జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు విదేశాలకు వెళ్లినా ఏపీలో అల్లర్లు జరుగుతాయి. ఓ సారి కోనసీమను తగులబెట్టారు. ఇంకోసారి చంద్రబాబును అరెస్టు చేశారు. ఈ సారి లండన్ కు వెళ్లారు. కౌంటింగ్ అనంతరం రావణకాష్టం చేయడానికి ఏర్పాట్లు చేసేస్తున్నారు. దీనికి సంబంధించిన పక్కా సమాచారం రావడంతో ఇంటలిజెన్స్ ఈసీని హెచ్చరించింది. ఇంటలిజెన్స్ హెచ్చరికలపై మీడియాకు తెలిసింది కొంతే కానీ.. అసలు కుట్ర గురించి పూర్తి సమాచారం వచ్చిందని .. ఎవరెవరు.. ఎక్కడెక్కడ ప్లాన్ చేస్తున్నారో స్పష్టత రావడంతోనే రెడ్ అలర్ట్ ప్రకటించి మరీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారన్న వాదన వినిపిస్తోంది.
వైసీపీ ఐదేళ్ల కాలంలో ప్రజల్ని భయం గుప్పిట్లో పెట్టి పరిపాలించారు. పోలింగ్ సమయంలోనూ అదే చేయాలనుకున్నారు. జగన్ అడుగులకు మడుగులొత్తే అరాచకశక్తులుగా పేరున్న చెవిరెడ్డి, పిన్నెల్లి, కేతిరెడ్డి వంటి వారు ఉన్న చోట్ల హత్యలకూ వెనుకాడలేదు. ఊళ్లపై వందల మందితో పడి విధ్వంసం చేశారు. ఇక ఎన్నికల ఫలితాలు అనుకూలంగా రాకపోతే… చేయాల్సినంత విధ్వంసం చేయడానికి ముందుగానే ఏర్పాట్లు చేసుకున్నారన్న సమాచారం వచ్చినట్లుగా తెలుస్తోంది.
పోలీసు అధికారులు ఇప్పటికే ఎక్కడెక్కడ అల్లర్లకు ప్లాన్ చేశారో సమాచారం రావడంతో ముందు జాగ్రత్తగా ఆయా ప్రాంతాల్లో మార్చ్ ఫాస్ట్ నిర్వహిస్తున్నారు. మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్నారు. కాల్పులు జరిపేందుకూ వెనుకాడబోమన్న సంకేతాలు పంపుతున్నారు. గతంలో ఎప్పుడూ ఇంత తీవ్రమైన కసరత్తును పోలీసులు చేయలేదు . ఇప్పుడు ప్రతి క్షణం అలర్ట్ గా ఉండాల్సిన పరిస్థితి. పోలీసు వ్యవస్థలోనూ.. కొంత మంది వైసీపీ కి ఇన్ ఫార్మర్లుగా పని చేస్తూ.. వ్యవస్థ పని తీరును దిగజారుస్తున్నారు. ప్రభుత్వ పెద్దలు కూడా హింస జరగాలన్నట్లుగా ఉంటున్నారు. దీంతో ప్రజల ప్రాణాలకు గ్యారంటీ ఉండటం లేదు.
ఏపీలో కౌంటింగ్ తర్వాత పరిస్థితులు ఎలా ఉండాలో.. ఎంత భయంకరంగా ఉండాలో డిసైడ్ చేయడానికి ప్లాన్ చేయడానికే జగన్ లండన్ వెళ్లారన్న అనుమానాలను టీడీపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా ఏపీలో కౌంటింగ్ అనంతర పరిస్థితులు అత్యంత దారుణంగా ఉండే అవకాశం ఉంది.