టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో తెలంగాణ సిట్ అధికారులు బండి సంజయ్ వెంట పడుతున్నారు. తమ ఎదుట హాజరు కావాల్సిందేనని పదే పదే నోటీసులు ఇస్తున్నారు. రేవంత్ రెడ్డికి నోటీసులు ఇచ్చిన తర్వాత బండి సంజయ్.. తనకు నోటీసులు ఇచ్చే ధైర్యం ఉందా అని సిట్ ను సవాల్ చేశారు. అలా సవాల్ చేసిన తర్వాతి రోజే నోటీసులు జారీ చేశారు. ఇరవై నాలుగో తేదీన రావాలని ఆదేశించారు. అయితే బండి సంజయ్ మాత్రం తాను రానని స్పష్టం చేశారు.
సిట్ మీద నమ్మకం లేదని సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపితే తన వద్ద ఉన్న ఆధారాలు ఇస్తానని ఆయన సిట్‌కు లేఖ రాశారు. అయితే ఈ లే్ఖను సిట్ పట్టించుకోలేదు. మరోసారి నోటీసులు జారీ చేసింది. ఆయన ఇంటికి వెళ్లి గోడకు అంటించారు అధికారులు. ఇలా అంటించేటప్పుడు మీడియాకు కూడా స మాచారం ఇచ్చారు. సిట్ ఆదే్శాల మేరకు రేవంత్ రెడ్డి విచారణకు హాజరయ్యారు. తన వద్ద ఉన్న సమాచారం ఇచ్చారు. అయితే రేవంత్ విచారణ ముగియక ముందే… తప్పుడు ప్రచారంచేశారని కేసు పెట్టే ఉద్దేశంలో సిట్ ఉన్నట్లుగా ప్రచారం చేశారు.
తర్వాత బండి సంజయ్ విషయంలోనూ అదే జరుగుతుందని అనుకున్నారు. కానీ బండి సంజయ్ హాజరు కాలేదు. మరోసారి నోటీసులు ఇచ్చినా ఆయన హాజరయ్యే అవకాశం లేదు. అసలు రాజకీయ ఆరోపణలకు ఇలా సిట్ నోటీసులు ఇచ్చి పిలువడమే ఆశ్చర్యం అనుకుంటే.. బయట చేసిన ఆరోపణలకు ఆధారాలివ్వలేదని కేసులు పెట్టే ఆలోచన చేస్తున్నామని లీకులివ్వడం మరో సంచలనం. మొత్తానికి బండి సంజయ్ సిట్ ఎదుట హాజరు కాకపోతే ఏం చేస్తారో చూడాల్సి ఉంది.