తెలంగాణ ప్రభుత్వ సమాచారం కూడా ఐటీ గ్రిడ్ వద్ద ఉందని.. హైకోర్టులో.. తెలంగాణ తరపు న్యాయవాదులు వాదించారు. రాజకీయ కక్షతో అక్రమ కేసులు పెట్టారంటూ.. ఐటీ గ్రిడ్ ఎండీ అశోక్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిగింది. పిటిషనర్ తరపున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ్ లూత్రా వాదనలు వినిపించారు. ఏపీ డేటాతో తెలంగాణకు ఏం సంబంధం లేదని.. అసలు కేసును తెలంగాణ పోలీసులకు విచారించే అధికారమే లేదని స్పష్టం చేశారు. కుట్ర పూరితంగా ఒక ఎఫ్ఐఆర్ కాకుండా… రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారన్నారు. రాజకీయ దురుద్దేశ్యమే తప్ప…. ఇందులో ఏమీ లేదని వాదించారు. సిట్ తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ భిన్నమైన వాదనలు వినిపించారు. ఏపీకి సంబంధించిన డేటానే కాదు…తెలంగాణ డేటా కూడా చోరీ అయ్యిందన్నారు. ఐటీ గ్రిడ్ కంపెనీ ద్వారా అక్రమాలు జరిగినట్టు ఆధారాలు ఉన్నాయన్నారు.
విచారించే అధికారం తెలంగాణ పోలీసులకు ఉందిన్నారు. ఐటీ గ్రిడ్ కంపెనీ హైదరాబాద్‌లోనే ఉందని.. డేటా అనలిస్ట్ బహిర్గతం చేస్తేనే ఈ విషయం బయటకు వచ్చిందన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం కేసును వచ్చే బుధవారానికి వాయిదా వేసింది. ఐటీ గ్రిడ్ అశోక్‌కు.. పోలీసులు ఎన్ని సార్లు నోటీసులు జారీ చేసినా హాజరు కావడం లేదు. ఆయన కోసం నాలుగు బృందాలు వెదుకుతున్నాయని చెబుతున్నారు కానీ.. ఎలాంటి పురోగతి లేదు. మరో వైపు.. ఐటీ గ్రిడ్ నుంచి తీసుకొచ్చిన ట్యాబ్ లు, ల్యాప్ ట్యాప్‌లు, సీపీయూల్లో ఏ సమాచారమూ లభ్యం కాలేదని సిట్ వర్గాలు చెబుతున్నాయి. కొన్నింటికి పాస్వర్డ్ ప్రొటెక్షన్ ఉండటంతో.. ప్రైవేటు నిపుణులతో తెరిపించే ప్రయత్నాలు చేస్తున్నారు. అమెజాన్
వెబ్ సర్వీస్,గూగుల్ కు సమాచారం లేఖలు రాసినా.. ఆ సంస్థలు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. దీంతో.. సిట్ తదుపరి ఏం చేయాలన్నదానిపై.. ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేకపోతోంది. ఆధారాలు లేవని చెబితే.. కోర్టులో అక్షింతలు పడతాయి.. విచారణ కొనసాగిస్తే… అశోక్ దొరికితే.. ఏవైనా ఆధారాలు సేకరించవచ్చని సిట్ అధికారులు భావిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. మొదట్లో.. ఏపీ డేటా అని చెప్పిన పోలీసులు .. అలా చెబితే.. కేసు బదిలీ చేస్తారన్న ఉద్దేశంతో.. తెలంగాణ డేటా కూడా ఉందనే వాదన వినిపిస్తున్నారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.