలన్‌గా సిద్దార్థ్ నటించాడు. కాస్టింగ్ బాగా కుదిరింది. దాంతో.. ఆశలు పెరిగాయి. ప్రీ రిలీజ్ ఫంక్షన్లో సిద్దూ మాటలు చూస్తే – మహా సముద్రం చరిత్ర తిరగ రాస్తుందని అనిపించింది. అంత కాన్ఫిడెన్స్ చూపించాడు ఆ సినిమాపై. తీరా చూస్తే సినిమా డిజాస్టర్‌గా మిగిలిపోయింది. చాలా రోజుల తరవాత ఈ ఫ్లాప్ పై సిద్దార్థ్ నోరు విప్పాడు.
మహా సముద్రం ఇప్పటికీ తన ఫేవరెట్ ఫిల్మ్ అని, కానీ కొన్ని కారణాల వల్ల జనం ఆదరించలేదని, స్నేహితుడి ప్రేయసిని హీరో పెళ్లి చేసుకోవడం ప్రేక్షకులకు నచ్చలేదని, అందుకే తిరస్కరించారని కాస్త లేట్‌గా అయినా, కరెక్ట్ రివ్యూనే ఇచ్చాడు సిద్దూ. ”మహాసముద్రం సినిమా నాకు వ్యక్తిగతంగా చాలా ఇష్టం. ఆ సినిమాకి వంద మంది పని చేస్తే వందమందీ సూపర్ హిట్టని బలంగా నమ్మారు. కానీ ఫలితం రాలేదు. అంత మాత్రాన అది తప్పుడు సినిమా కాదు. ఇప్పటికీ అజయ్ భూపతితో పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. తను గొప్ప టెక్నీషియన్. ఆర్.ఎక్స్ 100కి మించిన సినిమాలు తన నుంచి చాలా వస్తాయి..” అంటూ తన దర్శకుడ్ని వెనకేసుకొని వచ్చాడు.
”కొంతమంది ‘ఇంకో పది ఏళ్ల తరవాత రావాల్సిన సినిమా ఇది.. ముందే తీసేశారు..’ అని చెబుతుంటారు. అలాంటి మాటల్ని నేను నమ్మను. ఇప్పుడు – ఈ టైమ్‌లో ప్రేక్షకులకు నచ్చిందా? లేదా? అనేది ముఖ్యం. నా ‘చుక్కల్లో చంద్రుడు’ సినిమా ఫ్లాప్ అయ్యింది. కానీ కొంతమందికి అది ఫేవరెట్ సినిమా. పదేళ్ల తరవాత తీయాల్సింది అంటుంటారు. అలాంటి మాటలు వింటుంటే నవ్వాలో, ఏడ్వాలో అర్థం కాదు అని చెప్పుకొచ్చాడు సిద్దూ. తను హీరోగా నటించిన ‘టక్కర్’ ఈ వారమే ప్రేక్షకుల ముందుకు వస్తోంది.