తెలుగులో ఫ్రాంచైజీలు చాలా తక్కువ. మనీ, మనీ – మనీ, ఎఫ్ 2, ఎఫ్ 3.. ఇలా కొన్ని ప్రయత్నాలు జరిగాయి. అయితే ఇప్పుడు డిజే టిల్లు ఫ్రాంఛైజీ ని కొనసాగించే అవకాశాలు ఉన్నాయట. ఈ విషయాన్ని హీరో.. సిద్దు జొన్నలగడ్డ బయటపెట్టాడు.
“డీజే టిల్లు చాలా బాగా వచ్చింది. సీక్వెల్ కి అవసరమైనంత సరుకు ఈ కథలో ఉంది. డీజే 2 కూడా ప్లాన్ చేస్తున్నాం. దీన్నో ఫ్రాంచైజీ గా కొనసాగిస్తే బాగుంటుందనుకుంటున్నాం. చూద్దాం.. డీజే టిల్లు హిట్టయితే ఆటోమెటిగ్గా.. అన్నీ జరిగిపోతాయి“ అని చెప్పుకొచ్చాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని రూపొందించిన సంగతి తెలిసిందే. ఈనెల 12న విడుదల అవుతోంది. ఈ సినిమా అవుట్ పుట్ చూసి త్రివిక్రమ్ కూడా సంతృప్తిని వ్యక్తం చేశారట. ”సినిమా హిట్టు.. పక్కా. ఏ రేంజ్ అవుతుందో చూడాలి..” అని చెప్పాడట. దాంతో.. చిత్రబృందం ఫుల్ హ్యాపీ మూడ్ లోకి వెళ్లిపోయింది.
నిజానికి ఈ సినిమా టైటిల్ డీజే టిల్లు కాదు. ‘నరుడి బతుకు నటన’. చివరికి `డీజే టిల్లు`గా మార్చారు. ఈ విషయమై.. సిద్దూ మాట్లాడుతూ “మా సినిమా గురించి ఎవరు ఎప్పుడు అడిగినా… `టిల్లు ఎప్పుడు.. టిల్లు ఎప్పుడు` అనే అనేవారు. `నరుడి బతుకు…`అని పలికే లోపు సగం మంది.. అక్కడ్నుంచి వెళ్లిపోతారు. అలా వుంది ఆ టైటిల్. అందుకే చివరి క్షణాల్లో డీజే టిల్లుగా మార్చాం. టైటిల్ మార్చడం కూడా చాలా కలిసొచ్చింది“ అన్నాడు. ఈ చిత్రానికి కథ, మాటలు కూడా సిద్దూనే సమకూర్చాడు.
పుట్టు మచ్చల ప్రశ్న.. మళ్లీ స్పందించిన హీరో
డీజే టిల్లు అనగానే.. ఎందుకో అందరి చర్చా `పుట్టుమచ్చల` ప్రశ్నపైనే పోతోంది. సురేష్ కొండేటి అనే ఓ జర్నలిస్టు… మీడియా ముఖంగా “సినిమాలో హీరోయిన్ చేత 16 పుట్టుమచ్చలున్నాయని చెప్పించారు కదా, మరి రియల్ గా ఆ హీరోయిన్ కు ఒంటిపై ఎన్ని పుట్టుమచ్చలున్నాయో తెలుసుకున్నారా?“ అంటూ అభ్యంతరకరమైన ప్రశ్న వేయడంతో.. స్టేజీపై వాళ్లంతా స్టన్ అయ్యారు. హీరో ఈ ప్రశ్నని అవాయిడ్ చేస్తూ తప్పుకున్నా, సోషల్ మీడియాలో ఈ ఉదంతంపై చాలా పెద్ద చర్చ నడిచింది. సురేష్ కొండేటిని దారుణంగా ట్రోల్ చేశారు. సదరు హీరోయిన్ సోషల్ మీడియాలో తన బాధని పంచుకుంది. హీరో కూడా ఓ ట్వీట్ చేశాడు. చివరికి సురేష్ కొండేటి సారీ చెప్పడంతో… ఈ వ్యవహారం కాస్త సద్దుమణిగింది.
ఇప్పుడు మరోసారి ఈ పుట్టుమచ్చట ప్రశ్న చర్చల్లోకి వచ్చింది. డీజే టిల్లు ఇంటర్వ్యూలలో భాగంగా.. ఈ ప్రశ్నపై అప్పుడు మీరు స్పందించకపోవడం తప్పే కదా..? అవాయిడ్ చేయకుండా ఉండాల్సింది కదా..“ అని జర్నలిస్టులు మళ్లీ ప్రశ్న సంధించారు. “అవును. చాలామంది మిత్రులు నన్ను ఇదే అడిగారు. అప్పుడు నువ్వు రెస్పాండ్ అవ్వాల్సింది కదా.. అన్నారు. నేను ఆ ప్రశ్నని అవాయిడ్ చేశాను. అప్పటికి నా స్పందన అది. ఆ తరవాత నేను ట్విట్టర్లో నా అభిప్రాయాన్ని చెప్పాను. నిజానికి ఆ జర్నలిస్టు కూడా కావాలని ఆ ప్రశ్న అడిగి ఉండరు. అక్కడంతా సరదా వాతావరణం సాగుతుంది. కాబట్టి.. అలాంటి ప్రశ్న అడిగి ఉంటారు. తప్పులు అందరూ చేస్తారు. నేనూ చేస్తా. అలాగని ఈ వివాదాన్ని పట్టుకునే మాట్లాడుతూ కూర్చోకూడదు. డీజే టిల్లు అంటే ఇంకా చాలా ఉన్నాయి. మా కథ గురించి, టిల్లు గురించి, పాటల గురించి మాట్లాడుకోవాలి. ఇలాంటి విషయాల గురించి కాదు“ అని చెప్పుకొచ్చాడు.