సిరివెన్నెల వెళ్ళిపోయారు. ఆయన గురించిన అనేక విశేషాలు అనేక మాధ్యమాల్లో ప్రసారం అవుతున్నాయి. ఇందులో త్రివిక్రమ్ స్పీచ్ లోని మాటలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. సిరివెన్నెల గురించి త్రివిక్రమ్ స్పీచ్ చాలా మందికి బైహార్ట్ గుర్తుంటుంది . ”సిరివెన్నెల గురించి చెప్పాలంటే నాకున్న పద సంపద సరిపోదు. ఆయన రాత్రి ఉదయించే సూర్యుడు. మనం సమాధానం చెప్పలేని ప్రశ్నలని మన మీదకి సంధిస్తాడు. నోబల్ స్థాయి వచన కవిత్వాన్ని రాయగల కవి.”ఇలా సాగుతుంది త్రివిక్రమ్ ప్రసంగం.
అయితే ప్రసంగం చివర్లో ‘ ఇంత గొప్ప సాహిత్యం రాయగల ఆయన సినిమా కవి అవ్వడం చేతే మన అందరి మధ్యలో అమాయకంగా వెనక చైర్లో కూర్చిండిపోయాడు. ఆయన సినిమా కవి కావడం ఆయన దురదృష్టం. మన అందరికీ అదృష్టం” అనే మాట వాడారు త్రివిక్రమ్. సిరివెన్నెల సినిమా కవి అవడం చేత ఆయనకి రావాల్సిన గుర్తింపు రాలేదనేది త్రివిక్రమ్ అభిప్రాయం.
అయితే త్రివిక్రమ్ అభిప్రాయాన్ని ఓ సందర్భంలో చాలా సున్నితంగా తిరస్కరించారు సిరివెన్నెల.”సినిమా కవి కావడం నా అదృష్టం. నా సాహిత్యాని సినిమా పాట గొప్ప వేదికని ఎప్పటికీ భావిస్తాను. నాకు చాలా సంతృప్తి వుంది. త్రివిక్రమ్ అభిప్రాయాన్ని గౌరవిస్తాను. కానీ సమర్ధించను. త్రివిక్రమ్ నాపై అమితమైన ప్రేమతో అలా మాట్లాడివుంటారు. సినిమా పాట రాయడం నా అదృష్టం. నాకు బోలెడంత ప్రతిష్ట వచ్చింది. సినిమా కవి కావడం చేతే ఇంతటి కీర్తి” అని తన అభిప్రాయాన్ని వెల్లడించారు సిరివెన్నెల. ఏదేమైనా త్రివిక్రమ్ చెప్పినట్లు.. సిరివెన్నెల సినిమా కవి కావడం మాత్రం మన అందరి అదృష్టం.