తెలుగు అమ్మాయి పి.వి. సింధు ఒలింపిక్స్‌లో మెడల్ గెలిచిన వెంటనే ఆ అమ్మాయి కులం ఏంటో తెలుసుకోవడానికి తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు కొందరు గూగుల్ లో సెర్చ్ చేసి ప్రయత్నించారు. ఈ విషయం జాతీయ వార్తల్లో రాగానే..మీడియావాళ్ళు,నాయకులు ప్రజలకు సుద్దులు చెప్పడానికి బయల్దేరారు. కులం నీచం, కులం దుర్మార్గం, కులం కోసం సెర్చ్ చేసిన వాళ్ళందరూ అప్రాచ్యపు వెధవలు అనే స్థాయిలో విమర్శలు చేస్తూ రెచ్చిపోతున్నారు. అసలు ఈ కులాల కుంపటి రగిలించిందే తాము అన్న విషయాన్ని మాత్రం ఇరువురూ కూడా చాలా కన్వీనియంట్‌గా మర్చిపోతున్నారు. కుల సంఘాల మీటింగ్స్‌కి మీడియా ఇచ్చే కవరేజ్ మామూలుగా ఉండదు.ఎన్నికలు వచ్చినప్పుడల్లా తాము సపోర్ట్ చేసే పార్టీకి ఆ కులాల వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. ఈ కులాల వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు అంటూ కులాల ఈక్వేషన్స్‌ని జనాలెవ్వరూ మర్చిపోకుండా చేస్తూ ఉంటారు. నియోజకవర్గ ప్రజలకు కూడా ‘ఈ క్యాండిడేట్ మీ కులపోడే’ అన్న విషయాన్ని బాగా గుర్తుండిపోయేలా చేస్తారు. మైనారిటీలు, దళితులు, బిసిలు, రెడ్డి, నాయుడు,వెలమ…ఇలా మతాలు, కులాల పేర్లు లేకుండా ఒక్క రోజు అయినా న్యూస్ ఉంటుందా? అత్యాచారం లాంటి దుర్ఘటనలు జరిగినప్పుడు కూడా కులం పేరును బయటికి తీస్తారు. గతంలో మీడియాకు కొన్ని విలువలు ఉండేవి, ప్రింట్ మీడియా ఒక్కటే ఉన్నప్పుడు సామాజిక వర్గం పేర్లను డైరెక్టుగా రాసేవాళ్ళు కాదు. నిజమైన జర్నలిస్టులు తగ్గిపోయాక, టివి మీడియా పాపులర్ అయ్యాక అలాంటి విలువలన్నింటికీ తిలోదకాలిచ్చేశారు.డైరెక్టుగా లైవ్ ఇంటర్వ్యూలలోనే కులాల గురించి ప్రస్తావిస్తున్నారు. కులం పేరు బాగా హైలైట్ చేస్తే ప్రత్యర్థి పార్టీకో, అభ్యర్థికో నష్టం జరుగుతుందనుకుంటే వాంటెడ్‌గా తోకలు తగిలించే నీచ స్థాయికి కూడా ఎప్పుడో దిగజారింది మన తెలుగు మీడియా.
ఇక రాజకీయ నాయకులది మరీ ముఖ్య పాత్ర. అభివృద్ధి గురించి చెప్పుకునే అవకాశం ఎలాగూ లేదు కాబట్టి కులాల గురించి చెప్పుకుంటూ బ్రతికేస్తూ ఉంటారు. కులాల ప్రాతిపదికన రిజర్వేషన్స్ తీసుకొచ్చింది కూడా అందుకే. ఏ కులం నాయకుడ్ని ఆ కులం వాళ్ళతోనే తిట్టించడం, కుల జనాభా ఆధారంగా టిక్కెట్స్ ఇవ్వడం లాంటివి చాలా కామన్‌గా చేస్తూ ఉంటారు. కుల సంఘాల సభలకు వెళ్ళడం…ఆ కుల పెద్దను నేనే అని కబుర్లు చెప్పడం లాంటివి చాలా గొప్ప పనులు అన్నట్టుగా ఫీలయిపోయి చేస్తూ ఉంటారు. మన కులమే నెక్ట్స్ పదేళ్ళు అధికారంలో ఉండాలి. మన కులం అంటేనే నాయకత్వానికి పేరు లాంటి మాటలు చాలా పెద్ద పదవుల్లో ఉన్నవాళ్ళే మాట్లాడారు.
కుల గజ్జిని ప్రజలందరికీ అంటించింది నాయకులు, మీడియా వాళ్ళే. ఇప్పుడు మళ్ళీ వాళ్ళే సుద్దులు చెప్పడానికి బయల్దేరారు. ఇక నుంచి అయినా కులాల ప్రాధాన్యతను తగ్గించే ప్రయత్నం చేస్తారా అంటే అది కూడా ఏమీ ఉండదు. మళ్ళీ ఎన్నికలు దగ్గరకు వచ్చేసరికి ఈ మీడియా వాళ్ళే కులాల రచ్చను ఓ స్థాయిలో రెచ్చగొడతారు. అందుకే ముందు ప్రజలకు సుద్దులు చెప్పడం మాని మీరు మారండి.
ఈ విషయంలో మాత్రం ముమ్మాటికీ తప్పు మీడియాది, నాయకులదే. మారడమంటే మాటల్లో అనుకునేరు……ఆలోచనల్లో, చేతల్లో కుల భావనలను మీరు విడనాడితే ప్రజల్లో కూడా మార్పొస్తుంది. కులం గురించి ప్రజలకు నీతులు చెప్పే స్థాయిని నాయకులు, మీడియా వాళ్ళు ఎప్పుడో కోల్పోయారు.