అనగనగా ఇద్దరు మిత్రులు. ఓ మిత్రుడు అప్పుల్లో ఇరుక్కుని … కేసుల పాలైతే.. తనకు ఉన్న చిన్న చిన్న రెండు ఇళ్లు ఆ అప్పుల వాళ్లు ఎక్క డ తీసుకుంటారోనని మిత్రుడి పేరు మీదకు మార్చాడు. ఆ మిత్రుడు అసలు ఆ కుటుంబమే లేకపోతే ఆ రెండు ఇళ్లు తనవే కదా అని ఆశపడ్డాడు. ఫలితంగా ఆరు ప్రాణాలు తీశాడు. మరో ముసలామెను చంపే ప్రయత్నంలో దొరికిపోయాడు. అంతా కలిపి ఆ ఇళ్ల విలువ ఇరవై లక్షలు ఉంటుంది. ఆ ఇళ్లు కూడా ఉండేది.. గ్రామాల్లో.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా మక్లూర్ లో ఒకే కుటుంబంలో ఆరుగురి హత్య జరిగింది. 15 రోజుల వ్యవధిలోనే ఒక్కొక్కరిని ఓ నిందితుడు హతమార్చాడు. మక్లూర్కు చెందిన ప్రశాంత్, ప్రసాద్ స్నేహితులు. ప్రసాద్ కు అప్పులు అయ్యాయి. ప్రసాద్ కుటుంబం గ్రామాన్ని వదిలేసి మాచారెడ్డికి వెళ్ళిపోయి స్థిరపడింది. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు, ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. ప్రసాద్ కు మాక్లుర్ లో రెండు ఇళ్లు ఉన్నాయి.
లోన్ ఇప్పిస్తానని చెప్పి ప్రశాంత్ తన పేర మీద ఇళ్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. కానీ లోన్ రాలేదు. ప్రసాద్ కుటుంబాన్ని చంపేస్తే తనకే ఇళ్లు దక్కుతాయని.. ఆ కుటుంబాన్ని చంపేయాలని ప్లాన్ చేసుకున్నాడు. మొదట పథకం ప్రకారం ప్రసాద్ ను బయటకు తీసుకెళ్ళి, నిజామాబాద్-కామారెడ్డి జాతీయ రహదారి అటవీ ప్రాంతంలో హత్య చేశాడు. మరుసటి రోజు ప్రసాద్ ఇంటికి వెళ్ళి.. మీ భర్తను పోలీసులు అరెస్టు చేశారని నమ్మించి ఆమెను కూడా బయటకు తీసుకెళ్ళాడు. పథకం ప్రకారమే ఆమెను కూడా హతమార్చి, శవాన్ని బాసర నదిలో వదిలేశాడు.
ఆ తర్వాత ప్రసాద్ పెద్ద సోదరిని హత్య చేశాడు. ఇద్దరు పిల్లలను సోన్ బ్రిడ్జి సమీపంలో.. ప్రసాద్ చిన్న సోదరిని మాచారెడ్డి సమీపంలో హత్య చేసినట్లు సమాచారం. చివరికి ప్రసాద్ తల్లిని కూడా చంపాలనుకున్నారు. కానీ ఈ లోపు పోలీసులకు క్లూ దొరికింది. ముసలామె బతికింది. ప్రశాంత్ వయసు 24 ఏళ్లు మాత్రమే. ఆరుగుర్ని అందులోనూ ఇద్దరు పిల్లల్ని ఘోరంగా చంపిన ప్రశాంత్ మానసిక స్థితి పోలీసుల్ని సైతం భయపెట్టేలా ఉంది.