ప్రభాస్ చేతిల్లో చాలా సినిమాలే ఉన్నాయి. అయితే.. వాటిలో ఎలాంటి బజ్ లేని సినిమా… `ఆదిపురుష్` మాత్రమే. దానికి చాలా కారణాలున్నాయి. ఆదిపురుష్ మనందరికీ తెలిసిన రామయణ గాథే. రాముడిగా ప్రభాస్ అంటే…. ఫ్యాన్స్ ఎగ్జైట్ అయ్యారు తప్ప, మిగిలిన వాళ్లలో చాలా అపనమ్మకాలున్నాయి. రాముడంటే.. మనకు ఎన్టీఆరే. ఆ తరవాత.. ఆ పాత్రలో ఎవరు కనిపించినా ఆ స్థాయిలో మెప్పించలేకపోయారు. ఆఖరికి బాలకృష్ణతో సహా. అలాంటప్పుడు ఆ ఇమేజ్‌కి ప్రభాస్ ఎలా మ్యాచ్ అవుతాడా? అనుకొన్నారు. దానికి తగ్గట్టు ఈ సినిమాలో గ్రాఫిక్స్ హంగులు ఎక్కువ అయ్యాయి. టీజర్లో చూపించిన విజువల్ ఎఫెక్ట్స్‌కి అంతా కళ్లు తేలేశారు. హనుమాన్ పాత్రపై విమర్శలు వచ్చాయి. సైఫ్ అలీఖాన్ రావణుడిగా సెట్ కాలేదన్నారు. సీత పాత్రలో కనిపించే స్థాయి కృతి సనన్‌కి లేదన్నారు. ఇలా… కాస్టింగ్ మిస్ మ్యాచ్ అయిపోయింది. కేవలం ప్రభాస్‌కి ఉన్న క్రేజ్ ని వాడుకొని, హిందుత్వ అజెండాని దేశమంతా విస్తరింపచేయడానికి ఈ సినిమా తీస్తున్నారన్న విమర్శలు ఎక్కువయ్యాయి.
అయితే…ఈ పరిస్థితులు, సమీకరణాలు అనూహ్యంగా మారుతున్నాయి. ఆదిపురుష్ గురించి ప్రభాస్ అభిమానులే కాదు.. సాధారణ ప్రేక్షకులూ మాట్లాడుకొంటున్నారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ తో ఈ సినిమాపై హోప్స్ మొదలయ్యాయి. ట్రైలర్ మరీ అద్భుతంగా లేదు కానీ.. చూడదగిన సినిమా అన్నట్టే కనిపిస్తోంది. ముఖ్యంగా ప్రభాస్ ఆహార్యానికి, స్క్రీన్ ప్రెజెన్స్‌కి ఫుల్ మార్క్స్ పడిపోయాయి. ట్రైలర్లో కొన్ని డైలాగులూ మనసుని హత్తుకొన్నాయి. టీజర్ లో విజువల్స్ చూసి నొసలు చిట్లించినవాళ్లంతా ఇప్పుడు కాస్త సర్దుకొన్నారు. 3డీలో ఆ విజువల్స్ ఇంకా అద్భుతంగా ఉంటాయన్న సంగతి అర్థమవుతోంది. ఆదిపురుష్ నుంచి వచ్చిన `జై శ్రీరామ్..` పాట ఈ సినిమాపై ఇంకాస్త గౌరవాన్ని పెంచింది. ఇన్ని రామాయణాలు తీసినా.. అందులో వానర సైన్యం గురించి పెద్దగా ప్రస్తావించిన దాఖలాలు లేవు. ఈ సినిమాలో ఆ ఎపిసోడ్ కి కీలక ప్రాధాన్యం ఇచ్చినట్టు అర్థమవుతోంది. వానరసైన్యం రావణ లంకపై దాడి చేస్తున్నప్పుడు వచ్చే పాట ఇది. ఈ పాట వినడానికీ, చూడ్డానికీ బాగుంది. ఈ పాటతో.. ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. జూన్ 16న ఈ సినిమా వస్తోంది. అంటే.. ప్రమోషన్లకు చాలా టైమ్ ఉన్నట్టే లెక్క. ఈలోగా ఇంకాస్త కంటెంట్ ఈ సినిమా నుంచి బయటకు వస్తుంది. అవి కూడా బాగుంటే… ఆదిపురుష్ కి కూడా బాహుబలి రేంజ్లో ఓపెనింగ్స్ వచ్చే అవకాశాలున్నాయి.