మహానటి ప్రాజెక్ట్‌ని చాలా ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దుతున్నాడు అశ్వనీదత్. సావిత్రి ఆత్మ కథంటే.. అందులో చాలా కీలకమైన పాత్రలు కనిపించాలి. ఆ విషయంలో అశ్వనీదత్ మరింత ఎక్కువ శ్రద్ద పెట్టారు. కీర్తి సురేష్, సమంత, సల్మాన్ దుల్కర్… ఇలా స్టార్లతో ఈ సినిమా నిండిపోయింది. ఆనాటి దర్శకుల పాత్రల్లో క్రిష్, తరుణ్ భాస్కర్ కనిపించబోతున్నారు. ఎస్వీఆర్‌గా మోహన్ బాబు నటిస్తున్నారు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలో చిత్రీకరణ జరుగుతోంది. అలనాటి మాయా బజార్ని ఫిల్మ్‌సిటీలో మళ్లీ ప్రతిష్టించారు. సావిత్రి కెరీర్లో మాయా బజార్ చిత్రం ఓ మేలిమి మలుపు. ఆ సినిమా చిత్రీకరణ సందర్భంగా కొన్ని ఆసక్తికరమైన సంగతులు జరిగాయి. వాటిని ఇప్పుడు వెండితెరకెక్కిస్తున్నారు. మాయా బజార్ సంగతులంటే… ఇప్పటికీ పూస గుచ్చినట్టు వివరిస్తుంటారు సింగీతం శ్రీనివాసరావు. ఎందుకంటే మాయా బజార్ కి ఆయన సహాయ దర్శకుడిగా పనిచేశారు.
అందుకే… ఆ సినిమాకి సంబంధించిన ప్రతీ విషయమూ ఆయనకు ఎరుకే. మాయా బజార్ సెట్లో ఏం జరిగేది? ఎవరెవరి మధ్య ఎలాంటి సంఘటనలు జరిగాయి? అప్పుడు వారెలా ప్రతిస్పందించారు? ఈ విషయాలన్నింటికీ ఆయనే ప్రత్యక్ష సాక్షి. అందుకే.. సింగీతం శ్రీనివాసరావుని సెట్లోకి ఆహ్వాచించింది చిత్రబృందం. ఆయన సమక్షంలోనే ‘మాయా బజార్’ చిత్రానికి సంబంధించిన సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. ఒక విధంగా ఈ సన్నివేశాలకు ఆయనే దర్శకుడు. ఎన్టీఆర్, ఏఎన్నార్ పాత్రధారుల్ని ఎంపిక చేయాల్సివుంది. అశ్వనీదత్ మదిలో.. ఎన్టీఆర్ గా ఎన్టీఆర్, అక్కినేని పాత్రలో చైతూ మెదులుతున్నా… వాళ్ల నుంచి ఇంకా గ్రీన్‌సిగ్నల్ రాలేదు. చూద్దాం… ఆ పాత్రలకు ఎవరు కుదురుతారో?